Begin typing your search above and press return to search.

టీడీపీ జనసేన...మధ్యలో ఏం జరుగుతోంది...?

By:  Tupaki Desk   |   30 May 2023 7:00 PM GMT
టీడీపీ జనసేన...మధ్యలో ఏం జరుగుతోంది...?
X
తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు. దానికి సంబంధించి పలు మార్లు భేటీలు కూడా చంద్రబాబు పవన్ ల మధ్యన జరిగాయి. అయితే మహనాడులో పొత్తుల విషయం తేల్చని బాబు ఏకంగా టీడీపీ మ్యానిఫేస్టో రిలీజ్ చేశారు.

ఇదే సభ నుంచి పదే పదే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు టీడీపీకి ఈసారి 160 కి తగ్గకుండా సీట్లు వస్తాయని ప్రకటించారు. ఉభయ గోదావరి జిల్లాలకు గుండె కాయ లాంటి రాజమండ్రీలో జరిగిన రెండు రోజుల తెలుగు దేశం పార్టీ మహానాడు సూపర్ డూపర్ హిట్ అయింది.

ఏకంగా పదిహేను లక్షల మంది దాకా ప్రజలు హాజరయ్యారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ముగింపు సభలో బాబు ప్రసంగిస్తున్నపుడు ఏ వైపు చూసినా జనమే జనంగా కనిపించారు. దాంతో చంద్రబాబు ఉత్సాహం రెట్టింపు అయింది.

ఇక ఆయన రాబోయేది తమ ప్రభుత్వమే అని ధీమాగా చెప్పారు. సంక్షేమ పధకాలను కూడా ప్రకటించి క్యాడర్ కి కొత్త ఆయుధం ఇస్తున్నామని తెలిపారు. అంతా బాగానే ఉంది కానీ జనసేనతో టీడీపీ పొత్తులు ఎంతదాకా వచ్చాయన్న పాయింట్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంది. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ అయితే ఓపెన్ అయిపోయి చాలా కాలం క్రితమే పొత్తుల మీద మనసులో మాట చెప్పేశారు. ఆ విధంగా ఆయన అడుగులు చాలా ముందుకు వేశారు.

ఇక జనసేన రాజకీయ కార్యకలాపాలు కూడా ఇటీవల కాలంలో పెద్దగా లేవు. పూర్తిగా తెలుగుదేశం మీదనే పొత్తుల మీదనే భారం వేసినట్లుగా సీన్ కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ వైఖరి చూస్తే మెల్లగా మారుతోందా లేక వ్యూహాత్మకంగా అలా చేస్తోందా అన్న చర్చ కూడా సాగుతోంది.

తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఈ మార్చి లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల స్థానాలను వరసగా మూడు చోట్లా గెలిచింది. దాంతోనే ఆత్మ విశ్వాసం గెలుపు మీద పెరిగింది. ఆ తరువాత జోష్ అలా పెంచుకుంటూ చంద్రబాబు లోకేష్ ముందుకు పోతున్నారు. మహనాడు ని రాజమండ్రిలో పెట్టడం వెనక కూడా టీడీపీ ఎత్తుగడలు ఉన్నాయని అంటున్నారు.

గోదావరి జిల్లాలలో జనసేన బలం చాలా ఉందని అంటున్న నేపధ్యంలో తెలుగుదేశం బలగాన్ని సత్తాను చాటేందుకే చంద్రబాబు అలా మహానాడుని ధూం ధాం గా చేశారు అని అంటున్నారు. ఇక మరో వైపు చూస్తే మహానాడు రాజమండ్రిలో తెలుగుదేశం పెట్టిన నేపధ్యంలోనే జనసేన కూడా కొంత హడావుడి పడింది. తమకు బలం ఉన్న సీట్ల విషయంలో సర్వేలు జరిపించుకుని వాటిని పొత్తులలో భాగంగా టీడీపీ నుంచి కోరాలని కూడా గట్టిగా డిసైడ్ అయింది.

అయితే పొత్తుల కధ అంతవరకూ రాకుండానే సింగిల్ గా సోలోగా మళ్ళీ మేమే అన్నట్లుగా చంద్రబాబు అచ్చెన్న మహానాడులో గర్జించేశారు. ఇక మహానాడు రెండవ రోజున మధ్యాహ్నం తరువాత జనసేనాని మరో కీలకమైన పావు కదిపారు. అదేంటి అంటే బీజేపీ విషయంలో కొంత సాఫ్ట్ కార్నర్ ని ప్రదర్శించడం. మోడీ పార్లమెంట్ భవనం ఓపెనింగ్ చేసిన తీరుని ఆయన కొనియాడుతూ మోడీ విజన్ ని ప్రశంసిస్తూ ప్రకటన రిలీజ్ చేసారు.

ఆ విధంగా బీజేపీతో రిలేషన్స్ ని గట్టి పరచుకోవడం ద్వారా ఇండైరెక్ట్ గా టీడీపీకి ఒక మెసేజ్ పంపారని అంటున్నారు. కోరిన సీట్లు పొత్తులలో దక్కకపోతే ప్లాన్ బీ అమలు చేసేందుకు జనసేన రెడీ అవుతుందా అన్న చర్చకు తెర లేస్తోంది. ప్లాన్ బీ అంటే బీజేపీతో కలసి పోటీకి దిగడం. అపుడు ఏపీలో ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది. అలా జరిగితే ఎక్కువ నష్టం టీడీపీకే అని చెప్పడమే జనసేన ఉద్దేశ్యం అని అంటున్నారు.

అయితే తెలుగుదేశం జనసేనతో పొత్తులను వదులుకోదని, అదే సమయంలో ఆ పార్టీ అడిగినన్ని సీట్లు ఇవ్వదని, అలాగే తమకు బలమున్న సీట్లను కూడా వదులుకోదని అంటున్నారు. తాము ఇచ్చే సీట్లను జనసేన ఒప్పుకుంటే పొత్తులు ఉంటాయని చెప్పకనే చెప్పేందుకే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా చూస్తే జనసేన టోన్ డౌన్ చేయడానికే ఇదంతా అన్న చర్చ కూడా ఉంది. మరి జనసేన టీడీపీల మధ్య నిజానికి ఏమి జరుగుతోంది అన్నది తెలియాలి అంటే కొంత కాలం వేచి చూడక తప్పదని అంటున్నారు.