Begin typing your search above and press return to search.

ప్ర‌వాస భార‌తీయుల ఘ‌న‌త‌: తేలికైన, అతి త‌క్కువ ధ‌ర వెంటిలేట‌ర్లు సృష్టి‌

By:  Tupaki Desk   |   26 May 2020 8:30 AM GMT
ప్ర‌వాస భార‌తీయుల ఘ‌న‌త‌: తేలికైన, అతి త‌క్కువ ధ‌ర వెంటిలేట‌ర్లు సృష్టి‌
X
అమెరికాలోని ప్రవాస భారతీయులు అద్భుతాలు సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. అమెరికా అభివృద్ధిలో భార‌తీయుల పాత్ర ప్ర‌ధానంగా ఉంది. ప్ర‌స్తుతం మ‌హ‌మ్మారి వైర‌స్ నియంత్ర‌ణ‌లో కూడా ప్ర‌వాస భార‌తీయులు స‌హ‌క‌రిస్తున్నారు. వారి కృషితో అమెరికా కొంత నిల‌బ‌డుతోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌వాస భార‌తీయులు అద్భుత ఆవిష్క‌ర‌ణ చేశారు. అతి త‌క్కువ ధ‌ర‌, తేలికైన వెంటిలేట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. ఆ వెంటిలేట‌ర్లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. అత్యావ‌స‌ర వెంటిలేటర్లను త్వరలో ఉత్పత్తి చేస్తామని ప్ర‌వాస భార‌తీయులు దేవేశ్ రంజన్, అతడి భార్య కుముదా రంజన్ తెలిపారు. వైర‌స్ బాధితులకు అత్యంత సహాయకారిగా ఈ వెంటిలేట‌ర్లు నిలుస్తాయ‌ని పేర్కొన్నారు. కొన్ని రోజుల్లో భార‌త‌దేశంలో కూడా అందుబాటులోకి వస్తాయ‌ని వారు ప్ర‌క‌టించారు.

మహమ్మారి వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని గుర్తించి తాము మూడు వారాల్లో ఈ తేలికపాటి వెంటిలేటర్లను అభివృద్ధి చేశామ‌ని దేవేశ్ రంజన్ ప్ర‌క‌టించారు. జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వీటిని రూపొందించారు. ఈ వెంటిలేట‌ర్ల‌ను ‘ఓపెన్ ఎయిర్ వెంట్ జీ టీ’ అని పిలుస్తున్నారు. వీటిలో ఎలక్ట్రానిక్ సెన్సర్లు, కంప్యూటర్ కంట్రోల్ ఉంటాయి. ఆరేళ్ల వయసులో కుముదా రంజన్ భార‌త్‌లోని రాంచీ నుంచి తన కుటుంబంతో సహా అమెరికాకు వెళ్లి స్థిర‌ప‌డ్డారు. ప్రస్తుతం ఆమె అట్లాంటాలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. తాము రూపొందించిన వెంటిలేట‌ర్లు మార్కెట్‌లోకి వ‌చ్చేవ‌ర‌కు వాటి ధర ఒక్కొక్కటి వంద డాలర్ల లోపే ఉంటుందని తెలిపారు. అమెరికాలో ఈ వెంటిలేట‌ర్లు పది వేల డాలర్లు ఉంటుంద‌ని వివ‌రించారు.