Begin typing your search above and press return to search.

జేడీ సైకిలెక్కేస్తారా... సస్పెన్స్ ఎన్నాళ్ళు...?

By:  Tupaki Desk   |   10 Dec 2022 2:30 PM GMT
జేడీ సైకిలెక్కేస్తారా... సస్పెన్స్ ఎన్నాళ్ళు...?
X
సీబీఐ మాజీ జేడీ అయిన వీవీ లక్ష్మీ నారాయణ తాను విశాఖ నుంచే పోటీ చేస్తాను అని కచ్చితంగా చెప్పేశారు. ఆ మాటను ఆయన ఇటీవల కాలంలో చాలా సార్లు చెప్పారు అంటే 2024 ఎన్నికల్లో పోటీ చేసే స్థానం మీద పోరాడే కార్యక్షేత్రం మీద ఆయనకు క్లారిటీ ఉంది అన్న మాట. మరిపుడు అందరిలో తలెత్తుతున్న ప్రశ్న ఏంటి అంటే ఏ పార్టీ నుంచి అని.

ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చెప్పడంలేదు. అది చూద్దామని దాటవేస్తున్నారు. వీలైతే ఇండిపెండెంట్ గా అని అంటున్నారు. ఈ రోజులలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎంపీగా గెలిచిన వారు ఎవరూ లేరు. పోటా పోటీగా రాజకీయాలు నడుస్తున్న వేళ ఏదో ఒక గూటి నుంచి బరిలోకి దిగితేనే గెలుపు ఆశలు ఉంటాయి.

విశాఖ ఎంపీ సీటు అంటే ప్రతిష్టాత్మకమైనది. అక్కడ టీడీపీకి బలం ఉంది, బీజేపీకి ఎంతో కొంత ఆశ ఉంది. జనసేనకు కూడా బాగానే ఓట్లు వచ్చాయి. వైసీపీ సిట్టింగ్ ఎంపీ ఉన్న చోటు అది. అందువల్ల ఇండిపెండెంట్ అంటే ఈ పార్టీలు అన్నీ దిగితే అపుడు జేడీ నెగ్గడం ఇబ్బందే కదా. మరి అందరికీ తెలిసిన విషయం ఆయనకు మాత్రం తెలియదా అంటే తెలుసు.

కానీ ఆయన కావాలనే సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఏపీలో రాజకీయం ఇంకా పక్వానికి రాలేదని భావిస్తున్నారు అని అంటున్నారు ఏపీలో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది కానీ విపక్షాలు అలా కాదు పొత్తులతో వస్తాయి. అయితే ఏ ఏ పార్టీలు కలుస్తాయి అన్నది మాత్రం తేలడంలేదు.

ఇప్పటికి అయితే బీజేపీ జనసేన కూటమిగా ఉన్నా ఈ రెండు పార్టీల మధ్య కూడా పెద్దగా సఖ్యత లేదు అని అంటున్నారు. ఏపీలో 2014 నాటి పొత్తులను రిపీట్ చేయాలని బాబు చూస్తున్నారు. పవన్ కూడా వైసీపీ ఓట్లు చీలకుండా అంతా కలవాలని కోరుకుంటున్నారు. బీజేపీ నుంచే ఇంకా క్లారిటీ రావాలి.అందుకే జేడీ గారి డెసిషన్ కూడా లేట్ అవుతోంది అంటున్నారు. ఆయన 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేశారు. 2 లక్షల 80 వేల పై దాకా ఓట్లు తెచ్చుకున్నారు.

ఆ తరువాత ఆ పార్టీని వీడారు. ఇక ఆయన నాటి నుంచి ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు. వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి జేడీ పోటీ అని అంటున్నారు. అదే విధంగా బీజేపీ నుంచి ఆయనకు ఆహ్వానం ఉంది అని అంటున్నారు. పొత్తులు ఉంటాయి కాబట్టి ఆయన తొందరపడడంలేదు అంటున్నారు. వీటితో పాటు ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ వస్తోంది. ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తారు అని.

తెలుగుదేశం పార్టీకి ఆయన వంటి వారు చేరడం అవసరం. పైగా విద్యావంతులు తటస్థులు కూడా టీడీపీ వైపు ఎక్కువగా టర్న్ అవుతారు అని అంటున్నారు. దాంతో జేడీకి విశాఖ ఎంపీ సీటు ఇస్తామని ప్రతిపాదనలు వెళ్ళాయని అంటున్నారు. ఆయన కూడా సుముఖంగా ఉన్నారనే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు కనుక జనసేన టీడీపీల మధ్య కుదిరితే టీడీపీ నుంచి జేడీ పోటీలో ఉంటారు అని చెబుతున్నారు. తన సొంత ఆకర్షణతో పాటుగా టీడీపీ ఓటు బ్యాంక్ తోడు అయితే కచ్చితంగా గెలుస్తాను అని ఆయన భావిస్తున్నారు. పొత్తులలో జనసేన వంటివి కలిస్తే బంపర్ విక్టరీ ఖాయం.

ఇక తెలుగుదేశం కూడా జేడీని చేర్చుకుంటే జగన్ని ఇంకా ధాటీగా విమర్సించవచ్చు అని అంటున్నారు. గతంలో జగన్ కేసులను జేడీ విచారించారు. దాంతో ఆయన్ని ముందు పెట్టి జగన్ అవినీతిని మరో మారు కడిగేయాలని టీడీపీ మాస్టర్ ప్లాన్. అయితే ఈ రోజుకీ జేడీ ఎక్కడా బయటపడడంలేదు, ఇండిపెండెంట్ గానే పోటీ అంటున్నా చివరికి ఆయన సైకిలెక్కేస్తారు అనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.