Begin typing your search above and press return to search.

ఆటలోనే కాదు.. మాటలోనూ ఓర్పు.. విహారిపై ప్రశంసల జల్లు

By:  Tupaki Desk   |   14 Jan 2021 2:53 AM GMT
ఆటలోనే కాదు.. మాటలోనూ ఓర్పు.. విహారిపై ప్రశంసల జల్లు
X
400 పరుగులకు పైగా టార్గెట్.. పైగా నాలుగో ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా అంత పెద్ద టార్గెట్ టీమిండియా ముందు ఉంచడంతో అంతా ఇక ఓటమి ఖాయం అనుకున్నారు. రోహిత్ శర్మ, రహానే ఔట్ అవగానే మ్యాచ్ డ్రా అవుతుందని ఎవరూ అనుకోలేదు. పంత్ దూకుడు, పుజారా బ్యాటింగ్ మళ్లీ మ్యాచ్ ను డ్రా వైపు నడిపాయి.అయితే వారిద్దరూ ఒకేసారి ఔట్ కావడంతో మ్యాచ్ పై అందరికీ ఆశలు పోయాయి. పైగా హనుమ విహారి అంతకు ముందే గాయపడ్డాడు. పెయిన్ కిల్లర్ వేసుకుని మరీ బరిలోకి దిగాడు. ఆస్ట్రేలియా బౌలర్ల నిప్పుల్లాంటి బంతులను ఎదుర్కొంటూ ఎంతో సంయమనం చూపిన విహారి 162 బంతులు ఎదుర్కొని మ్యాచ్ డ్రా చేసేందుకు ఎంతో కష్టపడ్డాడు. అశ్విన్ అండగా బ్యాటింగ్ కొనసాగించి భారత్ ఘోర పరాజయం పాలవకుండా అడ్డుకున్నాడు.

విహారి అంత కష్టపడి భారత్ ని ఓటమి బారి నుంచి కాపాడితే కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో విహారిపై తీవ్ర విమర్శలు చేశాడు. టీమిండియా విజయాన్ని అడ్డుకున్నాడని విమర్శలు చేశాడు. అందరూ పొగుడుతున్న వేళ విహారిపై సుప్రియో కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అసలు సుప్రియో ఏమన్నాడంటే..'ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ లో హనుమ విహారి 7 పరుగులు చేసేందుకు 109 బంతులు ఆడటం నేరం. టీమిండియా విజయాన్ని హనుమ బిహారి చంపేశాడు. క్రికెట్ ని హత్య చేశాడు.' అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. గెలుపు అవకాశాలను పోగొట్టిన అతడు నేరస్తుడంటూ తీవ్రంగా విమర్శించారు. క్రికెట్ గురించి నాకేమీ తెలీదు. అవగాహన లేదంటూనే విహారిపై మంత్రి సెటైర్లు వేయడం హాట్ టాపిక్ గా మారింది.

కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన విహారి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తనపై విమర్శలు చేసిన వ్యక్తికి తగిన బుద్ధి చెబుతాడేమో అనుకుంటే అలా ఏమీ చేయలేదు. సుప్రియో చేసిన ట్వీట్ లో తప్పు గమనించాడు. తన పేరు పొరపాటుగా 'బిహారి' అని రాయడం చూసి .. ' హనుమ విహారి' అని మంత్రికి రిప్లై ఇచ్చాడు. ఎంతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు ఓటమిపాలు కాకుండా రక్షణ కవచంలా నిలిచిన విహారిని విమర్శిస్తావా అంటూ.. నెటిజన్లు సుప్రియో పై ట్రోలింగ్ మొదలు పెట్టారు. తనపై విమర్శ చేసిన వ్యక్తిపై కూడా సహనాన్ని ప్రదర్శించిన విహారిపై ప్రశంసలజల్లు కురుస్తోంది.