Begin typing your search above and press return to search.

కిమ్ మళ్లీ అదృశ్యమయ్యాడు.. నార్త్ కొరియాలో ఏం జరుగుతోంది..!

By:  Tupaki Desk   |   7 Feb 2023 5:00 PM GMT
కిమ్ మళ్లీ అదృశ్యమయ్యాడు.. నార్త్ కొరియాలో ఏం జరుగుతోంది..!
X
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఏం చేసినా అది మిస్టరీగానే మారుతోంది. అణ్వస్త్ర క్షిపణి ప్రయోగాలతో నిత్యం వార్తల్లో నిలిచే కిమ్ పలు వివాదాస్పద నిర్ణయాలతోనూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటూ ఉంటారు. ఇక ఉత్తర కొరియా ప్రజలు ఎలాంటి హెయిర్ స్టైల్ చేయించుకోవాలి.. ఎలాంటి పేర్లు పెట్టుకోవాలో కూడా కిమ్ జోంగే నిర్ణయిస్తంటారనే సంగతి అందరికీ తెలిసిందే.

దీంతో ప్రపంచం కళ్లన్నీ ఉత్తర కొరియా అధినేతపై ఉంటాయి. ముఖ్యంగా దక్షిణ కొరియా.. అమెరికా దేశాలు కిమ్ జోంగ్ ప్రతి కదిలికను తెలుసుకొనేందుకు నిఘా పెడుతుంటాయి.

అయితే కిమ్ జోంగ్ ఉన్ గత కొద్దిరోజులుగా ఆర్మీ ముందుకు రావడం లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయనకు ఆరోగ్యం బాగోలేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఇక త్వరలోనే నార్త్ కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ లో పీపుల్స్ ఆర్మీ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సామూహిక కవాతులు నిర్వహించనున్నారు.

గత కొద్ది రోజులుగా ఆయన బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ కన్పించకపోవడంతో ఈ వార్షికోత్సవానికి ఆయన హాజరు అవుతారా? లేదా? ఉత్కంఠత నెలకొంది. మరోవైపు కిమ్ జోంగ్ ఆదివారం జరిగిన పొలిట్ బ్యూరో సమావేశానికి సైతం హాజరు కాలేదని స్థానిక మీడియా పేర్కొంది. నెలరోజుల నుంచి ఆయన ఆచూకీ లభించడం లేదని మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా 2014లోనూ కిమ్ జోంగ్ 40 రోజుల పాటు ప్రజలకు కన్పించకుండా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.

త్వరలోనే పీపుల్స్ ఆర్మీ 75వ వార్షికోత్సవం జరుగనున్న నేపథ్యంలో ఆయన హాజరుపై సందిగ్ధత నెలకొంది. ఇదిలా ఉంటే కిమ్ జోంగ్ తమ దేశ సామూహిక కవాతు ప్రదర్శన ద్వారా యుద్ధ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో పీపుల్స్ ఆర్మీ వార్షికోత్సవాన్ని అవకాశం తీసుకొని తన అణ్వాయుధ క్షిపణి సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం లేక పోలేదని అమెరికా దాని మిత్ర దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

ఇటీవల అమెరికా.. దక్షిణ కొరియాలు సామూహిక సైనిక విన్యాసాలు చేయడంపై నార్త్ కొరియా మండిపడింది. అమెరికా ఎత్తుగడలను తిప్పికొట్టేలా అత్యంత శక్తివంతమైన అణ్వాయుధాలను ప్రయోగిస్తామని హెచ్చరించింది. కాగా నార్త్ కొరియా 2022 లోనే సుమారు 70 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇవన్నీ దక్షిణ కొరియా సహా అమెరికాలోని ప్రధాన భూభాగాలను చేరుకునే సామర్థ్యం కలిగి ఉన్న అణ్వాయుధాలు కావడం గమనార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.