Begin typing your search above and press return to search.

ప్రగతిభవన్ లో మీటింగ్ కు మాస్కులు అక్కర్లేదా?

By:  Tupaki Desk   |   25 July 2021 9:49 AM GMT
ప్రగతిభవన్ లో మీటింగ్ కు మాస్కులు అక్కర్లేదా?
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా చెప్పిన సత్యమేమంటే.. ప్రపంచంలో ఏ ప్రదేశం కూడా సేఫ్ కాదని. చైనాలో పుట్టిన వైరస్.. తనకు ఎల్లలు లేవన్న విషయాన్ని చాలా తక్కువ కాలంలోనే నిరూపించిన సంగతి తెలిసిందే. కంటికి కనిపించని ఈ మహమ్మారి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కరోనాకు దూరంగా ఉండాలంటే ముఖానికి మాస్కులు పెట్టుకోవటం.. భౌతిక దూరాన్ని పాటించటంతో పాటు.. మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అటు ప్రభుత్వం ఇటు మీడియాతో పాటు పలు సంస్థలు అదే పనిగా చెప్పటం తెలిసిందే.

ఈ మధ్యనే కరోనా సెకండ్ వేవ్ రెండు తెలుగు రాష్ట్రాల్ని ఏ రీతిలో షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మే నెల మొత్తం వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ కరోనాతో కిందా మీదా పడిపోయిన పరిస్థితి. ప్రతి రెండు ఇళ్లల్లో ఒకటి.. ఏదోకారణంతో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని నెత్తి నోరు కొట్టుకుంటున్నా.. పాలకుల్లో మాత్రం అలాంటిదేమీ కనిపించని వైనం తరచూ చర్చగామారుతోంది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తాజాగా ప్రకటించిన తెలంగాణ దళితబంధు పథకం గురించి చర్చించటం కోసం దీన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న హుజూర్ నగర్ కు చెందిన వారిని పెద్ద ఎత్తున ప్రగతిభవన్ కు పిలిపించారు. వారితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీశ్ తో సహా పలువురు హాజరయ్యారు. మరి.. ఈ సమావేశం సందర్భంగా వేదిక మీద ఉన్న సెక్యురిటీ ఉద్యోగులతో పాటు ఒకరిద్దరు మినహా మిగిలిన వారెవరూ ముఖానికి మాస్కు పెట్టుకోని పరిస్థితి.

చివరకు మంత్రులు హరీశ్ మరెవరూ కూడా మాస్కుపెట్టుకోలేదు. ఇక.. ఈ సమావేశానికి హాజరైన వారిని చూసినప్పుడు కూడా వారిలో చాలామంది ముఖానికి మాస్కులు లేకుండా సభలో ఉండటం కనిపిస్తోంది. ఇలాంటివి. థర్డ్ వేవ్ కు దారి తీయవా? బాధ్యతగా ఉండాల్సిన వారు.. పది మందికి స్ఫూర్తిని కలిగించాల్సిన వారు ముఖానికి మాస్కు పెట్టుకోకుండా ఉండటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.