Begin typing your search above and press return to search.

మోదీ స‌ర్కారుకు కాగ్ షాకిచ్చిందే!

By:  Tupaki Desk   |   22 July 2017 10:25 AM GMT
మోదీ స‌ర్కారుకు కాగ్ షాకిచ్చిందే!
X
శ‌త్రు దేశాలో, ఉగ్ర‌వాదులో దేశంపైకి దండెత్తి వ‌స్తే... భార‌త్ ఎంత‌మేర‌కు నిలువ‌రించ‌గ‌ల‌రు. అస‌లు కేంద్ర బ‌డ్జెట్ లో ర‌క్ష‌ణ శాఖ‌కు కేటాయిస్తున్న నిధులెంత‌? స‌రిగ్గా కేటాయించిన నిధులైనా ఆ శాఖకు పూర్తిగా విడుద‌ల అవుతున్నాయా? ఈ ప్ర‌శ్న‌లకు మ‌న‌కు ఎలాగూ స‌మాధానాలు దొర‌క‌వ‌నే చెప్పాలి. ఎందుకంటే... దేశ ర‌క్ష‌ణ‌కు సంబంధించిన వివ‌రాలు బ‌హిర్గ‌తం కావు కాబ‌ట్టి. అయితే ఇప్పుడు డోక్లామ్ వివాదం నేప‌థ్యంలో ఆ వివాదాన్నే ఆస‌రా చేసుకుని ఎప్ప‌టి నుంచో స‌రిహ‌ద్దుల వ‌ద్ద కాసుక్కూర్చున్న చైనా... ఇప్ప‌టికే భార‌త్‌పైకి దండెత్తేందుకు స‌న్నాహాలు మొద‌లెట్టేసింద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌న సైనిక ప‌టాలాన్ని టిబెట్‌కు త‌ర‌లించేసిన చైనా... ఏ క్ష‌ణాన్నైనా భార‌త్‌పై యుద్ధానికి సిద్ధ‌మేన‌ని కూడా పరోక్షంగా ప్ర‌క‌టించేసిన‌ట్లైంది. గ‌తంలో ఓ సారి ఆ దేశంతో జ‌రిగిన యుద్ధంలో మ‌న‌కు ప‌రాభ‌వ‌మే ఎదురైంది. అంతేకాకుండా రక్ష‌ణ శాఖ‌కు ఆ దేశం కేటాయిస్తున్న నిధుల‌ను చూస్తేనే... ఒక్క భార‌తే కాకుండా ప్ర‌పంచ దేశాల‌న్నీ కూడా షాక్ తింటున్నాయి. ర‌క్ష‌ణ శాఖ‌కు ఏకంగా స‌గానికి పైగా నిధుల‌ను కేటాయిస్తున్న చైనా... ఏటికేడు త‌న సైనిక స‌త్తాను పెంచుకుంటూనే ఉంది. ఈ క్ర‌మంలో మ‌రి ఆ దేశంతో మ‌నం యుద్ధం చేయాల్సి వ‌స్తే ప‌రిస్థితి ఏమిటన్న‌దే ఇప్పుడు అతి పెద్ధ ప్ర‌శ్న‌గా మారిందని చెప్ప‌క త‌ప్పదు.

ఇక భార‌త ర‌క్ష‌ణ రంగం, సైనిక సత్తా, యుద్ధ స‌న్న‌ద్ధ‌త‌... త‌దిత‌ర విషయాల‌ను ప‌రిశీలిస్తే... కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలోని యూపీఏ పాల‌న‌లో దేశ భ‌ద్ర‌త‌కు పెద్ద పీటకు పెద్ద పీట వేయ‌లేక‌పోయింద‌న్న అపప్ర‌ద‌ను మూట‌గ‌ట్టుకుంది. ఈ అంశాన్నే పెద్ద‌గా ప్ర‌చారం చేసిన బీజేపీ మొన్న‌టి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌ల ముందు దోషిగానే నిలిపేసింది. అంతేకాకుండా తాము అధికారంలోకి వ‌స్తే... దేశ ర‌క్ష‌ణ రంగానికి ఇతోదిక ప్రాధాన్యం ఇస్తామ‌ని, బ‌డ్జెట్ కేటాయింపుల‌ను రెట్టింపు కంటే ఎక్కువ చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌లు గుప్పించింది. అనుకున్న‌ట్లుగానే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారుకు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్ట‌గా... న‌రేంద్ర మోదీ ప్ర‌ధాన మంత్రి అయ్యారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీ మేర‌కు ర‌క్ష‌ణ రంగాన్ని ప‌టిష్ఠం చేసేందుకంటూ గోవా సీఎంగా ఉన్న బీజేపీ సీనియ‌ర్ నేత‌, మిస్ట‌ర్ క్లీన్ పొలిటీషియ‌న్‌గా పేరున్న మ‌రోహ‌న్ పారీక‌ర్ చేత సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయించి మ‌రీ ర‌క్ష‌ణ శాఖ ప‌గ్గాల‌ను ఆయ‌న చేతికి అందించారు. పారీక‌ర్ బాగానే ప‌నిచేశారు. పాక్ పై స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ కూడా చేశారు. భార‌త స‌త్తా ప్ర‌పంచానికి చాటిచెప్పారు.

ఇదంతా బాగానే ఉన్నా... అస‌లు విష‌యం లేకుండా ఈ సోది అంత‌తా ఎందుక‌నేగా మీ ప్ర‌శ్న‌. ఇప్ప‌టికిప్పుడు ఇత‌ర దేశాలు మ‌న‌పైకి దండెత్తి వ‌స్తే... మ‌న చేతిలో ఉన్న ఆయుధాల‌కు సంబంధించి కంట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్) ఓ సంచ‌ల‌న నివేదిక‌ను ఇప్పుడు విడుద‌ల చేసింది. పార్ల‌మెంటు ముందుకు నిన్న‌ వ‌చ్చిన ఈ నివేదిక చ‌దివితే... ఒళ్లంతా చెమ‌ట‌లు ప‌ట్ట‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. ఆ వివ‌రాల్లోకి వెళితే... భారత్‌ మీదకు ఏ దేశమైనా దండెత్తితే పది రోజులకు మించి పోరాడే ఆయుధ సంపత్తి మన వద్ద లేదని కాగ్‌ తన రిపోర్టులో పేర్కొంది. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు(ఓఎఫ్‌బీ)కి సంబంధించిన వివరాలను శుక్రవారం పార్లమెంట్‌లో కాగ్‌ ప్రవేశపెట్టింది. దేశ రక్షణకు ఎంతో అవసరమైన యుద్ధ సామగ్రిని పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచుకోలేకపోతున్నామని చెప్పింది. 2013 నుంచి 2016 సెప్టెంబర్‌ వరకూ మన వద్ద ఉన్న యుద్ధ సామగ్రి నిల్వల్లో పెద్ద మార్పులేవి లేవని తెలిపింది. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే అత్యవసరమయ్యే 55 శాతం సామగ్రి అందుబాటులో లేదని చెప్పింది. అందుబాటులో ఉన్న 40 శాతం యుద్ధ సామగ్రి కూడా పది రోజుల పాటు యుద్ధం జరిగితే అయిపోతుందని తెలిపింది.

ముఖ్యంగా ఆర్టిలరీ గన్స్‌, ట్యాంక్‌లకు అవసరమయ్యే యుద్ధ సామగ్రి కొరత తీవ్రంగా ఉందని చెప్పింది. 2013లో పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడం ఓఎఫ్‌బీ విఫలమైందని విమర్శించింది. పేలుళ్లు, మిస్సైల్స్‌లలో ఉపయోగించే ఫ్యూజ్‌ల కొరత ఎక్కువగా ఉందని ఆర్టిలరీ మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ వీకే చతుర్వేది ఓ జాతీయ మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. ఫ్యూజ్‌లు లేకపోవడం వల్ల యుద్ధంలో మిస్సైల్స్‌ - మోర్టార్స్‌ - ఆర్టిలరీ ఎక్స్‌ ప్లోజివ్స్‌ లను వినియోగించలేమని చెప్పారు. అంటే... మొన్న‌టికి మొన్న పార్ల‌మెంటు సాక్షిగా... మ‌న‌పైకి ఏ దేశం దండెత్తి వ‌చ్చినా... తాము మాత్రం భ‌య‌ప‌డ‌బోమ‌ని, యుద్ధం చేసేందుకు స‌ర్వం సిద్ధం చేసుకునే ఉన్నామ‌ని విదేశాంగ శాఖ మంత్రి హోదాలో సుష్మా స్వ‌రాజ్ చేసిన ప్ర‌క‌ట‌న బూట‌కమేన‌న్న వాద‌న వినిపిస్తోంది.