ఎంపీ లాడ్స్.. ఒక్కరూ అప్లయి చేయలేదట..!

Mon Jan 24 2022 22:00:02 GMT+0530 (IST)

Not a single MP has filed an application

రెండున్నరేళ్ల పాలనా కాలం పూర్తయింది. 2019 ఎన్నికల్లో విజయం దక్కించుకున్న తర్వాత.. రాష్ట్రంలో గెలుపు గుర్రం ఎక్కిన వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారు?  ఏం చేశారు? ఈ విషయాన్ని పరిశీలిస్తే.. ఒకరిద్దరు మినహా మిగిలిన ఎంపీలు ఎవరూ ప్రగతి సాధించిన రికార్డులు కనిపించడం లేదు. నిజానికి ఎంపీ స్థాయిలో అభివృద్ధి కనుక పరుగులు పెడితే.. ఆ పరిధిలో ఉంటే ఏడు  అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆటోమేటిక్‌గానే అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ.. ఇప్పుడు రాష్ట్రంలో ఈ దిశగా ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని పరిశీలకులు చెబుతున్నారు.ఒకప్పుడు ఎన్నికల వరకు పరిమితమైన రాజకీయాలు ఇప్పుడు ఎంపీలుగా గెలిచిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు  పైచేయి సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి ప్రత్యర్థుల మధ్య పోరు ఎక్కడైనా ఉంటుంది కానీ.. వైసీపీ ఎంపీలకు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్రమైన విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ ప్రభావం నియోజకవర్గాలపై కూడా పడింది. నియోజకవర్గాల్లో అభివృద్ధి కనిపించడం లేదని.. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రం వచ్చిన రూపాయి వచ్చినట్టు సంక్షేమానికి వెచ్చిస్తున్నారు. దీంతో నిధుల లేమి కనిపిస్తోంది.

పైగా 2019లో సీఎం జగన్ చెప్పినట్టు.. అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. అది కూడా చేయలేదు. దీంతో ఎమ్మెల్యేల తరఫు నుంచి ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదు. ఇక ఎంపీలు అయినా.. కేంద్రం నుంచి నిదులు తీసుకువచ్చి అభివృద్ధి చేయాలి కదా! అంటే.. అడిగిన వారికి మాత్రమే నిధులు అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోంది. కరోనా నేపథ్యంలో గత ఏడాది ఎంపీ లాడ్స్ నిధులకు కత్తెర పెట్టిన మోడీ సర్కారు ఇటీవల మళ్లీ నిధులు ఇస్తోంది. అయితే.. ప్రాధాన్యం ప్రకారమే ఇస్తామని చెప్పినా.. ఏపీ నుంచి ఎవరూ దీనికి అప్లయి చేసుకోలేదు. దీంతో ఏపీకి ప్రాధాన్యం పోయింది. అంటే.. ఈ ఏడాది చివరికి కానీ ఏపీకి నిధులు  కేటాయించే అవకాశం లేదు.

దీంతో ఎంపీలు తమ నియోజకవర్గాల్లో కనీసం.. ఒక్కటంటే ఒక్కటి రిబ్బన్ కటింగ్ కూడా చేయలేక పోతున్నారు. ఇక అసెంబ్లీల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం అంతో ఇంతో ఇస్తున్నా.. ఎమ్మెల్యేలతో ఉన్న విభేదాలు వివాదాల కారణంగా.. ఎంపీలు అసలు నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదు. దీంతో ఎక్కడికక్కడ అభివృద్ధి అనే మాట అటుంచితే.. అసలు నియోజకవర్గాలను పట్టించుకుంటున్నవారు కూడా కనిపించడం లేదు. మరి ఎన్నికలకు ముందు.. ఈ పరిస్థితి ఇలానే ఉంటే ఎలా? అనేది ప్రధాన ప్రశ్న.