Begin typing your search above and press return to search.

12 నుంచి 23కు విప‌క్ష కూట‌మిలో 'మోడీ' కూనిరాగాలు!!

By:  Tupaki Desk   |   8 Jun 2023 11:00 AM GMT
12 నుంచి 23కు విప‌క్ష కూట‌మిలో మోడీ కూనిరాగాలు!!
X
బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ నిర్వహించ తలపెట్టిన ప్రతిపక్ష నేతల సమావేశం రెండ‌డుగులు ముందుకు, నాలుగు అడుగులు వెన‌క్కి అన్న‌చందంగా మారిపోయింది. ఈ నెల 12నే విప‌క్ష కూట‌మి స‌మావేశానికి ఆయ‌న పిలుపునిచ్చారు. ఇంకేముంది.. మోడీపై తిరుగుబాటు చేసేందుకు ఇదే మంచి త‌రుణ‌మ‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. కానీ, ఈ స‌మావేశానికి వ‌చ్చేందుకు విప‌క్ష‌పాలిత ముఖ్య‌మంత్రులు, ఇత‌ర ప్ర‌తిప‌క్ష నేత‌లు సుముఖంగా ఉండ‌లేదు.

దీంతో ఇప్పుడు ఆ డేట్‌లో మార్పులు చేసి.. ఈ నెల 23న పట్నాలో ఈ భేటీ జరుగుతుందని ప్రకటించా రు. ఇక‌, ఈ స‌మావేశానికి ఎవ‌రు వ‌స్తార‌నేది కూడా మ‌ళ్లీ సందేహంగానే మారింది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, మమత(టీఎంసీ), స్టాలిన్‌(డీఎంకే), కేజ్రీవాల్‌(ఆప్‌), సొరేన్‌ (జేఎంఎం), శరద్‌ పవార్‌(ఎన్‌సీపీ), ఉద్దవ్‌ ఠాక్రే (శివసేన–యూబీటీ), అఖిలేష్‌(ఎస్పీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), దీపాంకర్‌ భట్టాచార్య (సీపీఐ–ఎంఎల్‌) హాజరు కానున్నారని చెబుతున్నారు.

కానీ, ఆయా రాష్ట్రాల్లో మారుతున్న ప‌రిణామాలు.. పెరుగుతున్న కేసుల ఉచ్చుతో నేత‌ల రాజ‌కీయ రాగాలు కూనిరాగాలై.. ప్ర‌ధాని పాట పాడుతున్నాయి. తాజాగా మ‌మ‌తాబెన‌ర్జీ మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీని ఈడీ ప్ర‌శ్నించింది. ఈ కేసు ఊపందుకునే అవ‌కాశం ఉండ‌డంతో మ‌మ‌త యూట‌ర్న్ తీసుకున్నారు. వెంట‌నే మోడీని మ‌చ్చిక చేసుకునేందుకు మామిడి పండ్లు పంపించారు.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు మోడీని ఉతికిఆరేసిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. త‌న కుమార్తె క‌విత పేరు మ‌ద్యం కేసులో ప్ర‌ధానంగా వినిపిస్తుండ‌డంతో వెన‌క్కి త‌గ్గి.. ఇప్పుడు గ‌త నెల రోజుల నుంచి మోడీ పేరే ఎత్త‌డం లేదు. ఇక‌, క‌ర్ణాట‌కలో ప్రాంతీయ పార్టీ జేడీఎస్‌.. బాహాటంగానే మోడీని స‌మ‌ర్థించింది. దీంతో విప‌క్ష కూట‌మిలో మోడీ కూనిరాగాలు బ‌లంగానే వినిపిస్తున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఇక‌, మ‌రోవైపు, మ‌హారాష్ట్ర‌లోనూ ఉద్ద‌వ్‌ఠాక్రే నేతృత్వంలోని శివ‌సేన కూడా యూట‌ర్న్ తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. తాము బ‌లంగా నిల‌బ‌డాలంటే.. బీజేపీని వ్య‌తిరేకించ‌డం స‌రికాద‌ని.. శివ‌సేన నేత సంజ‌య్ రౌత్ న‌ర్మ‌గ‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు కీల‌కంగా మారాయి. మొత్తంగా చూస్తే.. విప‌క్ష కూట‌మి స‌మావేశానికి డేట్లే కాదు.. మ‌న‌సులు కూడా మారుతున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది.