ఈ ఓటమి ఏ ప్రస్థానానికి జగన్....?

Sun Mar 19 2023 06:00:01 GMT+0530 (India Standard Time)

News on ap ycp MLC elections

వైసీపీకి నాలుగేళ్ళ తరువాత భారీ షాక్ తగిలింది. అప్రతిహతమైన విజయాలతో దూసుకుపోతున్న వైసీపీకి ఇది భారీ కుదుపుగానే చూడాలి. వైసీపీని గెలుపు మత్తులో నుంచి నేల మీదకు దించేలా తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉన్నాయని అంటున్నారు. మనం ఏమి చేసినా చెల్లుతుంది ఎవరిని పెట్టినా నెగ్గుతారు అని అతి ధీమా ప్రదర్శించినందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.నిజానికి ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక మీద పార్టీ అధినేతలు  మల్ల గుల్లాలు పడతారు. ఎన్నో సిట్టింగ్స్ వేస్తారు. కానీ వైసీపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉంటుంది. జగన్ అభ్యర్ధులను తానుగా డిసైడ్ చేసి గెలిపించమని ఆదేశిస్తారు. ఇది ఇప్పటిదాకా జరిగిన ప్రాక్టీస్. విజయాలు దక్కాయి. కానీ ఫస్ట్ టైం మాత్రం రివర్స్ అయింది. అధికారంలో పార్టీ ఉండగా అన్ని బలాలు చేతులలో ఉండగా  ఘోరమైన ఓటమి దక్కింది అని అంటున్నరు.

ఉత్తరాంధ్ర మీద జగన్ కి మక్కువ. రాయలసీమ తన కంచుకోట అని నమ్మకం. ఇపుడు ఈ రెండూ దెబ్బకు ఎగిరిపోయాయి. మక్కువను పెంచుకున్న చోట టీడీపీ అద్భుతమైన విజయం సాధించి ఝలక్ ఇచ్చేసింది. మా సీమ జిల్లాలే కదా అని ఏమరుపాటుగా ఉంటే అక్కడ కూడా షాక్ తగిలేసింది.

ఏపీలో మొత్తం తొమ్మిది జిల్లాలు 108 అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనాలు స్పష్టమైన తీర్పునే ఇచ్చారు అని భావించాలి. ఇది ఏ సర్వే కాదు అధికారింగా జనం నుంచి వచ్చిన మనోగతం. నిజంగా ఈ తొమ్మిది జిల్లా లలో 2019 ఎన్నికల్లో టీడీపీ గట్టిగా పన్నెండు అసెంబ్లీ సీట్లు కూడా రాలేదు. అలాంటిది ఇపుడు టీడీపీ గెలుపు పిలుపు గట్టిగా వినిపించింది.

అన్నం మొత్తం ఉడికినట్లుగా చూడాలంటే చిన్న మెత్తుకుని పరీక్ష చేస్తే సరిపోతుంది. అలా ప్రతీ ఊరూ ప్రతీ లోగిలి ప్రతీ ప్రాంతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు వేసింది. పాలు పంచుకుంది. ఆ విధంగా చూస్తే ఒక కీలక అభిప్రాయంగానే తీసుకోవాలి. మరో వైపు చూస్తే గ్రాడ్యుయేట్స్ ఓట్లు పరిమితమైన వర్గం అని ప్రచారం చేస్తున్నారు. కానీ పరిమితం అయితే కాదు. ఎలా అంటే గ్రాడ్యుయేట్స్ కూడా ఒక ఇంటి వారే. ఆ ఇంట్లో కూడా జగన్ పధకాలు కనీసం ఒకటి రెండు అయినా అందిన సందర్భాలు ఉంటాయి.

మరి తమ కుటుంబంలో పధకాలు ఒకటి రెండు అందినా కూడా వారంతా వచ్చి యాంటీగా ఓటేశారు అంటే ప్రభుత్వం తీరు అసలు నచ్చడంలేదు అని చెప్పేయడమే అంటున్నారు. ఈ ఓటింగులో విద్యావంతులు మధ్యతరగతి వర్గాలు ఉద్యోగులు సహా వివిధ వర్గాలు పాలుపంచుకున్నాయి. వారంతా నాలుగేళ్ల వైసీపీ పాలన మీద క్లియర్ కట్ గా ఇచ్చిన తీర్పు గా చూడాలి.

ప్రభుత్వం చేతిలో ఇంకా ఏడాది కాలం సమయం ఉంది. రిపేరు చేసుకునే అవకాశం ఉంది. జాబ్ క్యాలెండర్ లేదు అని యువత గోల పెడుతోంది వారికి ఉద్యోగాలను భర్తీ చేసే పని మొదలెట్టాలి. అలాగే మధ్యతరగతి వర్గాలు ఉప్పూ పప్పూ ధరలు నూనెల ధరలు పెరీగి నానా ఇబ్బందులు పడుతున్నారు. ధరల స్థిరీకరణ కోసం పధకం అంటూ మూడు వేలను వర్తమనా బడ్జెట్ లోనూ ప్రభుత్వం కేటాయించింది. కానీ ఆచరణలో మాత్రం చేసింది ఏమీ లేదు.

దాంతో ఆకాశాన్ని అంటేలా ధరలు ఉన్నాయి. ఇది వారిని బాధిస్తోంది. ఇక పధకాల విషయంలో మధ్యతరగతి వర్గాలను కూడా తీసుకుని వారికి కూడా వీలైనంత అవకాశాలు కల్పించాలి. ఆ విషయంలో రూల్స్ ని పక్కన పెట్టాలి. ఇంకో వైపు చూస్తే ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. అది జనాలకు నమ్మకం కలిగించేలా ఉండాలి. మరో వైపు చూస్తే సచివాలయాలతోనే అంతా అన్నీ అన్న భ్రమలు వీడి ప్రజలకు నిజంగా ఎంతమేరకు సేవలు అందుతున్నాయో బేరీజు వేయాలి.

అన్నింటికీ మించి జనం గురించి తెలుసుకోవాలి. వారి మాటకు విలువ ఇవ్వాలి. తమ మదిలో పుట్టిన ఆలోచనలే జనాలు కోరుకుంటున్నవి అని భావించరాదు. ప్రజాగ్రహం తెలుసుకుని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయకపోతే మాత్రం 2024లో వైసీపీకి భారీ ఓటమి పొంచి ఉందనే అంటున్నారు. ఓటమి ఎపుడూ విజయానికి దారి అని చెబుతారు. అందుకే ఈ ఓటమి ఏ ప్రస్థానానికి దారి తీస్తుందో ఎలా తీయించాలో జగన్ స్వయంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉందని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.