Begin typing your search above and press return to search.

విశాఖ ఊసు లేకుండానే ముగిసిన జీ 20 సదస్సు

By:  Tupaki Desk   |   31 March 2023 9:17 AM GMT
విశాఖ ఊసు లేకుండానే ముగిసిన జీ 20 సదస్సు
X
విశాఖలో జీ 20 సదస్సు మూడు రోజుల పాటు సాగింది. ఈ సదస్సు అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కలిగినది. జీ 20 సభ్య దేశాలు ఇరవై ఉన్నాయి. వాటి నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు పదుల సంఖ్యలో హాజరయ్యారు. 28, 29, 30 తేదీలలో జరిగిన జీ 20 సదస్సుకు ముఖ్యమంత్రి జగన్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. తొలి రోజు సదస్సు జరిగితే రాత్రి కొద్ది సేపు మాత్రమే జగన్ గడిపారు. అతిధులకు ప్రభుత్వం తరఫున ఇచ్చిన విందులో పాలుపంచుకున్నారు.

ఏపీలో ఇళ్ళ నిర్మాణం అతి పెద్ద కార్యక్రమంగా జగన్ ఈ సందర్భంగా చెప్పారు. అదే విధంగా ఏపీలో పేదల కోసం తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోందని ఆయన వివరించారు. సీఎం ఇలా క్లుప్తంగా మాట్లాడి వెళ్ళిపోవడం ఈసారి విశేషం. జగన్ ఈ సదస్సులో పూర్తి స్థాయిలో పాలు పంచుకుంటారని భావించిన వారు ఆశ్చర్యానికి గురి అయ్యారు.

దీనికి కాస్తా ముందుకు వెళ్తే మార్చి 3, 4 తేదీలలో విశాఖలో ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరిగింది. ఆ సదస్సుకు వైసీపీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు, సదస్సు వేదిక మీద రెండు రోజులూ జగన్ విశాఖ గురించే మాట్లాడారు, విశాఖ రాజధాని అని ఎలుగెత్తి చాటారు. దాంతో ఆయనతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర కీలక నేతలు కూడా విశాఖ కాబోయే క్యాపిటల్ అని ఊదరగొట్టారు.

రేపో నేడో పరిపాలనా రాజధాని విశాఖకు వస్తోందని కూడా వారు చెప్పుకొచ్చారు. ఇక ఇంకాస్తా ముందుకు వెళ్తే జనవరి 30న న్యూ ఢిల్లీలో జరిగిన పెట్టుబడుల సదస్సు సన్నాహక సమావేశంలో జగన్ విశాఖకు తొందరలో తాను షిఫ్ట్ కాబోతున్నానని, మీతో పాటే సదస్సు వేళకు అక్కడే ఉంటానని నమ్మకంగా చెప్పారు. విశాఖే రాజధాని అని బిగ్ సౌండ్ చేశారు.

అలా వైసీపీ మంత్రులు నేతలు, సీఎం సహా అంతా మాటకు ఒకసారి విశాఖే రాజధాని అని చెప్పకుండా ముగించేవారు కాదు. అలాంటిది విశాఖలో ప్రతిష్టాత్మకైన జీ 20 సదస్సు జరిగితే కనీసం విశాఖ రాజధాని ఊసే లేకుండా పోవడం చిత్రమే అంటున్నారు. 150 కోట్ల రూపాయలతో విశాఖను అంతా అభివృద్ధి చేశారు.

జీ 20 సదస్సు కోసం ప్రత్యేకించి విశాఖనే ఎంపిక చేయడం వెనక కూడా రాజధాని వ్యూహం ఉందని అన్న వారూ ఉన్నారు. మరి ఇంతలా విశాఖ గురించి ఒకటికి పదిసార్లు ప్రచారం చేసిన వారు జీ 20 సదస్సు అదే సిటీలో జరుగుతూంటే మాత్రం ఫుల్ సైలెంట్ అయిపోయారు అని అంటున్నారు. విశాఖ ఇంటర్నేషనల్ సిటీ. తొందరలో విశాఖకు రాజధాని వస్తుందని యువ మంత్రి చెప్పరేంటి అన్న డౌట్లు వస్తున్నాయి.

అయితే సీఎం జగనే ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం, ఎక్కడా విశాఖ ప్రస్తావన ఏదీ ప్రభుత్వ పెద్దలు చేయకపోవడంతో వైసీపీ నేతలు కూడా విశాఖ ఊసు మరచారు అని అంటున్నారు. అసలు విషయం ఇది కాదు ఇదంతా ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచి వైసీపీకి కొట్టిన గట్టి దెబ్బ ప్రభావం అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా విశాఖ ఊసు లేకుండానే జీ 20 సదస్సు ముగియడం మాత్రం విస్మయపరుతోంది అని అంటున్నారు అంతా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.