Begin typing your search above and press return to search.

ప్రైవేట్ సంస్థలకి ఊరట కల్పించిన సుప్రీం ..ఏంటంటే !

By:  Tupaki Desk   |   5 Jun 2020 6:30 AM GMT
ప్రైవేట్ సంస్థలకి ఊరట కల్పించిన సుప్రీం ..ఏంటంటే !
X
లాక్ డౌన్ సమయంలో తమ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించని సంస్ధలపై కఠిన చర్యలు తీసుకోకుండా మే 15న ఇచ్చిన ఆదేశాలను జూన్ 12 వరకూ పొడిగిస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. అంతకు ముందు కేంద్రం మార్చి 29న జారీ చేసిన సర్క్యులర్ లో పూర్తి జీతాలు ఇవ్వని సంస్ధలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమాజంలో మిగిలిన వర్గాలతో సమానంగా వారికీ ఊరట కలిగించేలా ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రైవేటు సంస్ధలకు చేరవేయాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్రం లేఖ రాసింది. ఈ సర్క్కులర్ పై కార్పోరేట్ సంస్ధలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వని సంస్ధలపై బలవంతంగా చర్యలు తీసుకునేందుకు రాజ్యాంగపరంగా అవకాశం లేదని మే 15న ఇచ్చిన ఉత్తర్వుల్లో తేల్చిచెప్పింది. ఈ లాక్ డౌన్ టైంలో ఉద్యోగులతో పాటు సంస్ధలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుచేసింది.

అయితే తర్వాత కేంద్రం ఈ ఆదేశాలను సమీక్షించాలని కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు మరోసారి దీనిపై స్పందించింది. మే 15న తాము ఇచ్చిన ఆదేశాలను జూన్ 12 వరకూ పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వాలనేది ఎంత ముఖ్యమో, సంస్ధలు ఆర్ధికంగా ఇబ్బందులపాలవ్వకుండా మనుగడ సాగించడం కూడా అంతే ముఖ్యమని, ఈ రెండింటికీ మధ్య సమన్వయం కావాలని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది.