Begin typing your search above and press return to search.

వన్డేలు బోరింగ్ .. మార్చాల్సిందే రూల్స్.. దిగ్గజాల మాట

By:  Tupaki Desk   |   18 March 2023 10:00 PM GMT
వన్డేలు బోరింగ్ .. మార్చాల్సిందే రూల్స్.. దిగ్గజాల మాట
X
ఓ 20 ఏళ్ల కిందట వన్డేలంటే విపరీత ఆదరణ ఉండేది.. వంద ఓవర్లయినా (50 ప్లస్ 50) కళ్లార్పకుండా చూసేవారు. 300 పైగా పరుగులు చేస్తే వాహ్ వా అనేవారు అభిమానులు. 100 స్ట్రయిక్ రేట్ తో ఆడే బ్యాట్స్ మన్ అంటే గొప్పగా చూసేవారు. బౌలర్లు కూడా పేసర్లు, స్పిన్నర్లు అని తేడా లేకుండా 60 పరుగులు లోపు ఇస్తే మెరుగ్గా బౌలింగ్ చేసినట్లు భావించేవారు. కానీ, ఎప్పుడైతే 2005లో టి20లు వచ్చాయో.. వన్డేలకు ప్రాధాన్య తగ్గింది. ధనాధన్ ఆటకు లీగ్ లు తోడవడంతో పరిస్థితి అంతా మారిపోయింది. కుర్రకారు అంతా టి20లకు ఫిదా అయిపోయారు. దీంతో క్రికెట్ బోర్డులు తమ షెడ్యూల్ లో తప్పనిసరిగా టి20 మ్యాచ్ లను చేర్చాల్సి వస్తోంది.

టెస్టుల కంటే తీసిసోయాయా?

వన్డేలు బోరింగ్ అనేది ఇటీవల బాగా వినిపిస్తున్న మాట. అంటే టెస్టుల కంటే వన్డేలు తీసిపోయాయా? అనిపిస్తోంది. టెస్టుల్లో ఐదు రోజుల పాటు 15 సెషన్లు ఉంటాయి. అన్ని రోజులు ఆడినా కొన్నిసార్లు ఫలితం కూడా రాదు. అంతేగాక.. ప్రతి దేశం తమకు అనుకూలంగా పిచ్ లను రూపొందించుకుంటుంది. వీటిపై ఏ విదేశీ జట్టు ఆడినా మొగ్గు ఆతిథ్య దేశానికే ఉంటుంది. కానీ.. వన్డేలు అలా కాదు. ఫలితం ఏదైనా ఆశించవచ్చు. అయినప్పటికీ బోరింగ్ అనే మాట వస్తోంది.

టెస్టు-టి20 మధ్య నలిగిపోయి వాస్తవానికి టి20 ప్రపంచ కప్, టెస్టు చాంపియన్ షిప్ లో లేని ప్రత్యేకత వన్డేల సొంతం. ఈ ఫార్మాట్ లో ప్రపంచ కప్ కు విశిష్టత ఉంది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ వరల్డ్ కప్ లో గెలిచిన జట్టునే అత్యుత్తమంగా భావిస్తారు. అయితే, అటు టెస్టు, ఇటు టి20 మధ్య శాండ్ విచ్ లా వన్డే నలిగిపోయింది. మొదట ప్రపంచ క్రికెట్‌లో టెస్టు ఫార్మాట్‌ది ప్రత్యేక స్థానం. ఆ తర్వాత అభిమానులు వన్డేలను విపరీతంగా వీక్షించేవారు. టి20లు
ఎప్పుడైతే వచ్చాయో.. వన్డే ప్రాభవం తగ్గుముఖం పడుతోంది. వన్డే ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీలు మినహా ద్వైపాక్షిక సిరీసుల్లో ఈ ఫార్మాట్‌ మ్యాచ్‌లకు చోటు దక్కడం కూడా గగనంగా మారింది.

ఓవర్లను కుదిస్తారా? మార్పులు చేస్తారా?

అడకత్తెరలో చిక్కుకున్న వన్డేలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఐసీసీ, క్రికెట్ బోర్డులపై ఉంది. ఈ ఫార్మాట్‌ మీద అభిమానుల్లో ఆసక్తి పెరగాలంటే కచ్చితంగా కీలక మార్పులు చేయాలని మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఓవర్లను 40కు కుదించాలని టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఇటీవల కీలక సూచన చేశాడు. తాజాగా క్రికెట్‌ దిగ్గజం సచిన్ కూడా ఆ అభిప్రాయానికి మద్దతు పలికాడు. వన్డే మ్యాచ్‌లు బోర్‌ కొడుతున్నాయని చెప్పిన సచిన్‌. ఆసక్తి పెంచడానికి పలు కీలక సూచనలనూ అందించాడు.

"కొన్నేళ్లుగా వన్డే క్రికెట్‌ ఫార్మాట్‌లో ఎలాంటి మార్పులు లేవు. తప్పకుండా కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడున్న ప్రకారం రెండు కొత్త బంతులను ఇవ్వడం వల్ల బ్యాటర్లకు అనుకూలంగా మారిపోయింది. గతంలో మాదిరిగా రివర్స్ స్వింగ్ చేసే అవకాశం బౌలర్లకు లభించడం లేదు. దాంతో 15వ ఓవర్ నుంచి 40వ ఓవర్‌ వరకు మ్యాచ్‌ బోర్ కొడుతోంది. అందుకే టెస్టు తరహాలో 50 ఓవర్ల క్రికెట్‌నూ రెండు ఇన్నింగ్స్‌లుగా విడదీసి ఆడించాలి. అప్పుడు మ్యాచ్‌ రసవత్తరంగా మారడంతోపాటు వాణిజ్యపరంగానూ కలిసొస్తుంది" అంటున్నాడు. టాస్, మంచు ప్రభావం, పిచ్‌ పరిస్థితులు ఇరు జట్లకూ అనుకూలంగా ఉండాలని సూచించాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.