పీకే సంచలనం..ఏపీ ప్రజల్లో ఆ కాంక్ష లేదట

Mon Jun 24 2019 22:09:10 GMT+0530 (IST)

Pawan Kalyan Sensational Comments on Andhra People over Andhra Special Status

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంతదాకా అయినా వెళతామని - హోదా సాధన పోరులో ప్రజల ముందుండి నడుస్తానని గంభీర ప్రకటనలు చేసిన జనసేనాని పవన్ కల్యాణ్... యూటర్న్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీసుకున్న యూటర్న్ లతో ఏపీకి ప్రత్యేక హోదా ప్రమాదంలో పడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే... హోదా ఉద్యమం నుంచి తాను కూడా తప్పుకుంటున్నానని పవన్ చెప్పినట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉందన్న వాదన వినిపిస్తోంది. ఏపీకి హోదా కోసం విపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి తనదైన శైలిలో పోరాటం చేసిన వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తన పోరును మరింతగా పెంచేశారు.ఇలాంటి తరుణంలో విపక్షంగా ఉన్న జనసేన అధికార పక్షానికి మద్దతుగా నిలవాల్సిందిపోయి... రాష్ట్రానికి హోదా వచ్చేది కష్టమేనంటూ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారిపోయింది. జనసేన కమిటీలను ప్రకటించేందుకు సోమవారం మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా పలు అంశాలపై మాట్లాడిన పవన్... ఏపీకి హోదా సాధన అంశంపైనా తనదైన శైలి వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారని చెప్పాలి. అంతేకాకుండా ఏపీకి ప్రత్యేక హోదా సాధన ఉద్యమంలో ఏపీ ప్రజలకు చిత్తశుద్ధి లేదన్నట్లుగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలమే రేపుతున్నాయి. తెలంగాణ ప్రజలతో ఏపీ ప్రజలను పోలుస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగానే ఏపీలో ఆగ్రహావేశాలను రగిలించేశాయన్న వాదన వినిపిస్తోంది.

అయినా ఈ దిశగా పవన్ చేసిన వ్యాఖ్యలేమిటన్న విషయానికి వస్తే... ‘అనుకున్నది సాధించుకోవడంలో తెలంగాణ ప్రజలకు ఉన్న పట్టుదల - ఆకాంక్ష ఆంద్రా ప్రజలకు లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అక్కడి ప్రజలు దశాబ్దాలుగా పోరాడితే... ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రా ప్రజలు అంతటి ఆకాంక్షను చూపలేకపోయారు. చంద్రబాబు పదిసార్లు మాటలు మార్చినా ప్రజల నుంచి సరైన నిరసన రాలేదు. ప్రజల నుంచి బలమైన నిరసన రానంతవరకు హోదా విషయంలో మేమేమీ చేయలేం. హోదా సాధన విషయంలో ఆంధ్రా ప్రజలకు బలమైన కాంక్ష ఉంటే తప్ప ఎవరూ ఏమీ చేయలేరు’ అంటూ పవన్ తనదైన శైలిలో చెప్పుకుపోయారు. అంటే ప్రజలను ముందుండి ఉద్యమ బాటన నడిపించేందుకు తామేమీ సిద్ధంగా లేమన్న కోణంలోనే పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. మొత్తంగా ఈ వ్యాఖ్యలతో ప్రత్యేక హోదా ఉద్యమం నుంచి తాను తప్పుకుంటున్నట్లుగానే పవన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ీఆ మాటను నేరుగా చెప్పకుండా.. తన లోపాన్ని ప్రజలపైకి నెట్టేసేందుకే ఆయన యత్నించారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.