Begin typing your search above and press return to search.

వైరల్‌ గా పవన్‌ కల్యాణ్‌ సంచలన ట్వీట్‌!

By:  Tupaki Desk   |   9 Dec 2022 6:30 AM GMT
వైరల్‌ గా పవన్‌ కల్యాణ్‌ సంచలన ట్వీట్‌!
X
జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఈసారి మెరుగైన స్థానాలను సాధించాలని ఆశిస్తున్నారు.. పవన్‌. ఇప్పటికే జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు. అలాగే జనవాణి పేరుతో ప్రజల సమస్యలు తెలుసుకునే కార్యక్రమాన్ని పలు జిల్లాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వారి సమస్యలపై అర్జీలు స్వీకరించారు.

వచ్చే ఎన్నికల నేపథ్యంలో పవన్‌ ముందుగా రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని సంకల్పించారు. అయితే భద్రతాపరమైన సమస్యలు, తనను చూడటానికి వచ్చే వారితో భారీగా కాలాపహరణం అయ్యే పరిస్థితులు ఉండటంతో దాన్ని విరమించుకున్నారు. బస్సు యాత్ర చేయాలని సంకల్పించారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే బస్సు సిద్ధమైంది. ఆర్మీ వాహనాల మాదిరిగా ఆలివ్‌ గ్రీన్‌ రంగులో బస్సును సిద్ధం చేశారు. దానికి దుర్గమ్మ పేర్లలో ఒకటైన వారాహి పేరును పెట్టారు. ఈ బస్సు దాడులను తట్టుకునేలా, బస్సులోనే ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించుకునేలా జైన్‌ చేశారు.

అలాగే ప్రభుత్వం తన యాత్రను అడ్డుకుని.. కరెంట్‌ తీసివేస్తే వాహనంలోనే ఫ్లడ్‌ లైట్లు వేసేలా కూడా ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే ఆధునిక సౌండ్‌ సిస్టమ్‌ కూడా ఉంది.

కాగా పవన్‌ బస్సుపై వైఎస్సార్‌సీపీ నేతలు అప్పుడే విమర్శలు మొదలుపెట్టారు. పవన్‌ కల్యాణ్‌ బస్సుకు రవాణా శాఖ అనుమతి ఇవ్వదని అంటున్నారు. సాధారణ వాహనాలు ఆర్మీ రంగులో ఉండటానికి నిబంధనలు ఒప్పుకోవని చెబుతున్నారు. అంతేకాకుండా పవన్‌ పసుపు రంగు వేసుకుంటే సూట్‌ అవుతుందని.. పరోక్షంగా పవన్‌ టీడీపీ మనిషేనని ఎద్దేవా చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి పేర్ని నాని పవన్‌ బస్సు యాత్రపై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో పవన్‌ సంచలన ట్వీట్‌ చేశారు. మొదట వారు తన సినిమాలను అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత విశాఖపట్నం వెళ్తే తనను ర్యాలీ చేయకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. వాహనం నుంచి బయటకు రానీయలేదన్నారు. హోటల్‌ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. తనను విశాఖ నగరం వదిలేసి వెళ్లాలని బలవంతం చేశారన్నారు. అలాగే మంగళగిరిలోనూ తన కారును వెళ్లనివ్వలేదని చెప్పారు. ఆ తర్వాత తాను నడవటానికి కూడా ఒప్పుకోలేదన్నారు. ఇక ఇప్పుడు నా వాహనం రంగు వారికి సమస్యగా మారిందని ధ్వజమెత్తారు. ఇక ఆ తర్వాత నా ఊపిరి ఆగిపోవాలని అని కోరుకుంటున్నారా అని సంచలన ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్‌ లో పవన్‌ తన సినిమాలకు అతి తక్కువ టికెట్‌ ధరలు నిర్ణయించడం, విశాఖలో తన పర్యటనను పోలీసులు అడ్డుకోవడం, హోటల్‌ నుంచి బయటకు రానీయకపోవడం, విశాఖ వదిలి వెళ్లిపోవాలని బెదిరించడం, ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతకు గురయిన బాధితులను పరామర్శించడానికి వెళ్తుంటే వెళ్లనీయకపోవడం వంటి విషయాలను ప్రస్తావించారు. ఇప్పుడీ ఈ ట్వీట్‌ వైరల్‌ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.