వచ్చే ఎన్నికలు.. పవన్ మొదటి టార్గెట్ ఇదేనా?

Mon Sep 26 2022 10:37:59 GMT+0530 (India Standard Time)

Pawan Kalyan Target on AP Assembly Elections

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తాను నిరూపించుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 7 శాతం ఓట్లు సాధించిన జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా రాజోలులో మాత్రమే గెలవగలిగింది. పవన్ పోటీ చేసిన గాజువాక భీమవరం రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. అయితే ఏమాత్రం నిరాశ చెందకుండా అప్పటి నుంచి రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల జోలికి రాకుండా సినిమాలు చేసుకుంటారని ఊహించిన వైఎస్సార్సీపీకి ఈ విషయంలో అశనిపాతమే ఎదురైంది. పవన్ లేకుంటే ఏపీలో అత్యధికంగా ఉన్న కాపు సామాజికవర్గ ఓట్లన్నీ గంపగుత్తగా కొట్టేయాలని వైఎస్ జగన్ ఆశించారని అంటారు. అయితే ఆయన ఆశలు నెరవేరలేదు.ఎన్నికల్లో ఓడిన నాటి నుంచే పవన్ దూకుడుగా వ్యవహరిస్తూ వచ్చారు. భవన నిర్మాణ కార్మికుల విషయంలో అధ్వాన్న స్థితిలో ఉన్న రోడ్ల గురించి సినిమా టికెట్ల ఆన్‌లైన్ వ్యవహారం ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇలా జగన్ ప్రభుత్వానికి వివిధ అంశాల్లో ఏకుకు మేకులా మారారు. దీంతో వైఎస్సార్సీపీ మంత్రులు నేతలు సానుభూతిపరులు ఆయనపై బూతుల దాడికి వ్యక్తిగత విమర్శల దాడికి దిగిన సంగతి తెలిసిందే.

అయినా సరే ఎక్కడా వెరవని పవన్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తన సత్తాను నిరూపించుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన ఏడు శాతాన్ని కనీసం 25 శాతం నుంచి 35 శాతానికి చేర్చాలనే తలంపుతో ఉన్నారు. అంతేకాకుండా జనసేన పార్టీ తరఫున పదుల సంఖ్యలో అయినా ఎమ్మెల్యేలను అసెంబ్లీలో నిలపాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. అన్ని సమీకరణాలు కాలం కలసివస్తే కింగ్ మేకర్‌గా నిలవాలని కూడా ఆశిస్తున్నారు.

ఈ క్రమంలో పవన్ మొదటి టార్గెట్‌గా తాను ఎమ్మెల్యేగా విజయం సాధించడంపై దృష్టిపెట్టారని అంటున్నారు. ఈ క్రమంలో పవన్ కు అనువైన స్థానంపై జనసేన పార్టీ  అగ్ర నేతలు పరిశీలన చేస్తున్నారని చెబుతున్నారు. అలాగే వివిధ సర్వే సంస్థల సాయం తీసుకుంటున్నారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన భీమవరం గాజువాకల్లో పవన్‌ను ఓడించడానికి వైఎస్సార్సీపీ ఒక్కోచోట రూ.250 కోట్లకు పైగా ఖర్చు పెట్టిందనే ప్రచారం జరిగింది. ఈసారి కూడా పవన్ పోటీ చేసే చోట ఆయనను ఓడించడానికి జగన్ అన్ని శక్తులను ప్రయోగించడం ఖాయం. అందులోనూ ఇప్పుడు ఆయన అధికారంలో కూడా ఉన్నారు కాబట్టి చతురంగ బలాలతో పవన్ ను చుట్టుముట్టడం ఖాయం.

ఈ నేపథ్యంలో పవన్ తాను గెలవడంతోపాటు జనసేనకు కూడా మంచి ఫలితాలు సాధించిపెట్టాల్సి ఉంది. మరోవైపు పవన్ ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు భవదీయుడు భగత్ సింగ్ చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఇంకా ఒకటి రెండు సినమాలకు ప్రకటన కూడా వచ్చింది.

మరోవైపు ఏపీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలు రంకెలు వేస్తున్నారు. పవన్ ను అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వబోమని చాలెంజులు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఈ సవాళ్లను అధిగమించి తన సత్తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే జనసేన బాగా బలపడిందని విమర్శకులు సైతం అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీకి షాకివ్వాలనే యోచనలో పవన్ ఉన్నారని అంటున్నారు. తన మొదటి టార్గెట్‌గా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగపెట్టడమే ధ్యేయంగా ఉన్నారని చెబుతున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.