సీనియర్ల వైరాగ్యం.. జగన్ తో కలసి నడవలేరా...ఎందుకిలా...?

Sat Oct 01 2022 05:00:02 GMT+0530 (India Standard Time)

News on ycp jagan party leaders

వైసీపీలో సీనియర్ నేతలకు కొదవ లేదు. చాలా మంది ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ లో ఏళ్లకు ఏళ్ళు పనిచేసి వచ్చిన వాళ్ళు. అక్కడ దర్జాతో పాటు అధికార వైభోగాలు అనుభవించారు. అన్నింటి కంటే ముఖ్యంగా అపరిమితమైన స్వేచ్చను వారు ఎంజాయ్ చేశారు. కాంగ్రెస్ ఒక మహా సముద్రం. అక్కడ హై కమాండ్ ని తప్ప ఎవరు ఎవరిని అయినా హ్యాపీగా టార్గెట్ చేయవచ్చు. ఎవరిని అయినా ఇష్టం వచ్చినట్లుగా విమర్శించవచ్చు.ఇక పదవుల విషయంలో రాకపోతే అలకపానుపు ఎక్కి నెగ్గించుకోవచ్చు. ఇలా కాంగ్రెస్ లో ఉన్న వారు అంతా సముద్రంలో గజ ఈతగాడు మాదిరిగా ఈదినట్లే. అయితే వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీలోకి అంతా రావడంతో వారు చిన్న చెరువులో పడినట్లుగా ఫీల్ అవుతూ వచ్చారు. దీని మీద ఆ మధ్యన ఒక యూ ట్యూబ్ ఇంటర్వ్యూలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ. అక్కడ ఏది చేసినా చెల్లుతుంది. ప్రాంతీయ పార్టీలకు కొన్ని పరిమితులు ఉంటాయి. వాటికి కట్టుబడే పనిచేయాలి అని వైసీపీలో సీనియర్ల పరిస్థితుల గురించి ఒక్క ముక్కలో  చెప్పేశారు.

ఇవన్నీ పక్కన పెడితే జగన్ తండ్రి వైఎస్సార్ తో పనిచేసిన వారు చాలా మంది ఇపుడు వైసీపీలో ఉన్నారు. వీరికి జగన్ జూనియర్ గా కనిపిస్తారు. జగన్ కి సీనియర్లను తన తండ్రి కాలం వారిని దగ్గరకు తీయడం అంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుందని ప్రచారం కూడా ఉంది. చనువుగా వారిని ఏమైనా అని పని చేయించుకోవడమో సలహాలు ఇవ్వడమో చేయలేని పరిస్థితి అని కూడా నాడు ప్రచారం జరిగింది.

అంటే అటూ ఇటూ కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితే ఉంది అని అంటున్నారు. ఇంకో వైపు జగన్ సీనియర్లకు మంత్రి పదవులు ఇచ్చినా చాలా మందిని పక్కన పెట్టేశారు. కొత్తవారికి అవకాశాలు ఇచ్చారు. ఇలా సీనియర్ల విషయంలో గౌరవించాలి వారిని అలా దూరంగా ఉంచాలి అన్న పద్ధతిని జగన్  అనుసరించారు అనే అంటున్నారు. దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మంది యువతకు టికెట్లు ఇస్తారని కూడా ప్రచారం సాగడంతో సీనియర్లు మానసికంగా సిద్ధమైపోయారు.

జగన్ యువకుడు. ఆయనతో కలసి నడవడం కష్టం. సో వారసులను దించి మనం ఇక రిటైర్మెంట్ తీసుకుందామని చాలా మంది భావిస్తున్నారుట. వీరి జాబితా చూస్తే ఉత్తరాంధ్రా నుంచి అనంతపురం దాకా ఉంది. ధర్మాన ప్రసాదరావు క్రిష్ణదాస్ తమ్మినేని సీతారాం బొత్స సత్యనారాయణ బూడి ముత్యాలనాయుడు అవంతి శ్రీనివాసరావు ఉత్తరాంధ్రా నుంచి రిటైర్ కావాలని చూస్తున్నారు అని అంటున్నారు.

ఇక మిగిలిన జిల్లాలో కూడా మాజీ మంత్రులుతాజా మంత్రులు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఇలాగే ఆలోచన చేస్తున్నారు. అయితే జగన్ మాత్రం వారసులకు టికెట్లు ఇవ్వను అని తేల్చి చెప్పడంతో ఇపుడు సీనియర్లు ఇరకాటంలో పడ్డారని అంటున్నారు. జగన్ మాటలకు అర్ధమేంటి అన్న చర్చ కూడా సీనియర్లలో సాగుతోంది అని తెలుస్తోంది. ఇక్కడ జగన్ వారసులకు టికెట్లు ఇవ్వను అని అన్నారు తప్ప సీనియర్లకు టికెట్లు ఇస్తాను  అనలేదని మరికొందరు భాష్యం చెబుతున్నారు.

అంటే ఏకంగా ఆ రాజకీయ కుటుంబాన్నే పక్కన పెట్టేసి కొత్తవారిని తెచ్చి టికెట్లు ఇస్తారని అంటున్న వారూ ఉన్నారు. అదే కనుక జరిగితే సీనియర్లకు ఏకంగా ఇంట్లో వంట్లో కూడా రాజకీయం లేకుండా పూర్తిగా తెర పడిపోతుంది. అయితే సీనియర్లు తాముగానే తప్పుకుంటూ తమ వారికి టికెట్లు ఇవ్వాలని వేసిన ఎత్తుగడ మాత్రం జగన్ వద్ద పారలేదు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే సీనియర్లు జగన్ తో కలసి అడుగులు వేయలేని స్థితి అని కూడా అంటున్నారు.

కొంతమందిని గెలుపు కారణం చేత టికెట్లు ఇచ్చినా రేపటి రోజున వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినా మంత్రి పదవులు అయితే దక్కవని సీనియర్లకు తెలుసు. ఆ మాత్రం దానికి ఉత్త ఎమ్మెల్యేగా ఉండడం కంటే ఆ రాజకీయమేతో  తమ వారసులకే అప్పగిస్తే పోలా అన్నదే సీనియర్ల ఆలోచన. అయితే జగన్ మాత్రం ఈ విషయంలో వేరే విధంగా ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో సీనియర్లు జగన్ మధ్య గ్యాప్ అయితే అలా కంటిన్యూ అవుతోంది అనే చెప్పాలి. చాలా మంది సీనియర్లు ఉండడం పార్టీకి లాభం. మరి వారిని జగన్ కొనసాగించి పార్టీ కోసం వాడుకుంటారా లేక కొత్త రక్తం అంటూ వేరే దారి పడతారా అన్నదే ఆసక్తికరమైన అంశం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.