Begin typing your search above and press return to search.

కోహినూర్ మాత్రమే కాదు.. మనదగ్గర కొట్టేసినవెన్నో అక్కడున్నాయ్

By:  Tupaki Desk   |   15 Aug 2022 5:05 AM GMT
కోహినూర్ మాత్రమే కాదు.. మనదగ్గర కొట్టేసినవెన్నో అక్కడున్నాయ్
X
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల తర్వాత కూడా స్వాతంత్య్రం సంగ్రామానికి సంబంధించిన అనేక చేదు గురుతులు.. వాటి తాలుకూ గాయాలు ఇప్పటికి వెంటాడుతూనే ఉన్నాయి. దేశ సంపదను భారీగా కొల్లగొట్టిన బ్రిటిష్ పాలకులు.. ఎంతో విలువైన వస్తువుల్ని మన దేశం నుంచి దోచుకెళ్లారు. ఆ లెక్కలోకి వెళ్లినంతనే దేశ ప్రజల నోటి నుంచి వచ్చే మాట.. కోహినూర్ వజ్రం. బ్రిటీషర్లు దోచుకెళ్లిన సంపద ఎంతో ఉన్నా.. అందరికి గుర్తుకు వచ్చేది మాత్రం కోహినూర్ వజ్రమే. ప్రస్తుతం బ్రిటన్ రాణి కిరీటంలో ఉన్న ఈ వజ్రాన్ని తిరిగి దేశానికి తీసుకురావాలని ప్రజలు ఎంతగానో భావిస్తుంటారు.

అయితే.. కోహినూర్ తో పాటు మరెన్నో విలువైన ఆభరణాలు..కళా ఖండాలు.. వెలకట్టలేనివి ఎన్నోఉన్నాయి. 200 ఏళ్ల పాటు భారత్ ను పాలించిన బ్రిటీషర్లు.. విలువైన ఎన్నింటినోతమ దేశానికి తరలించేశారు. ఇలా దోచేసిన వాటిల్లో దాదాపు 40 వేలకు పైగా చారిత్రక.. వారసత్వ ఆధారాలు లండన్ లోని విక్టోరియా.. అల్బర్ట్ మ్యూజికంలో ఇప్పటికి ఉన్నాయి. అవన్నీ మనవే. మన ఆస్తులే. కొల్లగొట్టిన సొమ్ముల్లో అత్యంత అపురూపమైన వెన్నో ఉన్నాయి. అలాంటి వాటి వివరాల గురించి తెలిసినప్పుడు.. కోహినూర్ మాత్రమే కాదు.. అవన్నీ కూడా భారత్ కు రప్పించాల్సిందే అన్న మాట ప్రతి ఒక్కరినోటి నుంచి రావటం ఖాయం.

మైసూర్ మహారాజు టిప్పుసుల్తాన్ ను 1799లో జరిగిన యుద్ధంలో హత్య చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ బలగాలు ఆయన ఆభరణాలు.. వస్తు సామాగ్రిని వదిలిపెట్టలేదు. టిప్పుధరించే రత్న ఖచిత ఖడ్గం.. బంగారు ఉంగరం.. సింహాసనంలోని కంెపులు.. పచ్చలు.. వజ్రాలు పొదిగిన బంగారు పులి తల.. అత్తరు చెక్కతో చేసిన మెకానికల్ టైగర్ ను అపహరించుకుపోయారు.

తర్వాతి కాలంలో వీటిని వేలం వేసి కోట్లాది రూపాయిలు కూడబెట్టుకుననారు. టిప్పు వస్తువులు కొన్ని ఇప్పటికి లండన్ మ్యూజియంలో ఉన్నాయి. 1858లో ఝూన్సీ లక్ష్మీబాయిని దొంగదెబ్బ తీసి చంపేసిన తర్వాత ఆమె రాణికోట నుంచి ఎన్నో బంగారు.. వెండి ఆభరణాలు.. నాణాలు.. డబ్బును దోచుకెళ్లారు. పరుపులు.. దుప్పట్లు.. తలుపులు.. కిటికీలు.. వాటి బోల్టులనుకూడా ఎత్తుకెళ్లారంటే వారెంతలా ఆస్తుల్ని లూటీ చేశారో అర్థమవుతుంది. పంజాబ్ చక్రవర్తి రంజిత్ సింగ్ కోసం హఫీజ్ మహ్మద్ ముల్తానీ అనే స్వర్ణకారుడు 1820-30 కాలంలో ఒక సింహాసనాన్ని తయారు చేసి ఇచ్చాడు. తామరపువ్వు ఆకారాన్ని పోలిని ఈ సింహాసనం అంటే ఆయనకు మహా ఇష్టం. చాలా అరుదుగా మాత్రమే అందులో కూర్చునేవారు. 1849 ఈస్ట్ ఇండియా కంపెనీ దీన్ని సొంతం చేసుకుంది. అనంతరం బ్రిటన్ కు తీసుకెళ్లింది. ఈ సింహాసనానికి బంగారు పూత పూసి తయారు చేశారు.

మొఘల్ మహారాజు షాజహాన్ కు మద్యం తాగేందుకు ప్రత్యేకమైన గిన్నెను వాడేవారు. 1657లో వైట్ నెఫ్రేట్ రాయితో వంగి ఉన్న పక్షి ఉన్న ఆకారంతో దీన్ని తయారు చేయించారు. కల్నల్ ఛార్లెస్ సెటన్ గుత్రీ దీనిపై కన్నేసి దొంగలించాడు. ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో బ్రిటిష్ పాలకుల కాలంలో వెలుగు చూసిన బౌద్ధమతానికి చెందిన శిల్పాలు.. విగ్రహాలు.. శాసనాలు.. చేతిలో గీసిన చిత్రాల్ని లండన్ కు తరలించుకు వెళ్లారు. చలువరాయితో చెక్కిన దాదాపు 120కు పైగా శిల్పాల్ని మ్యూజియంలో చూడొచ్చు.

తాజ్ మహాల్ ను కూల్చి ఆ పాలరాతిని నౌకలో లండన్ కు చేరవేయాలని 1830లో అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ ప్లాన్ వేసినా.. అది ఖరీదైన వ్యవహారం కావటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకన్నారు. ఇక.. కోహినూర్ వజ్రం గురించి అందరికి తెలిసిందే. ప్రస్తుతం అది లండన్ లోని జ్యువెల్ హౌజ్ లో ఉంది. ఇదంతా చదివినప్పుడు మన పూర్వీకులు ఎంతటి సంపన్నులో.. మన సమాజం ఎంతటి సంపదతో తులతూగుతూ ఉండేదో అర్థమవుతుంది.