Begin typing your search above and press return to search.

పౌరసత్వ బిల్లుకు ముందు వివాదాస్పదం అనే తోక అవసరమా?

By:  Tupaki Desk   |   10 Dec 2019 5:08 AM GMT
పౌరసత్వ బిల్లుకు ముందు వివాదాస్పదం అనే తోక అవసరమా?
X
కొన్నిసార్లు అదే పనిగా కొన్ని పదాల్ని ఎందుకు వాడతారో ఏ మాత్రం అర్థం కాదు. లౌకికవాదుల పేరుతో వాదనలు వినిపించే కొందరు ఒక తరహా వాదనే ఎందుకు చేస్తారో ఎంతకూ బోధపడదు. తాము మైనార్టీల పక్షపాతులుగా తమను తాము అభివర్ణించుకునే సెక్యులరిస్టులు.. దేశంలోని మైనార్టీల తరఫున గొంతు వినిపిస్తారు ఓకే. మరి.. అదే పని అన్ని సందర్భాల్లోనూ.. ప్రపంచంలోని మైనార్టీల విషయంలో మాత్రం ఎందుకు వినిపించరు? అంటే మాత్రం దానికి సమాధానం చెప్పరు.

సోమవారం (డిసెంబరు 9న) లోక్ సభలో అధికార బీజేపీ పట్టుపట్టి మరీ పౌరసత్వ బిల్లుకు ఆమోదముద్ర వేయటం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు దీని లెక్క తేలాల్సిందే అన్న పంతంతో చర్చను మొదలెట్టిన అధికారపక్షం దాదాపు పదకొండు గంటల చర్చ అనంతరం ఓటింగ్ జరిపి.. తనకున్న బలంతో ఆమోదముద్ర పడేలా చేసింది. ఈ సందర్భంగా పలువురు వివాదాస్పద బిల్లు అంటూ అభివర్ణించటం చూస్తే ఒళ్లు మండాల్సిందే. ఎందుకంటే.. ఒక బిల్లును కొందరు వ్యతిరేకిస్తే వివాదాస్పద బిల్లు అవుతుందా?

ప్రపంచంలో ఏ దేశంలో అయినా అందరూ ఓకే అనే బిల్లుల్నే చట్టాలుగా చేస్తారా? అన్నది ప్రశ్న. ఇరుగున ఉన్న ఒకప్పటి భారత్ లో భాగమైన పాక్.. బంగ్లాదేశ్ కు చెందిన మైనార్టీలైన హిందువులు.. సిక్కులు.. జైనులు.. బౌద్ధులు.. భారతదేశ పౌరసత్వం కావాలనుకుంటే అందుకు సానుకూలంగా ఉండే ఈ బిల్లు.. ఆయా దేశాల్లోని ముస్లింలకు మాత్రం నో చెబుతుంది. ఇదెందుకు వివాదాస్పదమవుతుంది.
ఈ దేశంలో ముస్లింలు ద్వితీయశ్రేణి పౌరులు ఎంతమాత్రం కాదు. కానీ.. పాక్..బంగ్లాదేశ్ ల్లోని మైనార్టీలైన హిందువులు మాత్రం ద్వితీయశ్రేణి పౌరులుగా బతికేస్తుంటారు. తాము పుట్టిన గడ్డ మీద మమకారంతో విభజన సమయంలో భారత్ కు వచ్చే విషయంలో.. తామున్న ప్రాంతంలోనే ఉండిపోవాలన్న నిర్ణయం తీసుకొని ఎంత పెద్ద తప్పు చేశామో అక్కడి వారు ఇప్పటికి కుమిలిపోతుంటారు. అలాంటి వారికి అవకాశం కల్పించటం తప్పేమవుతుంది?

భారత్ లో ఉండి ఇన్ని మాటలు మాట్లాడే నేతలు కానీ.. మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు కానీ పాక్.. బంగ్లాదేశ్ లోని మైనార్టీలు ఎదుర్కొనే హింస గురించి కానీ వేదనాభరితమైన పరిస్థితుల గురించి కానీ ఎందుకు గళం విప్పరు. ఒకప్పుడు సోదరులైన వారి మీద కనీస కనికరం లేనట్లుగా వ్యవహరించటం ఏమాత్రం సబబు? ముస్లిమేతరులకు అవకాశం ఇచ్చినట్లే? ముస్లింలకు అవకాశం ఎందుకు ఇవ్వరన్న ప్రశ్నను వేస్తారు. ఒక దేశంలో ప్రధమశ్రేణిలో చెలామణి అయ్యే వర్గానికి వేరే దేశంలో ఉదారంగా పౌరసత్వం ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? బాధితుల పక్షాన నిలవాల్సిన వారు.. వారు ఆ పరిస్థితిలోకి రావటానికి కారణమైన వారిని భుజాన వేసుకునేలా మాట్లాడటంలో అర్థముందా?