పెద్దగా వార్తలో ఉండని.. ప్రగతి కూడా కానరాని.. వరుసగా ఒకే నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటున్న ఆ రాష్ట్రంలో కలకలం. ఏకంగా ఓ మంత్రిపైనే కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు పాల్పడింది కూడా ఏ నేరస్తుడో.. ఉగ్రవాదో కాదు.. ఓపోలీసు కావడం గమనార్హం. అయితే ఆ రాష్ట్రంలో మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. అలాంటి సమయంలో ఇటువంటి హింసాత్మక ఘటనలు తరచూ జరుగుతుంటాయనేది విశ్లేషకుల మాట.
తాజా పరిణామాలు ఆందోళన కలిగించే విషయమని చెబుతున్నారు.
ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు మొదలుపెట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.చికిత్స కోసం హైదరాబాద్ కు...? పైన చెప్పుకొన్న ఘటనలో బాధితుడు ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబకిశోర్ దాస్. ఈయన బ్రెజరాజనగర్లోని గాంధీ చౌక్ కు రాగా కాల్పులు జరిగాయి. దీంతో ఈ ఘటన కలకలం రేపింది. కాగా దాస్ పై దాడికి పాల్పడింది గుర్తు తెలియని దుండగులు అని తొలుత వార్తలు వచ్చాయి. తర్వాత పరిణామాలు మారిపోయాయి. మరోవైపు కాల్పులతో మంత్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను సమీప ఆసుపత్రికి తరలించారు.
ఛాతీలోకి బుల్లెట్..
మంత్రి నబకిశోర్ దాస్ ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మంత్రి వచ్చింది ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అని.. ఆ సమయంలో దాడి జరిగిందని కథనాలు వచ్చాయి. ఝార్సుగూడ జిల్లా బ్రిజరాజ్ నగర్లోని గాంధీ చౌక్ వద్దకు చేరుకున్న నబకిశోర్.. వాహనం దిగుతున్న సమయంలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ దాడికి కారణాలు తెలియరాలేదు. దాడి విషయం తెలియగానే బీజేడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాల్చింది పోలీసేనా?
మంత్రి నబకిశోర్ పై దాడికి పాల్పడింది గోపాలచంద్ర దాస్ అనే ఏఎస్సై అని తెలుస్తున్నది. అతడు సర్వీస్ రివాల్వర్తో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం మంత్రిని హైదరాబాద్ తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఒడిశా అధికార పార్టీ బిజూ జనతా దళ్ (బీజేడీ)లో నబకిశోర్ సీనియర్ నేత. మహారాష్ట్రలోని ప్రఖ్యాత శని శింగణాపుర్ దేవాలయానికి ఇటీవల ఆయన రూ.కోటికిపైగా విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు విరాళంగా ఇచ్చారు. మీడియా పతాక శీర్షికలకు ఎక్కారు. ఒడిశాలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాంటి సమయంలో మంత్రిపై దాడిడు బీజేడీలో తీవ్ర చర్చనీయాంశమైంది.