Begin typing your search above and press return to search.

శ్రీలంక క్రికెటర్లపై ఏడాది పాటు నిషేధం ... ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   31 July 2021 4:45 AM GMT
శ్రీలంక క్రికెటర్లపై ఏడాది పాటు నిషేధం ... ఎందుకంటే ?
X
శ్రీలంక క్రికెట్ బోర్డు తమ దేశ ఆటగాళ్ల పై ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి సమయంలో బయోబబుల్ రూల్స్ ఉల్లంఘించినందుకు ముగ్గురు శ్రీలంక క్రికెటర్లపై నిషేధం విధించింది. ఇంగ్లండ్ పర్యటనలో బయో బబుల్ రూల్స్ అతక్రమంచి వీధుల్లో చక్కర్లు కొట్టిన శ్రీలంక ఆటగాళ్ల పై కఠిన చర్యలు తీసుకుంది. శ్రీలంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెలా, ధనుష్క గుణతిలకపై ఏడాది నిషేధం విధించింది. వారు చేసిన తప్పిదానికి ఇప్పటికే జట్టు నుంచి తొలగించిన బోర్డు.. వారిని అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధం విధించడంతో పాటు కోటీ రూపాయల భారీ జరిమానా వేసింది. అలాగే దేశవాళీ పోటీల్లోనూ వారు ఆరు నెలల పాటు ఆడకూడదని స్పష్టం చేసింది.

ఇంగ్లండ్ టూర్ లో టీ-20 సిరీస్ ముగిసిన తర్వాత..ఆ జట్టు ఆటగాళ్లు కుశాల్ మెండిస్, నిరోషాన్ డిక్వెల్లా, దనుష్ గుణతిలక టీమ్ బస చేసిన హోటల్‌ ని వీడటం ద్వారా బయో- సెక్యూర్ బబుల్‌ ని బ్రేక్ చేశారు. అక్కడే డర్హామ్‌ లోని ఓ స్ట్రీట్‌ లోకి వెళ్లిన మెండిస్, డిక్వెల్లా సిగరెట్ తాగుతూ శ్రీలంక అభిమాని కంటపడ్డారు. దీంతో సదరు అభిమాని తన మొబైల్‌ తో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో శ్రీలంక క్రికెటర్లపై విమర్శలు భారీగా వచ్చాయి. దీంతో, శ్రీలంక క్రికెటర్లు ముగ్గురూ నిబంధనల్ని అతిక్రమించినట్లు తేలడంతో . వారిపై శ్రీలంక బోర్డు చర్యలు తీసుకుంది. రూల్స్‌ ని బ్రేక్ చేసినట్లు విచారణలో తేలడంతో శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కుశాల్ మెండిస్, దనుష్ గుణతిలక, నిరోషాన్ డిక్వెల్లాను సస్పెండ్ చేసింది. వారిని వెంటనే శ్రీలంకకి వచ్చేయాల్సిందిగా ఆదేశించింది.

ఆ తర్వాత పూర్తి విచారణ చేపట్టిన తర్వాత ఒక ఏడాది పాటు బ్యాన్ విధించింది. ఇక, ఈ ముగ్గురు క్రికెటర్లు తాజా గా జరిగిన టీమిండియా సిరీస్ లో కూడా ఆడలేదు. వీరి బదులు అవకాశాలు అందిపుచ్చుకున్న యంగ్ క్రికెటర్లు చెలరేగడంతో వీరి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు లేకుండానే భారత్‌ తో సిరీస్‌లు ఆడిన శ్రీలంక వన్డే సిరీస్ 2-1తో కోల్పోయి.. టీ20 సిరీస్‌‌ ను 1-2తో కైవసం చేసుకుంది. ఫలితంగా 13 ఏళ్ల తర్వాత భారత్‌ పై శ్రీలంక ఓ ధ్వైపాక్షిక సిరీస్‌ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఐదు వరుస టీ20 సిరీస్‌ పరాజయాల తర్వాత తొలి సిరీస్‌ విజయాన్నందుకుంది.