రామజన్మభూమి అయిపోయింది..ఇపుడు సీతమ్మవారి ఆలయమట!

Sun Oct 25 2020 18:00:53 GMT+0530 (IST)

Nitish Kumar Talking About Seeta Ammavari temple

ఎన్నికల్లో గెలవటానికి రాజకీయ నేతలు ప్రస్తావించని అంశం లేనేలేదు. ఏ అంశాన్ని ప్రస్తావిస్తే ఏ సెంటిమెంటును రాజేస్తే ఓట్లు వస్తాయని అనుకుంటారో  దాన్నే పదే పదే జనాల మెదళ్ళల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తారు. దశాబ్దాలుగా రామజన్మ భూమి అనే నినాదాన్ని పట్టుకుని బీజేపీ ఎంతగా ఎదిగిందో అందరికీ తెలిసిందే. ఒకసారి రామజన్మ భూమిలో రామాలయం నిర్మాణం మొదలైన తర్వాత ఇక ఇష్యు లేదని బహుశా బీజేపీ అనుకున్నట్లు ఉంది.అయితే బీజేపీ స్ధానంలో ఈ అంశాన్ని  ఎల్జేపీ మొదలుపెట్టింది. బీహార్ లో  సీతమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తామంటూ జనాలకు హామీలు గుప్పించేస్తోంది. బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ సీతామర్హి ప్రాంతంలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ సీతమ్మవారి ఆలయ నిర్మాణంపై  హామీ ఇచ్చారు. సీతమ్మ లేనిదే రామయ్య లేడట. అందుకనే బీజేపీ వాళ్ళు అయోధ్యలోని  రామజన్మ భూమిలో ఆలయం కడుతుంటే తాము గెలిస్తే సీతామర్హిలో సీతమ్మవారి ఆలయం నిర్మిస్తామని చెప్పారు.

ఎన్డీఏ కూటమిలో నుండి బయటకు వచ్చేసిన చిరాగ్ ఇఫుడు ఎన్నికల్లో ఎదురీదుతున్నారు. తనను తాను చాలా గొప్పగా అంచనా వేసుకుని చిరాగ్ ఎవరితోను పొత్తులేకుండానే ఒంటిరిగా బరిలోకి దిగారు. ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసినా బీజేపీతో పొత్తుంటుందని చేసిన ప్రకటన జనాల్లో అయోమయం సృష్టించింది. ఈ విషయాన్ని గ్రహించిన కమలంపార్టీ వెంటనే ఎల్జేపీతో తమకు పొత్తు లేదని బహిరంగంగా ప్రకటిచేసింది.

అప్పటి నుండి మొత్తం 243 సీట్లలో గట్టి అభ్యర్ధులను పోటీలోకి దింపలేక నానా అవస్తలు పడుతున్నారు. యువకుడైన చిరాగ్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడకుండా సీతమ్మవారి ఆలయం కడతామని ప్రకటించటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. మామూలుగా యువనేతల దృష్టి అంతా అభివృద్ధిపైనే ఉంటుంది. కానీ చిరాగ్ మాత్రం అదంతా ఒదిలేసి ఆలయాల నిర్మాణాలపై మాట్లాడుతున్నారంటే ఎక్కడో తేడా కొడుతోందనే అనుమానం వస్తోంది.