భారతీయ బిలియనీర్ల సంఖ్య 102 నుండి 142కి పెరిగింది అయితే 2021లో దేశంలోని 84 శాతం కుటుంబాలు వారి ఆదాయంలో క్షీణతను చవిచూశాయి. ఇది కూడా విపరీతమైన ప్రాణనష్టం మరియు జీవనోపాధికి సంబంధించిన అంశంగా మారింది. ఈమేరకు లాభాపేక్షలేని ఆక్స్ఫామ్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. తాజాగా దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముందు.. విడుదలైన ఈ నివేదికలో అనేక సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆర్థిక అసమానత్వం దేశాన్ని చంపేస్తోందని నివేదిక స్పష్టం చేసింది. అంతేకాదు భారతదేశంలోని 100 మంది ధనవంతుల సామూహిక సంపద 2021లో రికార్డు స్థాయిలో రూ.57.3 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపింది.
వాస్తవానికి కరోనా మహమ్మారి సమయంలో అందరి సంపద తగ్గిపోయింది. అంతేకాదు.. అనే పరిశ్రమలు కూడా మూతబడ్డాయి. కానీ మహమ్మారి సమయంలో (మార్చి 2020 నుండి నవంబర్ 30 2021 వరకు) బిలియనీర్ల సంపద రూ. 23.14 లక్షల కోట్ల నుండి రూ. 53.16 లక్షల కోట్లకు పెరిగిందని ఈ నివేదిక వెల్లడించడం విశేషం. అదే సమయంలో 4.6 కోట్ల కంటే ఎక్కువ మంది భారతీయులు 2020లో అత్యంత పేదరికంలో పడిపోయారని అంచనా వేశారు.(ఐక్యరాజ్యసమితి ప్రకారం ప్రపంచ కొత్త పేదలలో దాదాపు సగం మంది). అయితే.. దీనికి కారణం.. పేదలు మరియు అట్టడుగువర్గాల కంటే గొప్ప సంపన్నులకు అనుకూలంగా ఆర్థిక వ్యవస్థను మార్చడమే కారణమని నివేదిక పేర్కొనడం గమనార్హం.
దేశంలో నెలకొన్న ఈ ఆర్థిక అసమనాతను తగ్గించేందుకు ముఖ్యంగా పాఠశాల విద్యలో అధిక పెట్టుబడులు సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ మరియు భారతీయులందరికీ ప్రసూతి సెలవులు ఎర్న్డ్ లీవులు పెన్షన్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాల వంటి చర్యలకు నిధులు సమకూర్చడానికి భారతీయ జనాభాలో అత్యంత ధనవంతులైన 10 శాతం మందిపై ఒక శాతం సర్ఛార్జ్ను విధించాలని నివేదిక సూచించింది.
"అసమానత చంపేస్తుంది`` అనే విషయంలో మన ఆర్థిక వ్యవస్థ ఎంత లోతుగా అసమానంగా ఉందో చూపిస్తుందని ఆక్స్ఫామ్ ఇండియా సీఈవో బెహర్ అన్నారు. ఈ పరిణామం అసమానతలను మాత్రమే కాకుండా పేదరికానికి కూడా ఆజ్యం పోస్తోందన్నారు. మరింత సమానమైన మరియు స్థిరమైన దేశాన్ని సృష్టించే ఆర్థిక వ్యవస్థకు కట్టుబడి ఉండాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అంతేకాకుండా ఆక్స్ఫామ్ ప్రతిరోజూ కనీసం 21000 మంది లేదా ప్రతి నాలుగు సెకన్లకు ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యే అసమానత పూర్తి వాస్తవికతను సూచిస్తుందని బెహర్ చెప్పారు.
అంతేకాకుండా కరోనా మహమ్మారి లింగ సమానత్వాన్ని 99 సంవత్సరాల నుండి ఇప్పుడు 135 సంవత్సరాలకు పడిపోయేలా చేసిందన్నారు. 2020లో మహిళలు ఏకంగా రూ. 59.11 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయారని 2019 కంటే ఇప్పుడు 1.3 కోట్ల మంది మహిళలు పనిలో తక్కువగా ఉన్నారని నివేదిక వెల్లడించింది. పన్నుల ద్వారా సంపదను రాబట్టి.. అసమానతలను సరిదిద్దడం ప్రారంభించాలని ఆర్థిక వ్యవస్థను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని నివేదిక పేర్కొంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలు సంపద పునర్విభజన సమ్మిళిత వృద్ధిని సాధించగలవని భారతదేశం ప్రపంచానికి చూపగలదని బెహర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మహమ్మారి సమయంలో దేశంలో రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించిన బిలియనీర్లు అసమానత పేదరికానికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఆయన సూచించారు.