Begin typing your search above and press return to search.

విషాదం: ఒడిశాలో మూడు రైళ్ల ఢీ! 278 మంది దుర్మరణం

By:  Tupaki Desk   |   3 Jun 2023 9:03 AM GMT
విషాదం: ఒడిశాలో మూడు రైళ్ల ఢీ! 278 మంది దుర్మరణం
X
గమ్యస్థానాలు వెళ్తున్నామన్న ఆనందంలో ప్రయాణికులు. సమయం రాత్రి 7 గంటల ప్రాంతం. ఇంతలోనే పెద్ద శబ్దం. భారీగా కుదుపులు. చుట్టూ చీకటి. ఏం జరిగిందో తెలియని స్థితి. ఏమని ఆలోచించాలో తెలియని పరిస్థితి. ఏదో పెద్దప్రమాదమే జరిగిందనుకునే లోపు... మహా విషాదం చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం హాహాకారాలతో దద్దరిల్లింది ఘటనాస్థలం. దీనికంతటికీ కారణం.. తాజాగా ఒడీశాలో జరిగిన ఘోర రైళ్ల ప్రమాధం!

అవును... ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఫలితంగా.. మాటలకందని మహా విషాదం చోటుచేసుకుంది. బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం అనూహ్య రీతిలో ఒకే చోటఏకంగా మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ దుర్ఘటనలో సుమారు 278 మంది దుర్మరణం పాలవ్వగా.. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఇంకా మరో 600-700 మంది బోగీల్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవలి కాలంలో మన దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలుప్రమాదం ఇదేనని పలువురు చెబుతుండటం గమనార్హం.

ఈ ప్రమాధంలో గాయపడిన 400 మంది క్షతగాత్రులను వివిధ ఆసుపత్రుల్లో అధికారులు చేర్పించారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌ సహా బాలేశ్వర్‌, భువనేశ్వర్‌, భద్రక్‌, మయూర్‌ బంజ్‌, కటక్‌ ల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను అధికారులు అప్రమత్తం చేశారు.

స్థానికుల కథనం ప్రకారం... బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌ లోని హావ్‌ డాకు వెళ్తున్న బెంగళూరు-హావ్‌ డా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది.

దీంతో దాని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌ పై పడిపోయాయి. ఆ సమయంలో ఆ ట్రాక్ పై వెళ్తున్న షాలిమార్‌ - చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ ప్రెస్‌ ఆ బోగీలను ఢీకొట్టింది. దాంతో కోరమండల్‌ ఎక్స్‌ ప్రెస్‌ కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి.

ఈ ప్రమాదం అక్కడితో ఆగిపోలేదు. బోల్తాపడ్డ కోరమండల్‌ కోచ్‌ లను పక్కనున్న ట్రాక్‌ పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది. ఈ ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా రైలు ప్రమాదంపై వివరాలు అందించేందుకు పలు హైల్ప్‌ లైన్‌ నంబర్లను రైల్వేశాఖ ఏర్పాటుచేసింది. సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం (040 27788516), విజయవాడ రైల్వే స్టేషన్‌ (0866 2576924), రాజమండ్రి రైల్వే స్టేషన్‌ (0883 2420541), రేణిగుంట రైల్వే స్టేషన్‌ (9949198414), తిరుపతి రైల్వే స్టేషన్‌ (7815915571) సహాయ కేంద్రాలకు ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.