గుడ్ న్యూస్.. తగ్గుతున్న ఆర్- వ్యాల్యూ

Mon Jan 17 2022 19:00:01 GMT+0530 (IST)

Omicron In India

కరోనా మహమ్మారి దాదాపు రెండున్నరేళ్ల నుంచి ప్రపంచాన్ని వణికిస్తోంది. గ్యాప్ ఇస్తూ దశల వారీగా ప్రతాపం చూపిస్తోంది. గత నెల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2021 డిసెంబర్ మూడో వారం నుంచి వైరస్ విజృంభిస్తోంది. కాగా కరోనా వ్యాప్తి చెందే ఆర్-వాల్యూ కూడా ఒక్కసారిగా పెరిగింది. ఈ విలువ ఎంత పెరిగితే వైరస్ అంత వేగంగా విస్తరిస్తుందని అర్థం. ఇటీవల దేశంలో మూడో వేవ్ ప్రారంభమైందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కాస్త ఉపశమనం కలిగే వార్తను శాస్త్రవేత్తలు తెలిపారు.దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళలో... ఓ గుడ్ న్యూస్ చెప్పింది ఐఐటీ మద్రాస్. ఆర్-వాల్యూ క్రమంగా తగ్గుతోందని పరిశోధనల్లో వెల్లడైనట్లు తెలిపింది. ఐఐటీ మద్రాస్ గణిత విభాగం నిర్వహించిన పరిశోధనల డేటా ప్రకారం ఆర్-వాల్యు క్రమంగా తగ్గుతూ... ప్రస్తుతం 2.2 వద్ద ఉందని వెల్లడించింది. జనవరి7-13 వరకు ఉన్న డేటా ప్రకారం ఈ విలువ నమోదైందని తెలిపారు. అయితే ఆర్-విలువ జనవరి1 నుంచి 6 వరకు ఏకంగా 4కు ఎగబాకింది. అయితే అది ప్రస్తుతం కాస్త తగ్గింది.

ఆర్-వాల్యూ 1 లోపు ఉంటే కరోనా అదుపులో ఉన్నట్లని వైద్యనిపుణులు అంటున్నారు. అంతకుమించితే... ముప్పు కూడా పెరుగుతుందని చెప్పారు. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ నేపథ్యంలో వైరస్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ వచ్చింది. దాదాపు అన్ని దేశాల్లోనూ ఒమిక్రాన్ ప్రభావం చూపింది. అయితే వైద్యనిపుణుల హెచ్చరికల మేరకు వివిధ దేశాల ప్రభుత్వాలు ముందస్తుగానే అప్రమత్తమయ్యాయి. కాగా మనదేశంలోనూ వైరస్ ను అదుపుచేయడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేసింది.

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. అయితే మరణాల సంఖ్యను తగ్గించడంలో మన ప్రభుత్వం సఫలమైంది. భారత్ లో ఒక్క రోజుల 2.7లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే రికవరీ రేటు ఎక్కువగా ఉందని... మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వైరస్ ప్రభావం ఎక్కువగా మహారాష్ట్ర కర్నాటక రాష్ట్రాల్లో ఉందని తెలిపారు.