కార్లు కొనకపోవడానికి కారణం చెప్పిన నిర్మల!

Wed Sep 11 2019 12:44:14 GMT+0530 (IST)

Nirmala Sitharaman On Auto Crisis

దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయమన్నాడట వెనుకటికి ఒకడు.. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెబుతున్నది ఇదే.. దేశంలో ఆటోమొబైల్ రంగంలో భారీగా పడిపోయిన అమ్మకాలు.. తద్వారా కంపెనీల మూత ఉద్యోగాలు కోల్పోతున్న తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన కారణం విని ఇప్పుడు భారత పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.కేంద్రం తప్పుడు నిర్ణయాలైన నోట్ల రద్దు - జీఎస్టీ వల్లే ఇప్పుడు ఆర్థికమాంద్యం దేశాన్ని చుట్టుముట్టిందని మార్కెట్ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఆటోమొబైల్ రంగం పరిశ్రమపై కేంద్రం భారీగా జీఎస్టీ విధించింది. దీంతో ఆర్థిక మాంద్యంతో జనాల చేతిల్లో డబ్బులు లేక ఇప్పుడు మోటార్ వాహనాల అమ్మకాలు 30శాతం పడిపోయాయి. లారీలు - ట్రక్కుల అమ్మకాలు ఏకంగా 70శాతం పడిపోయాయి. ఇక కార్ల అమ్మకాలు భారీగా తగ్గి మారుతి లాంటి దేశ దిగ్గజ కంపెనీలే ప్లాంట్లను మూసివేసే పరిస్థితి వచ్చింది. తద్వారా వేల మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. దీనంతటికి మాంద్యం భారీగా పెంచిన జీఎస్టీయే కారణమని పరిశ్రమ వర్గాలు కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నాయి..

అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాత్రం కార్ల అమ్మకాలు పడిపోవడానికి ఓలా ఉబెర్ లాంటి కంపెనీలు కారణమని సెలవిచ్చింది. నేటి యువతరం అంతా సొంతంగా కార్లు కొనుక్కోవాలనే ఆలోచన మాని.. ఓలా - ఉబెర్ అద్దె వాహనాల్లో ప్రయాణిస్తున్నారని.. అందుకే ఆటోమొబైల్ రంగంలో అమ్మకాలు పడిపోయాయని నిర్మల పేర్కొంది.

 ఈ వ్యాఖ్యలు ఆమెను నవ్వుల పాలు చేశాయి. మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పరిశ్రమ వర్గాలు విమర్శలు చేస్తున్నారు. సరే కార్ల అమ్మకాలకు ఓలా - ఉబెర్ కారణం.. మరి ట్రక్కులు - లారీ - ద్విచక్రవాహనాలు - ఇతర వాహనాల విక్రయాలు పడిపోవడానికి కారణం కూడా ఓలా - ఉబెర్ యేనా అందరూ నిలదీస్తున్నారు. పెంచిన జీఎస్టీ - మాంద్యం దెబ్బకు అని ఒప్పుకోకుండా కేంద్ర ఆర్థిక మంత్రి ఇలా సిల్లీ రీజన్స్ చెప్పడంపై నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.