పవన్ సత్తా ఏంటో తేలిపోయిందా ? లొంగిపోయిన జనసేనాని

Fri Nov 20 2020 23:00:01 GMT+0530 (IST)

Pawan Stamina revealed? Surrendered Janasena

తెలంగాణాలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సత్తా ఏమిటో తేలిపోయింది. ఎన్నికలకు ముందే బీజేపీ ఒత్తిడికి లొంగిపోయారు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించిన 48 గంటల్లోనే పోటీ నుండి జనసేన విత్ డ్రా చేసుకుంటున్నట్లు శుక్రవారం సాయంత్రం ప్రకటించటం ఆశ్చర్యమేసింది. తమ ఓట్లు చీలిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పవన్ తన ప్రకటనను సమర్ధించుకునేందుకు నానా అవస్తలు పడాల్సొచ్చింది.తమ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలిపోకూడదన్న ఉద్దశ్యంతోనే జనసేన ఎన్నికల నుండి విరమించుకుంటున్నట్లు చెప్పటం పవన్ కే చెల్లింది. ఎందుకంటే జనసేనకున్న ఓటింగ్ ఏమిటో ఎవరికీ తెలీదు. ఇక బీజేపీకి కూడా పెద్దగా ఓటింగ్ లేదనే చెప్పాలి. ఏదో మొన్నటి దుబ్బాక ఉపఎన్నికల్లో అనూహ్యంగా గెలవటంతో కమలనాదులు ఎగిరెగిరి పడుతున్నారంతే. మొత్తం 150 డివిజన్లలో మహా అయితే బీజేపీ సింగిల్ డిజిట్ దాటుతుందనే నమ్మకం పార్టీ నేతల్లోనే లేదు. పోయిన ఎన్నికల్లో బీజేపీ గెలిచింది 2 డివిజన్లు మాత్రమే.

ఏపిలో తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. తిరుపతి పోటీ విషయంలో తనతో మాట మాత్రమైనా మాట్లాడకుండానే వీర్రాజు ప్రకటన చేయటంతో పవన్ బాగా మంటమీదున్నారట. అందుకనే దానికి బదులు తీర్చుకునే ఉద్దేశ్యంతోనే గ్రేటర్ ఎన్నికల్లో పవన్ ఏకపక్షంగా ప్రకటన చేసినట్లుందని కమలం పార్టీలో అనుమానాలున్నాయి. నిజానికి పోటీ చేసే ఉద్దేశ్యంతో పవన్ ప్రకటన చేయలేదని బీజేపీ నేతలను దారికి తెచ్చుకుని పొత్తుల పేరుతో ఏవో కొన్ని సీట్లలో పోటీ చేయాలన్నదే పవన్ ఉద్దేశ్యమట.

అయితే పవన్ ప్లాన్ ఎలాగున్నా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అసలు పట్టించుకోనే లేదు. జనసేనతో తమకు పొత్తు లేదంటు బహిరంగంగానే ప్రకటించేశారు. దాంతో పవన్ కు పరువుకాపాడుకోవాల్సిన సమస్య వచ్చేసింది. ఇందులో భాగంగానే తెరవెనుక జరిగిన మంత్రాంగం కారణంగా శుక్రవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ జనసేనానితో చర్చలు జరిపారు. దానికి మిత్రపక్షాల ఓట్లు చీలకుండా ఉండటమే ముఖ్య ఉద్దేశ్యం అనే కలరింగ్ ఇచ్చుకున్నారు.

జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ ఇంట్లో జరిగిన సమావేశం తర్వాత కిషన్ రెడ్డి అయినా లక్ష్మన్ అయినా చివరకు పవన్ అయినా తమ పార్టీల మధ్య పొత్తుంటుందని ఎక్కడా ప్రకటించలేదు. పైగా ఈ చర్చలకు తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ హాజరుకాలేదు. అంటే జనసేనను బండి పెద్దగా పట్టించుకోవటం లేదనే విషయం అర్ధమైపోతోంది. ఒంటరిగా పోటీ చేయలేక అలాగని విత్ డ్రా చేసుకోలేక పవన్ పడిన అవస్తలు అందరికీ అర్ధమైపోతున్నాయి. అందుకనే చివరకు కిషన్ లక్ష్మణ్ రాయబారానికి లొంగిపోయిన పవన్ ప్రచారానికి మాత్రమే పరిమితమైపోయారు.