పలాస ఎమ్మెల్యే అల్లుడికీ జీఎస్టీ కట్టాలన్న పవన్!

Wed May 23 2018 10:16:50 GMT+0530 (India Standard Time)

Pawan Kalyan Ultimate Satire on TDP MLA Son in Law at Palasa

తెలుగుదేశం పార్టీలో అవినీతి ఏ స్థాయిలో కూరుకుపోయిందన్న విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరచూ ప్రస్తావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును సునిశితంగా విమర్శిస్తున్న పవన్.. తాను ప్రసంగించిన ప్రతిచోటా బాబు పార్టీ నేతల అవినీతిపై ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి బాబు కుమారుడు కమ్ మంత్రి లోకేశ్ అవినీతిపై పలు వేదికల మీద మట్లాడారు. మీ అబ్బాయి అవినీతి గురించి మీకు సమాచారం అందుతుందా? అంటూ పార్టీ ఆవిర్భావ ప్లీనరీలో ప్రస్తావించటం ద్వారా సంచలనం సృష్టించిన పవన్.. అప్పటి నుంచి తరచూ బాబు సర్కారులోని అవినీతిని తరచూ ప్రస్తావిస్తున్నారు.



ప్రస్తుతం పోరాట యాత్ర పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్ పర్యటిస్తున్నారు. మొత్తం 45 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ప్రస్తుతం.. పవన్ యాత్ర శ్రీకాకుళంలో సాగుతోంది. కాశీబుగ్గలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. స్థానిక ఎమ్మెల్యే (పలాస) అల్లుడి అవినీతి భాగోతాన్ని ప్రస్తావించిన సంచలనం సృష్టించారు.

ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో పన్నులు కడుతున్న ప్రజలు.. పలాసాలో ఎమ్మెల్యే అల్లుడికీ వ్యాపారులు జీఎస్టీ చెల్లించాల్సి వస్తోందంటూ మండిపడ్డారు. ఇలాంటి వాటిపై ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. టీడీపీ సర్కారులో భూకబ్జాలు ఎక్కువయ్యాయని చెప్పిన పవన్.. పలాసాలో భూకబ్జాలు ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోయిన వైనాన్ని ప్రస్తావించారు.

పవన్ నోటి నుంచి స్థానిక ఎమ్మెల్యే అల్లుడి ప్రస్తావన వచ్చినప్పుడు.. సభకు హాజరైన ప్రజల్లో విశేష స్పందన రావటం గమనార్హం. ప్రజల్లో ప్రభుత్వం పట్ల.. స్థానిక నాయకత్వం మీదా వ్యతిరేకత ఇంత భారీగా పెరిగిన వైనాన్ని చంద్రబాబు ఎందుకు గుర్తించటం లేదన్నది ప్రశ్నగా మారింది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో అవినీతి మీద అదే పనిగా మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పుడు తన ప్రభుత్వంలోనూ అంతే తీవ్రతతో అవినీతి భాగోతాలు బయటకు వస్తున్నా కిమ్మనని పరిస్థితి. ఇదిలా ఉంటే.. మొన్నటి వరకూ మిత్రుడిగా ఉన్న పవన్.. టీడీపీ తమ్ముళ్ల భాగోతాలు బయటపెట్టటం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.