Begin typing your search above and press return to search.

14 రోజులుగా కరోనా రోగి అదృశ్యం.. ఆస్పత్రి టాయిలెట్‌ లో శవమై కనిపించాడు ..ఏంజరిగింది ?

By:  Tupaki Desk   |   27 Oct 2020 10:10 AM GMT
14 రోజులుగా  కరోనా రోగి అదృశ్యం.. ఆస్పత్రి టాయిలెట్‌ లో శవమై కనిపించాడు ..ఏంజరిగింది ?
X
14 రోజుల కిందట అదృశ్యమైన ఓ టీబీ బాధితుడు ఆస్పత్రిలోని టాయిలెట్లో శవమై కనిపించడం కలకలం సృష్టించింది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని శివాడి ప్రాంతంలో ఉన్న టీబీ హాస్పిటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, బృహత్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఆస్పత్రికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

హాస్పిటల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాబన్‌ యాదవ్‌ అనే వ్యక్తి టీబీ వ్యాధితో కొన్ని రోజుల కిందట హాస్పిటల్‌ లో జాయిన్ అయ్యాడు. కరోనా పరీక్షల్లో అతడికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీనితో అతడికి అక్కడే చికిత్స అందిస్తున్నారు. అయితే.. కొన్ని రోజుల కిందట అతడు హాస్పిటల్ నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంలో హాస్పిటల్ సిబ్బంది అక్టోబర్‌ 4న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూర్యాబన్ యాదవ్ అదృశ్యమైన 14 రోజుల తర్వాత హాస్పిటల్ టాయిలెట్లలో శవమై కనిపించాడు. హాస్పిటల్‌లో పనిచేసే ఓ వార్డ్‌ బాయ్‌, ఆ టాయిలెట్‌ గది నుంచి దుర్వాసన రావడం గమనించి తలుపులు పగలగొట్టి చూడగా సూర్యాబన్‌ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది.

హాస్పిటల్‌లో రోగి మరణిస్తే 14 రోజులుగా మృతదేహాన్ని గుర్తించకుండా ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణకు సహకరించాలంటూ హాస్పిటల్ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. రాక్‌ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్ ‌లో ఈ ఘటనపై కేసు నమోదైంది. సూర్యాబన్‌ మృతికి సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తామని, ఒక మృతదేహాన్ని ఇన్ని రోజులు గుర్తించకుండా ఎలా ఉన్నారో ఆస్పత్రి సిబ్బందిని ఆరా తీస్తున్నారు పోలీసులు.