పీవీ కుమార్తె నామినేషన్ మీద ఎందుకింత గందరగోళం?

Tue Feb 23 2021 10:11:12 GMT+0530 (IST)

PV Daughter Doesnt Know How To File Nomination Papers

మీడియాను మించిపోయినట్లుగా వ్యవహరించే సోషల్ మీడియా రచ్చతో నిజం అబద్ధంగా.. అబద్ధం నిజంగానే ప్రచారం జరగటం ఈ మధ్యన ఎక్కువైంది. ఎప్పుడైతే సోషల్ మీడియా హడావుడి ఎక్కువైందో.. అనేక దరిద్రపుగొట్టు వ్యవహారాలు తెర మీదకు వస్తున్నాయి. బతికున్నోళ్లను ముందే చంపేసే టీవీ చానళ్లకు సైతం సాధ్యం కాని పైత్యాన్ని సోషల్ మీడియాలో ప్రదర్శించటం ఎక్కువైంది. సోషల్ మీడియాలో ఎవరికి తోచింది వారు రాసుకోవచ్చు. అందులో నిజమెంత? అబద్ధమెంత? అన్న విషయాల్నిచెక్ చేయరు. తమకు తెలిసిన సమాచారం అంటూ తోచింది రాసేయటం.. దాన్ని నమ్మేసి పెద్ద ఎత్తున షేర్ చేయటం.. మొత్తంగా విషయాన్ని కంగాళీ చేయటంలో సోషల్ మీడియాకు మించింది మరొకటి ఉండని పరిస్థితి.హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ప్రధాని పీవీ కుమార్తె సురభివాణిదేవిని ఎంపిక చేస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. తమకు ఒక పట్టాన మింగుడుపడని ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని.. పీవీ కుమార్తెను బరిలోకి దించటం ద్వారా కేసీఆర్ భారీ ప్లానే వేశారు. ఇదిలా ఉంటే.. అనూహ్యంగా తెర మీదకు వచ్చిన పీవీ కుమార్తె.. సోమవారం మంచి రోజు కావటంతో నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. నిజానికి.. ఈ రోజు (మంగళవారం) వరకు నామినేషన్ వేసేందుకు సమయం ఉన్నప్పటికి.. ముహుర్త బలం సోమవారం బాగుండటంతో పలువురు ముఖ్యనేతలంతా నామినేషన్లు వేశారు.

అయితే.. మరెవరికి చోటు చేసుకోని ఇబ్బంది పీవీ కుమార్తె నామినేషన్ వేసే సమయంలో ఎదురైంది. దీనికి కారణం.. గతంలో ఆమె ఎన్నికల్లో పోటీ చేయకపోవటం.. సమయం తక్కువగా ఉండటం.. నామినేషన్ పత్రాల్ని సిద్ధం చేసే విషయంలో మిస్ అయిన సమన్వయం.. మొత్తంగా నామినేషన్ వేసేందుకు హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ఆఫీసుకు వచ్చిన ఆమె.. ఏకంగా మూడు గంటలకు పైనే ఉండిపోవాల్సి వచ్చింది. నామినేషన్ పత్రాల్లో కొర్రీలు ఉండటం.. జత చేయాల్సిన పలు పత్రాలు అందులో లేకపోవటంతో.. అధికారుల సూచనతో అప్పటికప్పుడు పత్రాల్ని సిద్ధం చేయించారు. ఈ హైడ్రామాను తప్పుగా అర్థం చేసుకున్న కొందరు అత్యుత్సాహవంతులు.. సురభి వాణి దేవి నామినేషన్ దాఖలు చేయలేదన్న ప్రచారానికి తెర తీశారు.

అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేసే సత్తా ఉండటం.. ఇలాంటి హాట్ హాట్ వార్తలతో అందరిని ఆకర్షించే ధోరణితో వాణిదేవి నామినేషన్ దాఖలు చేయలేదన్నదే నిజంగా మారింది. అబద్ధం నిజంగా మారే తీరు ఎంతలా ఉంటుందన్న దానికి వాణిదేవి నామినేషన్ ఎపిసోడే నిదర్శనంగా చెప్పొచ్చు. మొత్తంగా మూడు గంటల కసరత్తు అనంతరం.. అధికారులు ఓకే చెప్పాక.. నామినేషన్ ధాఖలు చేసి బయటకు వచ్చారు పీవీ కుమార్తె. కాకుంటే అప్పటికే ఆమె నామినేషన్ వేయలేదన్న ప్రచారం బాగా జరిగిపోవటం.. ఆమె తన నామినేషన్ దాఖలు చేసిన విషయాన్ని వెల్లడించకపోవటంతో.. మరింత కన్ఫ్యూజ్ పెరిగిపోయింది.