Begin typing your search above and press return to search.

మీ బలమూ మా బలమూ... పవన్ వెరీ సీరియస్ !

By:  Tupaki Desk   |   28 May 2023 5:00 AM GMT
మీ బలమూ మా బలమూ... పవన్ వెరీ సీరియస్ !
X
జనసేన అధినేత ఇపుడు అసలైన పాలిటిక్స్ చేస్తున్నారు. చాలా సీరియస్ గానే ఉన్నారు తన పార్టీకి బలం ఎంత ఉందో అన్న దాని మీద ఆయన నమ్మకమైన సంస్థ ద్వారా సర్వే చేయిస్తున్నారు. ఈ సర్వే ఎవరినో మెప్పించేందుకు కాకుండా నిఖార్సుగా నిజాయితీగా ఉండాలని ఆయన కండితంగా చెప్పేశారు. ఈ సర్వే వివరాలను ముందుంచుకుని ఆయన తమకు న్యాయంగా రావాల్సిన సీట్ల విషయంలో ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు.

పొత్తులలో భాగంగా ఆరు నూరు అయినా ఈ సీట్లు అడిగి తీసుకోవాల్సిందే అని పవన్ పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. పవన్ మంగళగిరిలో గురువారం నుంచి ఉన్నారని చాలా మందికి తెలియదు. అలా పవన్ పర్యటన సాగుతోంది. నిజానికి పవన్ కళ్యాణ్ ఎపుడు వచ్చినా మీడియా హడావుడి, పార్టీ మీటింగ్స్, మీడియా సమావేశాలు ఉంటాయి. ఈసారి మాత్రం పవన్ చాలా నిదానంగా ఉన్నారు.

తాను వచ్చిన పనిలో ఆయన పూర్తిగా నిమగ్నం అయ్యారని అంటున్నారు. ఏపీలో కీలక జిల్లాలలో జనసేన బలాబలాలను ఆయన అంచనా కడుతున్నారు. తమకు బలం లేని చోట పొత్తుల పేరుతో సీట్లు ఇచ్చినా వద్దు అన్నది పవన్ మార్క్ రాజకీయంగా కనిపిస్తోంది అని అంటున్నారు. అదే టైంలో బలం ఉన్న చోట సీటు పొత్తులలో ఇవ్వకున్నా ఊరుకోరాదని కూడా భావిస్తున్నారుట.

ఇక తమకు పొత్తులలో ఇచ్చిన అన్ని సీట్లను దాదాపుగా అంటే నూరు శాతం గెలిపించుకుని పెద్ద సంఖ్యతోనే ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ చూస్తున్నారు అని అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో జనసేన రానున్న కాలంలో కీలకం కావాలంటే ఈసారి మంచి నంబర్ తో జనసేన గెలవాలని, జనసేన పది కాలాల పాటు రాజకీయంగా గెలవాలన్నా నిలదొక్కుకోవాలన్నా కూడా ఈ సీట్లు పొత్తులే ప్రధానం అని పవన్ నమ్మకంగా ఉన్నారని తెలుస్తోంది.

ఇక పవన్ బలం అని చెబుతున్న సీట్ల విషయంలోనే చాలా తమషాలు ఉన్నాయని అంటున్నారు. అక్కడ టీడీపీ కూడా బలంగా ఉంది అని అంటున్నారు. ఉదాహరణకు రాజమండ్రీ సిటీ, రూరల్, ఈ రెండు సీట్లలో టీడీపీ జనసేన రెండూ బలమైన పార్టీలుగానే ఉన్నాయి. అలాగే పిఠాపురం, కాకినాడ రూరల్ వంటి చోట్ల కూడా రెండు పార్టీలు చాలా పవర్ ఫుల్ గానే ఉన్నాయి. మరో వైపు మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప సీటు అయిన పెద్దాపురం మీద జనసేన కన్ను ఉంది. అక్కడ కూడా రెండు పార్టీలు బలంగానే కనిపిస్తున్నాయి.

పశ్చిమ గోదావరి చూస్తే నర్సాపురం, భీమవరం, రాజోలు వంటి చోట్ల టీడీపీ జనసేన రెండూ కూడా గత ఎన్నికల్లో మంచి ఓటింగ్ షేర్ సాధించాయి. పాలకొల్లు విషయం అలాగే ఉంది. ఇక్కడ టీడీపీ పుట్టాక కాంగ్రెస్ రెండు సార్లే గెలిచింది అంటే ఎంతటి కంచుకోటో ఆలోచించాలి. అయితే 2019లో ఈ సీట్లో జనసేనకు 32 వేలకు పైగా ఓట్లు వచ్చాయి.

అదే విధంగా పెద్దాపురం నియోజకవర్గంలో పాతిక వేల దాకా ఓట్లు జనసేన దక్కించుకుంది. ఇక కాకినాడ రూరల్ లో నలభై వేల పై చిలుకు సాధించింది. కాకినాడ సిటీలో అయితే 30 వేల పై దాటి ఓట్లు వచ్చాయి. పిఠాపురంలో కూడా 28 వేల పై దాటి ఓట్లు వచ్చాయి. రాజోలులో అయితే జనసేన గెలిచింది. నర్సాపురంలో 49 వేల పై చిలుకు ఓట్లు సాధించింది జనసేన.

ఇక భీమవరం, గాజువాకలలో పవన్ పోటీ చేసి సెకండ్ ప్లేస్ లోకి వచ్చి వైసీపీని గట్టిగా ఢీ కొట్టారు. విశాఖ ఉత్తరం తీసుకుంటే 19 వేల ఓట్లు వచ్చాయి. భీమిలీలో పాతిక వేల ఓట్లు, వస్తే ఎలమంచిలిలో 18 వేల ఓట్లు పై దాటాయి. ఇలా జనసేన చాలా చోట్ల మంచి సంఖ్యలోనే ఓట్లు సాధించింది.

ఇక జనసేనాని ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఈ సీట్లలో ఇపుడు నాలుగేళ్ల కాలంలో జనసేన గ్రాఫ్ బాగా పెరిగింది అని. అందువల్ల సీట్లు అన్నీ తమకే కేటాయించాలని కోరుతున్నారు. కానీ ఇవే సీట్లు టీడీపీకి కంచుకోటలు. ఎన్నో సార్లు గెలిచిన సీట్లు వాటిని వదులుకోవడం అంటే టీడీపీ ఇష్టపడుతుందా లేదా అన్నది చూడాలి. అలా ఒప్పుకుంటే గట్టి నాయకులు అంతా పోటీకి దూరం అవుతారు.

అయితే జనసేనాని తెలివిగానే ఇపుడు సర్వేని చేయిస్తూ రిపోర్టుని దగ్గరపెట్టుకుని మరీ సీట్ల విషయంలో పట్టుపట్టనున్నారు అని అంటున్నారు. బలం పెరిగింది. మేమే గెలుస్తాం కాబట్టి ఆ సీట్లు ఇచ్చి తీరాల్సిందే అన్నది జనసేన ఆలోచనగా కనిపిస్తోంది. అయితే టీడీపీ సాధారణంగా పొత్తుల విషయంలో ఏమి చేస్తుంది అంటే తమకు బలం తక్కువగా ఉన్న సీట్లనే మిత్రులకు ఇస్తుంది.

అలా కనుక చూస్తే 2014లో బీజేపీకి విశాఖ ఏజెన్సీలో పాడేరు సీటు ఇచ్చింది. అక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్టులకే బలం ఉంటుంది. అలాగే వైసీపీ గట్టిగా ఉంటుంది. ఆ సీట్లను చాలా ఇచ్చి 12 ఇచ్చామని చెప్పింది. దాంట్లో బలమున్న నాలుగు మాత్రం బీజేపీ నిలబెట్టుకుంది. ఇపుడు జనసేన విషయంలో అదే ఫార్ములాతో టీడీపీ వ్యవహరించినట్లు అయితే పొత్తులు కుదురుతాయా అన్నదే చర్చగా ఉంది.

ఇదిలా ఉంటే జనసేన బలం పెరిగింది అని లేటెస్ట్ సర్వేలు చేయించినా టీడీపీ 2019 నాటి ఓట్ల లెక్కలనే ప్రమాణంగా తీసుకుంటుంది అని అంటున్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ పొత్తుల విషయం సీట్ల పంపకం పెద్ద సమస్య కాదని అన్నారు. జనసేనకు నలభై వేల కటే ఎక్కువ ఒట్లు వచ్చిన సీట్లు ఆ పార్టీకే ఇస్తామని చెబుతున్నారు. ఇంకా పట్టుబడితే ముప్పయి వేల ఓట్లు వచ్చిన సీట్లు కూడా ఇవ్వవచ్చు.

అలా కనుక చూస్తే ఆ నంబర్ తక్కువగానే ఉంటుంది. మరి జనసేన చెబుతున్న బలం పెరిగింది అన్న మాటలను టీడీపీ ఎంతదాకా పట్టించుకుంటుంది అన్నదే చూడాలి సర్వేలు నివేదికలు అయితే ఎవరికి వారివిగా ఉంటాయి కాబట్టి అది కొలమానం కావచ్చు మానవచ్చు. ఏదిఏమైనా పవన్ ముందే మేలుకొన్నారని అంటున్నారు. బలం ఉన్న సీట్లే టార్గెట్ చేస్తున్నారు.