Begin typing your search above and press return to search.

'ఆక్సిజన్' మాక్ డ్రిల్ , 22 మంది మృతి .. ఆస్పత్రి సీజ్ !

By:  Tupaki Desk   |   9 Jun 2021 8:30 AM GMT
ఆక్సిజన్ మాక్ డ్రిల్ , 22 మంది మృతి .. ఆస్పత్రి సీజ్ !
X
ఉత్తరప్రదేశ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం 22 మంది ప్రాణాలను బలి తీసుకున్న సంగతి వెలుగులోకి వచ్చింది. ఆగ్రాలోని శ్రీ పరాస్ ఆసుపత్రి యాజమాన్యం ఆక్సిజన్ మాక్ డ్రిల్ పేరిట వారి ప్రాణాలను తీసినట్టు వార్తల్లో ప్రచారం అవుతుంది. ఏప్రిల్ 26న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆక్సిజన్ సరఫరాను ఐదు నిమిషాల పాటు ఆపేశామన్న ఆసుపత్రి యజమాని డాక్టర్ అరింజయ్ జైన్ మాటలు స్పష్టంగా వినిపించాయి. ఇక మాక్ డ్రిల్ పేరుతో ఆక్సిజన్ ని 5 నిముషాలు తీసేసి 22 మంది కరోనా వైరస్ రోగుల మృతికి కారణమైన శ్రీ పరాస్ హాస్పిటల్ ని అధికారులు సీల్ చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఈ ఆసుపత్రి యజమాని అరింజయ్ జైన్ పై ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద కేసు పెట్టారు.

ఆక్సిజన్ తొలగించిన కారణంగా రోగుల చేతులు, కాళ్ళు నీలి రంగులో మారాయి. 22 మంది పేషంట్స్ ఆయా తేదీల మధ్య మరణించగా ఈ విషయాన్ని జైన్ సీక్రెట్ గా ఉంచాడు.. ఎంతమంది మరణించారన్న ప్రశ్నకు ఆయన ఖచ్చితంగా తనకు తెలియదన్నాడు. కానీ ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ ప్రభు సింగ్ మాత్రం జైన్ పై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఈ హాస్పటల్ లో నలుగురు రోగులు మాత్రమే మృతి చెందారని అసలు ఏ సందర్బంలోనూ ఆక్సిజన్ కొరత లేదని ఆయన చెప్పారు. ఏప్రిల్ 28 న ఈ వీడియోను రికార్డు చేశారని, 26-27 తేదీల్లో ఆక్సిజన్ కొరత కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదని ఆయన అన్నారు. అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని, అది ముగిసేవరకు ఈ హాస్పిటల్ ని సీల్ చేస్తున్నామని వెల్లడించారు. సీలింగ్ సమయంలో ఆసుపత్రిలో ఉన్న 55 మంది రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. అయితే ఆక్సిజన్ తీసేస్తే కరోనా వైరస్ రోగుల పరిస్థితి ఎలా ఉంటుందని మాక్ డ్రిల్ నిర్వహించి 5 నిముషాలు దాన్ని తొలగించినట్టు జైన్ స్పష్టంగా చెబుతుండగా ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ మాత్రం ఇందుకు విరుద్ధంగా మాట్లాడడం విశేషం.