Begin typing your search above and press return to search.

చివరి రోజుల్లో కంపు చేసుకుంటున్న నిమ్మగడ్డ!?

By:  Tupaki Desk   |   13 Jan 2021 5:27 AM GMT
చివరి రోజుల్లో కంపు చేసుకుంటున్న నిమ్మగడ్డ!?
X
నిమ్మగడ్డ వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. రెండు రోజుల్లో రెండు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలి చాలా విచిత్రంగా ఉంది. తాజాగా అంటే మంగళవారం ఎలక్షన్ కమీషన్ కార్యదర్శి వాణిమోహన్ సేవలు కమీషన్ కు అవసరం లేదని ఆమెను ఉన్నపళంగా రిలీవ్ చేసేశారు. వాణీమోహన్ సేవలు కమీషన్ కు అవసరం లేదని ఆమెను కార్యదర్శిగా తొలగించినట్లు నిమ్మగడ్డ చీఫ్ సెక్రటరీకి లేఖ ద్వారా సమాచారం ఇవ్వటం ఆశ్చర్యంగా ఉంది.

నిజానికి ఎన్నికల కమీషన్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది అందరికీ నిమ్మగడ్డే బాస్ అనటంలో సందేహం లేదు. అయితే కమీషనర్ హోదాలో నిమ్మగడ్డ ప్రభుత్వంతో చిటికి మాటికి గొడవలు పెట్టుకోవటం, ప్రతి చిన్న విషయానికి కోర్టులో కేసులు వేయటం, గవర్నర్ ను కలిసి ఫిర్యాదులు చేస్తుండటంతో సిబ్బందికి కూడా ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే రాబోయే మార్చిలో నిమ్మగడ్డ రిటైర్ అయిపోతున్నారు. ఈలోగానే వీలైనంతలో ప్రభుత్వాన్ని గబ్బు పట్టించేయాలనే అజెండాతో నిమ్మగడ్డ ఉన్నట్లు తెలిసిపోతోంది.

ఇందుకే నిమ్మగడ్డ ప్లానులో మిగిలిన సిబ్బంది సహకరించటం లేదు. ఎందకంటే మార్చి తర్వాత నిమ్మగడ్డ ఎవరో ప్రభుత్వం ఎవరో. కానీ మిగిలిన సిబ్బంది ఇంకా ప్రభుత్వంలో పనిచేయాల్సిన వాళ్ళే. మరి నిమ్మగడ్డ పాటకు వంతపాడితే మార్చి తర్వాత తమ గతేమవుతుందో అన్న భయంతోనే వాళ్ళు నిమ్మగడ్డకు మద్దతుగా నిలవటం లేదు. దాంతో అందరిపైనా కమీషనర్ కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. వాణిమోహన్ను కార్యదర్శిగా తొలగించటం ఇందులో భాగమే.

సోమవారం నాడు జాయింట్ డైరెక్టర్ సాయిప్రసాద్ ను ఏకంగా ఉద్యోగంలో నుండి తీసేశారు. ఎందుకయ్యా అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనారోగ్యంగా ఉందని చెప్పి నెల రోజులు శెలవు పెట్టారట. అనారోగ్యంగా ఉందని శెలవుపెట్టగానే ఏకంగా ఉద్యోగంలో నుండే తీసేయటం చరిత్రలోనే ఎక్కడా లేదు. ఆ ఉద్యోగి శెలవుపెడితే ఆ పోస్టులో మరొకరిని నియమించుకుని పనిచేయించుకోవాలి. ఉద్యోగిని తీసేయటమే కాకుండా ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను కూడా ఆపేయాలని ఆదేశించారంటే నిమ్మగడ్డ ఏ స్ధాయిలో కక్ష తీర్చుకుంటున్నారో అర్ధమైపోతోంది. ఇంకా ముందు ముందు ఇంకెంతమందిపై చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే.