Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై పనబాక రగిలిపోతోందా?

By:  Tupaki Desk   |   26 Nov 2020 12:30 AM GMT
చంద్రబాబుపై పనబాక రగిలిపోతోందా?
X
ఇష్టం లేకుండానే తిరుపతి టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీ ఎంపికైందా? ఆమెను సంప్రదించకుండానే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నియామకం చేశారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. తాజాగా తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ రగిలిపోతోందట.. క్షేత్రస్థాయిలో పార్టీకి గడ్డు పరిస్థితులున్న సమయంలో అభ్యర్థిత్వాన్ని చెప్పా పెట్టకుండా ప్రకటించారని ఆమె వాపోతున్నట్టు సమాచారం.

బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకుంటే అనవసరంగా చంద్రబాబు తన పేరును తిరుపతి ఎంపీగా ప్రకటించారని.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగాలో అర్థం కావడం లేదని పనబాక వాపోతున్నట్టు ప్రచారం సాగుతోంది. చంద్రబాబు తీరు ఏం బాగోలేదని.. నా డిమాండ్లు పరిష్కరిస్తేనే తిరుపతి ఎంపీగా పోటీచేస్తానని ఆమె అన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలు లేకపోయినా అభ్యర్థిని ముందుగా ప్రకటించి పనబాక లక్ష్మీని బాబు బుక్ చేశాడని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయాక టీడీపీకి గడ్డు రోజులు నడుస్తున్న తరుణంలో మాజీ మంత్రి పనబాక లక్ష్మీ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న వార్తలు వచ్చాయి. బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరిపి తేది కూడా ఖరారు చేసుకున్నట్లు తెలిసింది.

అయితే పనబాక బీజేపీలో చేరుతోందని తెలుసుకున్న చంద్రబాబు వెంటనే అలెర్ట్ అయ్యి ఆమెను సంప్రదించకుండానే టీడీపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం సంచలనమైందట.. చంద్రబాబు తీరుతో ఆమె షాక్ కు గురైనట్టు సమాచారం.

టీడీపీ అధినేతపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పనబాక అందుకే మౌనంగా.. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

అందుకే తాజాగా అభ్యర్థిత్వం ప్రకటించినా ఆమె నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో చంద్రబాబు ఆరా తీసినట్టు తెలిసింది. పనబాక టీడీపీ అభ్యర్థిత్వం నుంచి తప్పుకునే అవకాశముందని టీడీపీ అధిష్టానానికి సమాచారం అందినట్టు సమాచారం.