Begin typing your search above and press return to search.

పోలీసులకు సహకరించటం లేదా ?

By:  Tupaki Desk   |   14 Jan 2021 10:30 AM GMT
పోలీసులకు సహకరించటం లేదా ?
X
కిడ్నాప్ కేసులో అరెస్టయిన మాజీమంత్రి, తెలుగుదేశంపార్టీ నాయకురాలు విచారణలో పోలీసులకు ఏమాత్రం సహకరించటం లేదని సమాచారం. బోయినపల్లిలోని ముగ్గురు రిలయాల్టర్ సోదరుల కిడ్నాప్ ఘటన అందరికీ తెలిసిందే. దాదాపు వారం రోజుల క్రితం జరిగిన ఘటన తెలుగురాష్ట్రాల్లో సంచలనమైంది. ఘటన జరిగిన రెండోరోజే పోలీసులు భూమా అఖిలప్రియను అరెస్టు చేశారు. ప్రస్తుతం విచారణ నిమ్మితం ఈ మాజీమంత్రి పోలీసుల కస్టడీలో ఉన్నారు.

మూడు రోజులుగా పోలీసు కస్టడీలోనే ఉన్నప్పటికీ అఖిల ఏ విషయంలో కూడా సహకరించలేదని తెలుస్తోంది. తన న్యాయవాదుల సమక్షంలోనే అఖిలను ఇద్దరు ఏసీపీ అధికారుల బృందం ఎన్ని ప్రశ్నలు వేసినా ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదట. కిడ్నాప్ ఘటనను, అందులో పాత్రదారులను, సూత్రదారుల గురించి ఇలా ఏ ప్రశ్న వేసినా తనకేమీ తెలీదనే సమాధానం చెబుతున్నారట. మూడు రోజుల్లో మొత్తం 300 ప్రశ్నలు సంధించినా చాలా వాటికి అసలు నోరే విప్పలేదట.

కిడ్నాపర్లకు అఖిలకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణల గురించి పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. అయితే అఖిల మాత్రం మాజీమంత్రి హోదాలో తనకు ఎంతోమంది ఫోన్లు చేస్తుంటారని చాలా నిర్లక్ష్యంగా జవాబులిస్తున్నారట. గుంటూరు శ్రీను నుండి అఖిలకు వచ్చిన కాల్స్ గురించి అడిగినపుడు ‘చేస్తే చేసుండచ్చని, తనకెంతోమంది ఫోన్లు చేస్తుంటార’ని సమాధానం ఇచ్చారట.

మొత్తం మీద కిడ్నాప్ చేయటమే కాకుండా ఒకవేళ పట్టుబడితే ఎలా తప్పించుకోవాలో కూడా అఖిల అండ్ కో ముందుగానే బాగా ప్రిపేర్ అయినట్లే పోలీసులకు అర్ధమవుతోంది. లేకపోతే మొబైల్ కాల్ లిస్టు బయటపెట్టినా, సిమ్ కార్డులు ఎక్కడ కొన్నారో తెలుసుకున్నా, కిడ్నాపులో ఎంతమంది పాల్గొన్నారో తెలిసిపోయిన తర్వాత కూడా పోలీసులకు విచారణలో అఖిల ఏమాత్రం సహకరించటం లేదంటే అర్ధమేంటి ? దొరికిపోతే పోలీసులకు ఏమాత్రం సహకరించకూడదన్న విషయాన్ని ముందుగానే తీర్మానించుకునే కిడ్నాప్ వ్యవహారంలోకి దిగినట్లు అర్ధమైపోతోంది. మరి పోలీసుల తర్వాత స్టెప్ ఏమిటో చూడాల్సిందే.