Begin typing your search above and press return to search.

వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లుపై విపక్షాల అభ్యంతరాలు .. ఎందుకంటే

By:  Tupaki Desk   |   24 Nov 2021 2:30 AM GMT
వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లుపై విపక్షాల అభ్యంతరాలు .. ఎందుకంటే
X
కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు ఎప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధల సమాచార గోప్యత విషయంలో కేంద్రం చూపుతున్న వివక్షే కారణం.దేశంలో పౌరులు, వ్యక్తులు, సంస్ధలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే విషయంలో ఆందోళనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా పెగాసస్ వంటి స్పైవేర్ లను వాడటం ద్వారా కేంద్రం ఇలాంటి వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తుతుండటం, దీనిపై సుప్రీంకోర్టు సైతం నిపుణుల కమిటీతో విచారణ చేయిస్తున్న తరుణంలో పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడం కేంద్రానికి సవాళ్లు విసురుతోంది.

దీంతో కేంద్రం వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లును తెచ్చేందుకు సిద్దమవుతోంది. అయితే ఇందులో పొందుపరిచిన అంశాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పౌరుల, సంస్ధల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే పేరుతో తీసుకొస్తున్న బిల్లులో అంశాలపై విపక్షాలు ముందే పెదవి విరుస్తున్నాయి. ఈ బిల్లు వల్ల పౌరుల, సంస్ధల వ్యక్తిగత సమాచారం రక్షణ సంగతేమో కానీ కేంద్రానికి మాత్రం వారిపై పెత్తనం చెలాయించే విశేషాధికారులు దఖలు పడటం ఖాయమంటున్నాయి. ఈ బిల్లులో పొందుపరిచిన పలు అంశాలపై విపక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు యథాతథంగా పార్లమెంటులో ఆమోదం పొందితే కేంద్రం తమకు కావాల్సిన వారి డేటాను మాత్రమే రక్షించే వీలుంటుందని, మిగతా డేటా కేంద్రం చేతుల్లోకి వెళ్తుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా జరిగిన సమావేశంలో పార్లమెంటు ప్యానెల్ తన నివేదికను ఆమోదించిన తర్వాత, వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు పై పార్లమెంటు జాయింట్ కమిటీకి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బిజెడికి చెందిన ఏడుగురు ఎంపీలు అసమ్మతి నోట్లు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోని ఏ ఏజెన్సీని అయినా చట్టం నుంచి మినహాయించేలా అనుమతించే క్లాజుపై దాదాపు అందరూ అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లులో, నివేదికలోని ఇతర లోపాలను కూడా వారు ప్రశ్నించారు. దీనితో కేంద్రానికి విశేషాధికారాలు కల్పించే ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు విపక్ష ఎంపీలు చెప్తున్నారు

కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ తన అసమ్మతి నోట్‌ లో సెక్షన్ 35పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏ ఏజెన్సీని అయినా మొత్తం చట్టం నుండి మినహాయించేలా కేంద్ర ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలను ఇది ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యక్తిగత సమాచారం ఇచ్చేందుకు సమ్మతించే నిబంధనల నుంచి ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలకు కొన్ని మినహాయింపులు ఇవ్వడం సరికాదని మరో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ తెలిపారు. ఈ బిల్లును ప్రస్తుత రూపంలో పూర్తిగా వ్యతిరేరిస్తునట్లు ఆయన అసమ్మతి నోట్ లో పేర్కొన్నారు. మరో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కూడా బిల్లులోని సెక్షన్ 12 , 35 ప్రకారం ప్రభుత్వానికి, దాని సంస్థలకు అందించిన విస్తృత మినహాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేశారు

ఉమ్మడి అసమ్మతి నోట్‌ లో, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు డెరెక్ ఓ బ్రియాన్, మహువా మొయిత్రా, డేటా నిబంధనల గోప్యత హక్కును రక్షించడానికి బిల్లులో తగిన రక్షణలు లేవని కేంద్రానికి తేల్చిచెప్పారు. టీఎంసీ ఎంపీలు కమిటీ పనితీరుపై ప్రశ్నలను లేవనెత్తారు, వాటాదారుల సంప్రదింపులకు తగినంత సమయం, అవకాశం ఇవ్వకుండా కమిటీ తొందరపడిందని చెప్పారు. చట్టం పరిధిలోకి వ్యక్తిగతేతర డేటాను చేర్చడంపై టీఎంసీ ఎంపీలు నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బీజేడీకి చెందిన ఎంపీ అమర్ పట్నాయక్ కూడా డేటా రక్షణ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.