Begin typing your search above and press return to search.

ఇలాంటి 'సినిమా'లు మోడీకే సాధ్యం బాసూ

By:  Tupaki Desk   |   20 Feb 2020 5:30 AM GMT
ఇలాంటి సినిమాలు మోడీకే సాధ్యం బాసూ
X
నాటకీయత అందరికి సాధ్యం కాదు. తామేం చేస్తే ప్రజల మనసుల్ని దోచుకునే వీలుందో కొద్దిమంది అధినేతలకు మాత్రమే బాగా తెలుసు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇలాంటి తీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో చాలా ఎక్కువ. ఆయన బయటకు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక ప్రత్యేకతను ప్రదర్శించటమే కాదు.. ఇలాంటివి సారుకు మాత్రమే సాధ్యమన్న భావన కలిగేలా చేస్తారు. జాతీయ రాజకీయాల విషయానికి వస్తే.. ఇలాంటి తీరు ప్రధాని మోడీ లో టన్నుల కొద్దీ ఉంటుంది.

వేరే దేశాధ్యక్షుడికి విందు ఇచ్చే వేళ.. తాను బస చేసిన హోటల్ కు దగ్గర్లోని బీచ్ లో చెత్త ఏరటం..ఉన్నట్లుండి రోడ్ల మీదకు వచ్చి చీపురుతో ఊడ్చి స్వచ్ఛ భారత్ లాంటి వాటిని ప్రమోట్ చేయటంలో ప్రధాని మోడీ ముందుంటారు. తాజాగా అలాంటి పనే మరొకటి చేశారు. ఎవరి అంచనాకు అంతుబట్టని రీతిలో దేశ ప్రధాని గా ఉన్న మోడీ తాజాగా వ్యవహరించిన తీరు అందరిని ఆశ్చర్యపరిస్తే.. కోట్లాది మంది నోటి నుంచి ప్రధాని అంటే ఇలానే ఉండాలన్న ఫీలింగ్ కలిగేలా చేయటంలో నమో మరోసారి సక్సెస్ అయ్యారని చెప్పాలి.

ఇంతకీ మోడీ ఏం చేశారంటే.. బుధవారం ఢిల్లీ రాజ్ పథ్ లోని హునర్ హాట్ పేరుతో ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అలాంటి చోటకు పెద్ద ఎత్తున ఉన్న వాహనశ్రేణి వచ్చి ఆగింది. అందులో నుంచి ఠీవీగా దిగిన ప్రధాని మోడీ నిమిషం ఆలస్యం చేయకుండా చకచకా స్టాళ్ల వద్దకు వెళ్లటం.. వాటిని పరిశీలించటం.. వివరాలు అడిగి తెలుసుకోవటం లాంటివి చేయసాగారు. తమ ప్రదర్శనకు దేశ ప్రధాని స్వయంగా రావటం తో కలిగిన ఆశ్చర్యం నుంచి కోలుకోక ముందే.. ఆయన ఏపీకి చెందిన ఒక స్టాల్ వద్దకు వెళ్లారు.

నెల్లూరు జిల్లాకు చెందిన హుస్సేన్ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఉదయగిరి చెక్క ఉత్పత్తుల స్టాల్ ను సందర్శించి చెక్కతో చేసిన గరిటెల వివరాలు అడిగి తెలుసుకున్నా. మరో స్టాల్ కు వెళ్లి గోధుమ పిండితో చేసిన ఉత్తరాది వంటకం లిట్టి చోఖా తిన్నారు. రూ.120 బిల్లు స్వయంగా చెల్లించారు. అంతేనా.. తనతో పాటు వచ్చిన మైనార్టీ సంక్షేమశాఖా మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీతో కలిసి టీ తాగిన ఆయన రూ.40 పే చేశారు. ఇలా.. దగ్గర దగ్గర 50నిమిషాల పాటు గడిపారు. ఇలా ఒక సాదాసీదా ప్రదర్శన వద్ద దేశ ప్రధాని యాభై నిమిషాలపాటు గడపటం ఒక ఎత్తు అయితే.. ఈ ప్రదర్శన గురించి గొప్ప ఫీడ్ బ్యాక్ తో ఒక ట్వీట్ చేశారు. దీంతో.. ఈ ప్రదర్శనకు కొత్త గుర్తింపు లభించింది.