Begin typing your search above and press return to search.

మా దగ్గర ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించండి.. బీసీసీఐకి కేటీఆర్ విజ్ఞ‌ప్తి

By:  Tupaki Desk   |   28 Feb 2021 5:30 PM GMT
మా దగ్గర ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించండి.. బీసీసీఐకి కేటీఆర్ విజ్ఞ‌ప్తి
X
ఐపీఎల్ - 2021 సీజన్ మ్యాచ్‌లను హైదరాబాద్ లోనూ నిర్వహించాలని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. మ్యాచ్‌ల నిర్వహణకు ఏర్పాట్లతోపాటు పూర్తి స‌హ‌కారం అందిస్తామని చెప్పారు కేటీఆర్‌. క‌రోనా ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రానందున‌.. దేశీయంగా కొన్ని వేదిక‌ల్లోనే మ్యాచ్ లు నిర్వ‌హించాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించింద‌ని ప్రచారం జరుగుతోంది. ఈ మేర‌కు షార్ట్ లిస్ట్ కూడా ఖ‌రారైంద‌ని స‌మాచారం.

రాబోయే సీజన్ ను చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబైల్లో మాత్రమే మ్యాచ్ లు నిర్వ‌హించాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించింద‌ని స‌మాచారం. ముంబైలో క‌రోనా తీవ్రంగా ఉన్న‌ప్ప‌టికీ.. అక్క‌డ మ్యాచ్ లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించ‌డం గ‌మనార్హం. అయితే.. ప్రేక్షకుల్లేకుండా మ్యాచ్‌లు నిర్వహించుకోవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్ల‌డించింద‌ని తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో ట్విటర్ వేదికగా కేటీఆర్ బీసీసీఐకి అప్పీల్ చేశారు. ఐపీఎల్ వేదికల్లో హైదరాబాద్‌ను కూడా చేర్చాలని కోరారు. తాము తీసుకుంటున్న కరోనా నిబంధనల ఫలితంగా దేశంలోని అన్ని మెట్రో సిటీల్లో కంటే తక్కువ సంఖ్యలోనే కేసులు ఉన్నాయ‌ని చెప్పారు. మ్యాచ్‌ల నిర్వహణకు ప్రభుత్వం తరఫున మద్దతు ఉంటుందని చెప్పారు కేటీఆర్‌.

అయితే.. నిజానికి ముంబైలో క‌రోనా తీవ్రంగా ఉంది. అక్క‌డ మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వం అంగీక‌రించ‌క‌పోతే.. హైదరాబాద్‌కు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావించింద‌ట‌. కానీ.. మ‌హారాష్ట్ర స‌ర్కారు అంగీక‌రించ‌డంతో హైదరాబాద్ కు ఛాన్స్ ద‌క్క‌ట్లేద‌ని తెలుస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. కేటీఆర్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. మ‌రి, ఏం జ‌రుగుతుంది? బీసీసీఐ ఎలా స్పందిస్తుంది? అన్నది చూడాలి.