Begin typing your search above and press return to search.

సీఎం గా జగన్ అతి పెద్ద విజయం అదే...!

By:  Tupaki Desk   |   31 May 2023 9:00 AM GMT
సీఎం గా జగన్ అతి పెద్ద విజయం అదే...!
X
జగన్ కి రాజకీయ అనుభవం ఏముంది అని ప్రత్యర్ధులు చాలా విమర్శలు చేశారు. ఆయన రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకోకుండానే అతి పెద్ద యుద్ధం స్టార్ట్ చేశారు. కొండంత అండగా ఉన్న తండ్రి జగన్ ఎంపీ అయిన మూడు నెలలకే కన్ను మూశారు. దాంతో జగన్ కాంగ్రెస్ నుంచి వేరుపడ్డారు. ఆయన కాంగ్రెస్ లో ఉంటే ఏమి జరిగేదో కానీ ఆయన బయటకు వచ్చినందుకు చాలా మంది తప్పుడు నిర్ణయం అని అన్నారు కూడా.

అయితే జగన్ పట్టుదలగా పనిచేసి వైసీపీ పెట్టిన ఏడేళ్ల వ్యవధిలోనే 151 సీట్లు సాధించి సీఎం అయ్యారు. ఉమ్మడి ఏపీ చరిత్రలోనే అత్యధిక ఓట్ షేర్ తో పాటు సీట్లు సాధించారు. దేశంలోని కొన్ని అధ్బుత విజయాలలో జగన్ ది కూడా ఒకటి. అది చరిత్రలో నిలిచిపోతుంది.

ఇక జగన్ కనీసం మంత్రిగా కూడా చేయలేదు కదా సీఎం పదవిని ఎలా చేస్తారు. విభజన ఏపీని ఎలా పాలిస్తారు అన్న చర్చ అయితే మొదట్లో ఉండేది. జగన్ సీఎం అయ్యాక గత వందేళ్లలో ఈ భూగోళం చూడని అతి పెద్ద ప్రకృతి విపత్తు కరోనా రూపంలో వచ్చింది. అది రెండేళ్ళకు పైగా సాగింది. అసలే అప్పులతో ఉన్న ఏపీ మీద కరోనా ప్రభావం దారుణంగా పడింది.

అలాంటి విషమ పరిస్థితిని కూడా తట్టుకుని జగన్ నిలబడ్డారు. జగన్ మానసపుత్రికలుగా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఉండడం ఆయన పాలనా సంస్కరణలకు మచ్చు తునకలుగానే చూస్తున్నారు. ఒక పాలకుడిగా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తొణక్కుండా జగన్ డెసిషన్స్ తీసుకోవడం మరో విశేషం. జగన్ నాలుగేళ్ల పాలలో వివాదాలు ఎన్నో ఉన్నాయి. కోర్టు కేసులు చాలానే ఉన్నాయి.

రాజకీయంగా చూస్తే బలమైన తెలుగుదేశం పార్టీ, అంతకంటే కూడా అపర చాణక్యుడు చంద్రబాబుతో ఢీ కొట్టి రాజకీయం చేయడం మామూలు విషయం కాదు. అయినా సరే జగన్ దాన్ని సమర్ధంగానే ఎదుర్కొన్నారు. తొలి మూడేళ్ల కాలం దాకా టీడీపీకి ఎలాంటి ఆశ లేకుండా చేయడంతో జగన్ సక్సెస్ అయ్యారు. గత ఏడాదిగా మాత్రం టీడీపీ పుంజుకుంది.

అయినా సరే ఈ రోజుకీ టీడీపీ గెలుస్తుంది అని కచ్చితంగా తటస్థులు సైతం చెప్పలేని పరిస్తితి. ఇక జగన్ సాధించిన విజయాలు చూసుకుంటే కాదు అన్న వారి నోటి వెంటనే అవును అనిపించడం. జగన్ సంక్షేమ పధకాలను పప్పు బెల్లాలతో పోలుస్తూ టీడీపీ చేసిన యాగీ అంతా ఇంతా కాదు. అలాంటి టీడీపీ ఇపుడు అవే పధకాలు శరణ్యం అనడం జగన్ నైతిక విజయం అంటున్నారు.

అలాగే జగన్ తెచ్చిన సచివాలయ వ్యవస్థను తామూ కొనసగిస్తామని చెప్పడం, వాలంటీర్లను తీసేయమని చెప్పడం ఇవన్నీ జగన్ పాలనకు విపక్షం నుంచి వచ్చిన ఆమోదంగానే చూస్తున్నారు. అయితే జగన్ అయినా చంద్రబాబు అయినా ఏపీకి మాత్రం పెద్దగా ఏమీ చేయలేదు అన్నది కామన్ విమర్శ. రాజధాని అమరావతి అంటూ హై లెవెల్ అంచనాలతో చంద్రబాబు టైం పాస్ చేస్తే మూడు రాజధానులు అంటూ జగన్ కూడా అదే పని చేశారు

పోలవరం విషయంలో ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. ప్రత్యేక హోదా విషయంలో అదే తీరు. కేంద్రంతో పోరాడే విషయంలో చంద్రబాబు జగన్ దొందుకు దొందే అన్న మాట ఉంది. జగన్ కేంద్రంతో సానుకూలంగా ఉంటూ ఏమి సాధించారు అంటే జవాబు లేదు వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 అని అంటున్న జగన్ కి 2024 ఎన్నికలు అగ్ని పరీక్ష అని చెప్పాలి.

జగన్ సీఎం గా రెండేళ్ళ లోపే ఇబ్బందులు పడతారని ప్రభుత్వం పడిపోతుందని, అనుభవం లేని జగన్ ఏలుబడిలో సంక్షోభం వస్తుంది అని అంచనా కట్టిన తెలుగుదేశానికి మాత్రం ఆశాభంగం కలిగించేలా సక్సెస్ ఫుల్ గా నాలుగేళ్ళ పాలనను పూర్తి చేయడం జగన్ అతి పెద్ద విజయంగా చూడాలి. ముందు ముందు జగన్ ఏమి చేస్తారు అన్నది పక్కన పెడితే అప్పులు చేసినా సంక్షేమం లో తన మార్క్ ని వేసుకున్నారు. అభివృద్ధిని నాలుగవ ఏట మొదలెట్టారు. దాని ఫలితాలు వచ్చేలోగానే 2024 ఎన్నికలు పూర్తి అవుతాయి కాబట్టి జగన్ కి జనాలు ఎన్ని మార్కులు వేస్తారు అన్నది 2024 ఎన్నికల్లో తేలనుంది.