డామిట్.. కథ అడ్డం తిరిగిందేమిటి? వైసీపీలో అంతర్మథనం!

Sat Mar 18 2023 11:00:01 GMT+0530 (India Standard Time)

News on ap ycp

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిమ్మతిరిగే షాక్ తగలడంతో అధికార వైసీపీలో నిస్తేజం నిర్వేదం నెలకొంది. ముఖ్యంగా వైసీపీ అత్యంత బలంగా ఉన్న తూర్పు రాయలసీమలో వైసీపీ అభ్యర్థి ఓడిపోవడం ఆ పార్టీని నిశ్చేష్టపరిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమ పెద్దాయనగా పిలుచుకునే సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇతర మంత్రులు ఉషశ్రీ చరణ్ తదితర మంత్రులు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ల చైర్మన్లు ఎమ్మెల్సీలు స్థానిక నేతలు అంతా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం పట్ల వైసీపీలో అంతర్మథనం నెలకొందని అంటున్నారు.వాస్తవానికి 2014 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమలో ఉన్న 52 సీట్లలో వైసీపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అయితే రాయలసీమలో ఉన్న 52 అసెంబ్లీ స్థానాల్లో 49 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. టీడీపీ మూడు స్థానాలకే పరిమితమైంది. అలాంటిది నాలుగేళ్లు తిరిగేటప్పటికీ సీన్ రివర్స్ అయింది.

తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానంలో వైసీపీ ఏకంగా 11 శాతం ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ చేతిలో చిత్తయింది. ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల పరిధిలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానం ఉంది. ఈ మూడు జిల్లాలు వైసీపీ కంచుకోటలు. అయితే పట్ట«భద్రుల ఎన్నికలకు వచ్చేటప్పటికీ ఈ మూడు జిల్లాల్లో వ్యతిరేక ఫలితాలు వెలువడ్డాయి.

వాస్తవానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు నుంచే సీఎం జగన్ పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని సూచించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ట్రబుల్ షూటర్ గా పేరున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇతర మంత్రులు ఎమ్మెల్యేలందరినీ అప్రమత్తం చేశారు.

ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాలకు తగ్గట్టే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పట్టభద్రుల ఎమ్మెల్యే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దొంగ ఓట్లను పెద్ద ఎత్తున చేర్చారని ప్రతిపక్షాలు వివిధ సంఘాలు ఆరోపించాయి. ఏడు ఎనిమిది తరగతి మాత్రమే చదివినవారిని కూడా పట్టభద్రులుగా ఓటర్ల జాబితాలో వైసీపీ నేతలు నమోదు చేయించారనే విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా తిరుపతిలో వందల సంఖ్యలో దొంగ ఓట్లు బయటపడ్డాయి.

మరోవైపు వలంటీర్ల ద్వారా అధికార వైసీపీ డబ్బులు పంచిందనే విమర్శలు వచ్చాయి. ఒక్కో ఓటుకు రూ.5 వేలు నుంచి రూ.6 వేల వరకు వైసీపీ డబ్బులు పంచిందని మీడియాలోనూ వార్తలు హల్చల్ చేశాయి. ఇంకోవైపు వైసీపీకి ఓట్లేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని వలంటీర్లు సచివాలయ ఉద్యోగులు బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని చేసినా తాము ఓడిపోవడం పట్ల వైసీపీ తీవ్ర అంతర్మథనంలో ఉందని టాక్ నడుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.