అబ్బనీ.. అదిరిపోయే దెబ్బ.. గుజరాత్‌లో పార్టీలకు షాక్!

Mon Dec 05 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

News on gujarat elections

అబ్బనీ తియ్యనీ దెబ్బ! అనే పాట వినేవుంటారు కదా! కానీ గుజరాతీలు మాత్రం అబ్బనీ.. అదిరిపోయే దెబ్బ అన్నట్టుగా పార్టీలకు ఝలక్ ఇచ్చారు. అధికార బీజేపీ సహా .. ఏ పార్టీనీ వారు విశ్వసిస్తున్నట్టు కనిపించడం లేదు. తాజాగా ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై అధికార పాలక పక్షం బీజేపీ సహా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మరో పార్టీ ఆమ్ ఆద్మీలు కూడా ఎంతో ఆశ పెట్టుకున్నాయి. తమకంటే తమకే అధికారమని ప్రచారం చేసుకున్నాయి.హోరా హోరీ ప్రచారం చేసుకున్నాయి. రోడ్ షోలతో నాయకులు ఇరగదీశారు. సభలు పెట్టి దంచి కొట్టారు. మేనిఫెస్టోల్లో ఉచిత హామీల వర్షాన్ని కురిపించారు. కానీ ఏం లాభం.. గుజరాత్ ప్రజలు ఓటింగుకు చాలా వరకు దూరంగా ఉండిపోయారు. గత 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సారి ఈ శాతం బారీగా తగ్గిపోయింది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడతలో కచ్-సౌరాష్ట్ర దక్షిణ గు జరాత్ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు ఎన్నికలు జరుగగా.. 63 శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 2017లో జరిగిన మొదటి విడతలో 66.75 శాతం పోలింగ్ నమోదైంది.

ఇక తాజాగా జరిగిన చివరి విడతలో 60 శాతం పోలింగ్ దాటలేదు. గతంలో ఇది 77 శాతంగా ఉంది. మొత్తంగా పఓటర్లు చాలా వరకు ఇళ్లకే పరిమితం అయిపోయారు. 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులూ ఒడ్డింది. ప్రధాని మోదీ అంతా తానై ప్రచారం చేశారు. 2017లో 77 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి తమకే ఛాన్స్ అని ప్రచారం చేసింది.

మరోవైపు పంజాబ్ తరహాలో విజయం అందుకుంటామని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పింది. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో మ్యాజిక్ నెంబర్ 92. ఈసారి ఓటింగ్ శాతం తగ్గడంతో అన్ని పార్టీల అభ్యర్ధుల్లో గుబులు పెరిగింది. మరి జనం తీర్పు ఎలా ఉంటుందో తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.