వైసీపీ ఎమ్మెల్యేలో ఫ్రస్ట్రేషన్.. .హై కమాండే కారణం...?

Sat Aug 06 2022 07:00:02 GMT+0530 (IST)

News on ycp MLAs

ఎన్నికలు అయితే దగ్గరలోలేవు. జనాలకు సేవ చేయడానికి ఇంకా ఇరవై నెలల సమయం ఉంది. ముందు ఆ పని మానేసి వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో రాదో అన్న టెన్షన్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దానికి కారణం హై కమాండే అంటున్నారు. మూడు నెలల ముందుగానే వారిని పిలిచి సర్వే రిపోర్టులు అంటూ బెదరగొట్టడమే కాకుండా పనిచేయని వారికి టికెట్లు ఇవ్వమని తేల్చిచెప్పడంతో వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు బేజారవుతున్నారు.ఇక విశాఖ జిల్లా విషయానికి వస్తే పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ తరచూ ఆవేశానికి లోనవుతున్నారు. అలాగే అసహనానికి కూడా గురి అవుతున్నారు. దానికి కారణం ఏంటి అంటే ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదన్న బెంగతోనట. అదే సమయంలో పెందుర్తి సీటు ఖాళీ అయిందని చాలా మంది ట్రై చేసేసుకోవడం ఈ సిట్టింగ్ కి అసలు నచ్చడంలేదుట. నేను బాగా ఉన్నాను కదా మళ్ళీ ఈ పోటీ ఏంటి అని ఆయన తెగ గుస్సా అవుతున్నారు.

ఇదిలా ఉంటే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ ఎంట్రీ ఇచ్చిన పంచకర్ల రమేష్ బాబు అప్పట్లో పెందుర్తిలో  అనూహ్యంగా గెలిచారు. ఆయన ఆ తరువాత టీడీపీలో చేరి ఎలమంచిలి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2019 ఎన్నికలో అదే సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ మీదట వైసీపీలో చేరారు. ఆయన గత రెండేళ్ళుగా వైసీపీలో ముభావంగా ఉన్నా కూడా ఇటీవల జగన్ పిలుపుతో ఆయన్ని కలసి గట్టి హామీ దక్కించుకున్నారు. దాంతో ఆయన తన పాత నియోజకవర్గం పెందుర్తిలో కలివిడిగా తిరిగేస్తున్నారు.

పాత పరిచయాలను నెమరేసుకుంటున్నారు. అందరినీ కలసి తాను మళ్ళీ వచ్చేస్తున్నాను అని చెప్పేసుకుంటున్నారుట. అంటే 2024 ఎన్నికల్లో పెందుర్తి నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమని అనుచరులు అంటున్నారు. సరిగ్గా ఇదే ఇపుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ని మండిస్తోంది. ఇంకా నా పదవీకాలం ఉంది. ఎమ్మెల్యేగా నేనే ఉన్నాను. నాకు పోటీగా పంచకర్ల నా ఇలాకాలో తిరగడం ఏంటి అని ఆయన తెగ పరేషాన్ అవుతున్నారుట.

అంతే కాదు ఆయన మీడియా ముందుకు వచ్చి మరీ పంచకర్లకు మా పార్టీకి ఏమీ సంబంధం లేదని కూడా చెప్పేస్తున్నారుట. పంచకర్ల మా పార్టీ నాయకుడే కాదు అని కూడా అంటున్నారు. అయితే దీనికి ఆయన అనుచరలు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. పంచకర్ల వైసీపీలో చేరిన సంగతి బహుశా ఎమ్మెల్యే గారికి తెలియకపోవచ్చు అని అంటున్నారు. ఆయన వైసీపీ నేత కాకపోతే జగన్ ఆయన్ని ఎందుకు కలుస్తారు అని లా పాయింట్లు తీస్తున్నారు.

ఇక నియోజకవర్గంలో ఉన్న పరిచయాలతో పంచకర్ల తిరుగుతూంటే ఎమ్మెల్యే పర్మిషన్ అవసరమా అని కూడా వారు అంటున్నారు. మొత్తానికి అదీప్ రాజ్ వర్సెస్ పంచకర్ల అన్నట్లుగా పెందుర్తిలో సీన్ మారింది. ఈ విషయాలు అన్నీ గమనించిన అధినాయకత్వం అదీప్ రాజ్ కి క్లాస్ తీసుకుంది అని అంటున్నారు. దాంతో ఆయన కాస్తా తగ్గినట్లుగా అనిపించినా నేనే ఎమ్మెల్యేను మళ్లీ నాకే టికెట్ అని గట్టిగా చెప్పుకుంటున్నారు. పంచకర్ల తనకు అన్నయ్య లాంటి వారని వరసలు కలుపుతూనే నేనే కింగ్ అని కూడా చెప్పడం బట్టి చూస్తే ఎమ్మెల్యే గారిలో ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిందని అంటున్నారు.

ఇక మరో వైపు చూస్తే ఎమ్మెల్యే గ్రాఫ్ సరిగ్గా లేదు అని అంటున్నారు. ఆయన మూడేళ్ళ పనితీరు మీద నెగిటివ్ గానే రిపోర్టులు వచ్చాయట. దాంతో అధినాయకత్వం అక్కడ బలామైన కాపు నేతను ఈసారి దించాలని చూస్తోంది. ఆయనే పంచకర్ల రమేష్ బాబు అంటున్నారు. మొత్తానికి పంచకర్ల అదీప్ రాజ్ కి చేదుగా మారిపోయారు అంటున్నారు. ఆరా తీస్తే దాని వెనక అధినాయకత్వం ఉందని కూడా ఎమ్మెల్యే గారి అనుచరులు తెగ ఫీల్ అవుతున్న్నారు. అయినా కానీ ఏం చేయలరు. ఇదంతా అంతే. అలాగే సాగుతుంది మరి.