ఎన్టీఆర్ వర్ధంతి రోజున బాలక్రిష్ణ ఎమోషనల్

Tue Jan 18 2022 10:55:03 GMT+0530 (IST)

On NTR 26th Death Anniversary Balakrishna pays tributes

తెలుగుదేశం వ్యవస్థాపకులు ప్రముఖ నటులు సీనియర్ ఎన్టీఆర్ 26వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా తన నాన్నను తలుచుకొని అగ్రహీరో ఎమ్మెల్యే బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ జీవితం అందరికీ ఆదర్శం అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకూ ఎన్టీఆర్ ఉంటారని అన్నారు.తెలుగుజాతిలో ఎన్టీఆర్ పుట్టడం మన అదృష్టం అని బాలయ్య అన్నారు. కాంగ్రెస్ ను కూకటి వేళ్లతో పెకిలించిన వ్యక్తి ఎన్టీఆర్ అని.. ఎక్కడి స్థానికులకు అక్కడే ఉద్యోగాలు ఇవ్వాలని అప్పట్లో ఎన్టీఆర్ సీఎంగా ఉండగా 610 జీవోను తీసుకొచ్చారని.. ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగులు స్థానికతపై ఆందోళన చేస్తున్నారని బాలక్రిష్ణ ఆరోపించారు.

నందమూరి బాలక్రిష్ణతోపాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సైతం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమంలో బాలయ్య ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

గత కొంతకాలంగా తెలంగాణలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. సొంత జిల్లా వాసులను కూడా వేరే మారుమూల జిల్లాలకు పంపి సీనియర్లకు  పెద్దపీట వేయడంపై వ్యతిరేకత వ్యక్తమైంది. స్థానికులకు అన్యాయం జరుగుతోందని వారు ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలపైనే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బాలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.