ఏపీలో బోల్తా కొట్టిన బీజేపీ

Sat Mar 18 2023 16:00:01 GMT+0530 (India Standard Time)

News on ap bjp

కేంద్రంలో అధికారాన్ని చూసుకుని రాష్ట్రంలో బీజేపీ ఎగిరెగిరి పడుతోంది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని పదే పదే చెప్పుకుంటోంది. ఇపుడు తెలుగుదేశంపార్టీకి ప్రత్యామ్నయ ప్రతిపక్షం బీజేపీనే అని ఒకటే గోలచేస్తోంది. బీజేపీ నేతల దూకుడు ఓవర్ యాక్షన్ కు ఎంఎఎల్సీ ఎన్నికల తాజా ఫలితాలే సమాధానం చెబుతోంది. ఉత్తరాంధ్ర తూర్పు రాయలసీమ పశ్చిమరాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. వీటిల్లో దేనిలో కూడా బీజేపీకి డిపాజిట్లు కూడా రాలేదు.
 
నిజానికి కేంద్రంలో అధికారంలో ఉందికాబట్టే రాష్ట్రంలో బీజేపీకి ఈమాత్రమైనా ప్రచారం వస్తోంది. లేకపోతే అసలు జనాలు బీజేపీని పట్టించుకునుండే వారే కాదు. ఆ విషయాన్ని కమలనాదులు గ్రహించకుండా ఊరికే ఎగిరెగిరి పడుతున్నారు. తాజాగా వెల్లడైన ఫలితాల్లో బీజేపీ అభ్యర్ధులకు వచ్చిన ఓట్లకన్నా చెల్లని ఓట్లే ఎక్కువగా ఉన్నాయంటే అర్ధమేంటి ? ఓటర్లు బీజేపీని ఏమాత్రం పట్టించుకోవటం లేదనే కదా. రాష్ట్ర ప్రయోజనాలను నరేంద్రమోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేస్తున్న రాష్ట్రంలో నేతలు ఏమాత్రం మాట్లాడటంలేదు.
 
ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా పట్టించుకోలేదు. విశాఖ ప్రత్యేక రైల్వేజోన్ కు మంగళంపాడినా మాట్లాడలేదు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోయినా నోరిప్పటంలేదు. పైగా కేంద్రానికి మద్దతుగానే మాట్లాడుతున్నారు. చివరకు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేస్తున్నా కమలనాదులకు చీమకుట్టినట్లు కూడా లేదు. పై సమస్యలను ఎవరైనా ప్రస్తావించిన వాళ్ళపై విరుచుకుపడిపోతున్నారు. ఇవన్నీ చూస్తున్న జనాలకు బీజేపీ అంటే మంట పెరిగిపోతోంది.ఏపీ ప్రయోజనాలను ఇంతగా తుంగలో తొక్కేస్తున్న బీజేపీకి ఓట్లేయమంటే జనాలు ఎలాగవేస్తారు ? ఈ విషయమే బీజేపీ నేతలకు అర్ధంకావటంలేదు. ఒక విధంగా గ్రౌండ్ లెవల్లో సమస్యలు రాష్ట్రంలోని నేతలకు తెలుసు. అయినా కేంద్రంపై ఏమీ మాట్లాడలేని పరిస్ధితి. అందుకనే జనాలు కనీసం డిపాజిట్లు కూడా రాకుండా చేస్తున్నారు. అంటే కేంద్రంతో మాట్లాడలేక ఇటు జనాలను కన్వీన్స్ చేయలేక మధ్యలో బీజేపీ నేతలు నలిగిపోతున్నారు. కాబట్టి కేంద్రంలో పాలకులు మారనంతవరకు రాష్ట్రంలో జనాలు మారరు. కాబట్టి ఎన్నిక ఏదైనా సరే పోటీచేయటం డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోవటమే బీజేపీ చేయగలిగింది.  నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.