Begin typing your search above and press return to search.

ఆ జంట పోలీసుల్నే బ్లాక్ మొయిల్ చేస్తుందట

By:  Tupaki Desk   |   17 Dec 2019 7:40 AM GMT
ఆ జంట పోలీసుల్నే బ్లాక్ మొయిల్ చేస్తుందట
X
నిజం నిలకడ మీద తెలుస్తుందిలే అని ఊరుకోలేని పరిస్థితులు ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి. అబద్దాన్ని నిజంగా మార్చేసే శక్తి సోషల్ మీడియాకు ఉంది. ముందు తాము చేయాల్సిన డ్యామేజ్ చేసుకునేందుకు వీలుగా శక్తివంతమైన సోషల్ మీడియాను తమ స్వార్థ్యానికి ఎలా వాడేసుకుంటారో చెప్పే వైనంగా ఈ ఉదంతాన్ని చెప్పాలి. సోమవారం సాయంత్రం వేళ.. హైదరాబాద్ లోని చాలా మీడియా గ్రూపుల్లోనూ.. ప్రైవేటు గ్రూపుల్లోనూ ఒక వీడియో వైరల్ గా మారింది.

ఇంతకూ ఆ వీడియోలో ఏమున్నదంటే.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు చెందిన సీఐ కళింగరావుతోపాటు మరో ఇద్దరు ఎస్ ఐలు తనపై అసభ్యకరంగా వ్యవహరించారంటూ ప్రవిజ అనే మహిళ తీవ్రమైన ఆరోపణలు చేయటంతో కలకలం రేగింది. కాసేపటికే ఈ ఫేస్ బుక్ వీడియో వైరల్ గా మారింది. దీంతో ఉలిక్కిపడ్డ బంజారాహిల్స్ పోలీసులతో పాటు.. ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. అసలేం జరిగిందన్న సమాచారాన్ని సేకరించటంతో పాటు.. తమ సిబ్బంది తప్పు ఏమైనా చేశారా? అని క్రాస్ చెక్ చేశారు.

ఇదంతా బెదిరింపుల కోసమేనన్న విషయాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సోమవారం రాత్రి వేళ హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో..మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ కు ఏకంగా డీసీపీనే తెర మీదకు వచ్చారు. సివిల్ పంచాయితీ తమ వద్దకు వస్తే.. తమ పోలీసులు నో చెప్పారని.. ఆ రెండు పార్టీల్లో ఒకరు కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకోవటంతో.. దానికి అనుగుణంగా తాము వ్యవహరించినట్లు చెప్పారు.

దీంతో.. పోలీసుల మీద గుర్రుతో ఈ అసత్య ఆరోపణల్ని తెర మీదకు తెచ్చారని చెప్పారు. పోలీసు అధికారుల మీద ఆరోపణలు చేసిన వారి గురించి ఆరా తీయగా.. గతంలోనూ వారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనూ ఇదే తరహాలో వ్యవహరించటంతో వారిపై కేసు నమోదైందని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు.. ఉన్నతాధికారుల పేర్లు చెప్పుకుంటూ ఇదే తరహాలో బ్లాక్ మొయిల్ చేస్తుంటారని చెప్పారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వీడియోలు తమ వద్ద ఉన్నాయని.. పలు పోలీస్ స్టేషన్లలో పోలీసులను ఈ దంపతులు బ్లాక్ మొయిల్ చేస్తుంటారన్నారు.

మొత్తంగా ఈ దంపతులు పోస్టు చేసిన వీడియో వైరల్ గా మారి.. సిటీ పోలీసుల్ని ఉక్కిరిబిక్కిరి చేసిందని చెప్పాలి. ఈ ఎపిసోడ్ ను జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఒక స్టేషన్ లో ఒక మహిళ వెళితే.. ఒకరు తప్పుగా బిహేవ్ చేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. స్టేషన్ లోని అధికారులందరూ ఇదే రీతిలో వ్యవహరిస్తారా? అన్న ప్రాధమిక సందేహం కలుగక మానదని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏమైనా ఈ ఇష్యూలో అధికారులు సత్వరమే స్పందించటంతో ఇష్యూ ఇక్కడితో ఆగిందని.. లేదంటే ఇదో తలనొప్పిగా మారేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.