Begin typing your search above and press return to search.

ఒడిసాలో `ఇందిర‌మ్మ కాల్పుల` సీన్‌.. మంత్రిపైనే ఏకంగా కాల్పులు.. మృతి

By:  Tupaki Desk   |   29 Jan 2023 9:39 PM GMT
ఒడిసాలో `ఇందిర‌మ్మ కాల్పుల` సీన్‌.. మంత్రిపైనే ఏకంగా కాల్పులు.. మృతి
X
మాజీ ప్ర‌ధాని ఇందిర‌మ్మ హ‌త్య గురించి అంద‌రికీ తెలిసిందే కదా! ఆమెకు భ‌ద్ర‌త‌గా ఉన్న కొంద‌రు సిబ్బంది కాల్పులు జ‌రిపిన ఘ‌ట‌న‌లో ఇందిర‌మ్మ ప్రాణం కోల్పోయారు. అలాంటి సీన్ కొంచెం అటు ఇటుగా ఒడిసాలో చోటు చేసుకుంది. మంత్రికి భ‌ద్ర‌తగా ఉండాల్సిన పోలీసు..ఏకంగా ఆయ‌న‌పైనే కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌నలో మంత్రి మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌ దేశంలోనే సంచ‌ల‌నం సృష్టించింది.

ఒడిసా ఆరోగ్యశాఖ మంత్రి నవ కిశోర్‌దాస్‌పై అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కాల్పులు జ‌రిపాడు. ఈ ఘటనలో కిశోర్ దాస్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం నవ కిశోర్‌దాస్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అతి స‌మీపం నుంచి పోలీసు కాల్పులు జ‌ర‌ప‌డంతో మంత్రి ఛాతీలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. దీంతో ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తొలుత తెలిపారు. నాలుగు గంట‌లు గ‌డిచిన‌త‌ర్వాత మంత్రి మృతి చెందారు.

ఏం జ‌రిగింది..?
ఒడిసాలోని ఝార్సిగూడ జిల్లాలోని బ్రెజరాజనగర్‌ గాంధీచౌక్‌లో నిర్వ‌హించిన‌ అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండగా మంత్రిపై కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. నిందితుడు ఏఎస్ఐ గోపాల్దాస్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు.. మంత్రిపై కాల్పులు జరపడానికి కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మంత్రిని మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్కు త‌ర‌లించారు.

'ప్రజా ఫిర్యాదుల కార్యాలయం ప్రారంభోత్సవానికి దాస్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఒక్కసారిగా గన్ శబ్దం వినిపించింది. ఓ పోలీసు చాలా దగ్గరి నుంచి మంత్రిపై కాల్పులు జరిపి పారిపోవడం మేం చూశాం' అని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. 'బుల్లెట్ ఛాతిలోకి దూసుకెళ్లగానే.. మంత్రి స్పృహ కోల్పోయి పడిపోయారు. ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. చుట్టూ ఉన్నవారు మంత్రిని పైకి లేపి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సహాయం చేశారు. తొలుత ఝార్సుగూడ జిల్లా ఆస్పత్రికి ఆయన్ను తీసుకెళ్లారు` అని డీజీపీ తెలిపారు. అయితే.. మంత్రి నాలుగు గంట‌ల అనంతరం తుదిశ్వాస విడిచిన‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.