ఆ సీట్లలో సైకిల్ జోరు ఆపడం కష్టమేనా...?

Sat Oct 01 2022 18:09:38 GMT+0530 (India Standard Time)

News on ap TDP

జగన్ ప్రభంజనం బలంగా వీచిన 2019 ఎన్నికల్లోనే విశాఖ సిటీని టీడీపీ కొల్లగొట్టింది. నాలుగుకు నాలుగు సీట్లూ గెలుచుకుంది. ఇక ఈ మూడున్నరేళ్ల కాలంలో వైసీపీ పెద్దగా బలపడలేదు పైగా అధికార పార్టీలో వర్గ పోరు ఒక లెవెల్ లో ఉంది. ఇక అధికార పార్టీ మీద వ్యతిరేకత కూడా పెద్ద ఎత్తున ఉంది. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఈ సీట్లు నాలుగూ మళ్ళీ టీడీపీ ఖాతాలోనే పడతాయని అంతా అంటున్నారు.విశాఖ తూర్పు పశ్చిమ సీట్లలో మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెలగపూడి రామక్రిష్ణ గణబాబు గెలిచి తీరుతారు అని తమ్ముళ్ళు అంటున్నారు. ఇక్కడ వైసీపీ పొజిషన్ ఎలా ఉందో చూస్తే గెలుపు కోసం ఆశలేవీ పెట్టుకోనక్కరలేదు అనే అంటున్నారు. ముందుగా తూర్పుని తీసుకుంటే బలమైన నాయకులే వైసీపీకి ఉన్నారు. కానీ వారి మధ్య సయోధ్య మాత్రం లేదు.

వంశీక్రిష్ణ శ్రీనివాస్ 2014లో వెలగపూడి మీద పోటీ చేసి ఓడారు. ఆయనకు 2019లో టికెట్ ఇవ్వలేదు. భీమిలీ నుంచి వచ్చిన అక్రమాని విజయనిర్మలకు సీటు ఇచ్చారు. దాంతో పార్టీలోని వారే సరిగ్గా సహకరించక ఆమే ఓటమి పాలు అయ్యారు. ఇక వంశీక్రిష్ణకు ఎమ్మెల్సీ ఇచ్చి తూర్పులో విజయనిర్మల గెలుపునకు సహకరించాలని వైసీపీ అధినాయకత్వం సూచించినా ఆయన తన వర్గం తాను అన్నట్లుగా ఉంటున్నారు. ఆయన పదవీ కాలం ఆరేళ్ళు ఉంది. దాంతో ఆయన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడంలేదు అని అంటున్నారు

మరో వైపు చూస్తే విజయనిర్మలకు కీలకమైన  విఎమ్మార్డీయే చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. అయినా కూడా  ఆమె తూర్పులో పార్టీని పరుగులు తీయించలేకపోతున్నారు. ఇక ఇదే తూర్పునకు చెందిన మరో నాయకురాలు హరి వెంకట కుమారి మేయర్ గా ఉన్నారు. దాంతో ఆమె కొత్తగా తూర్పు మీద ఆశలు పెట్టుకున్నారు. ముగ్గురూ బలమైన యాదవ సామాజికవర్గానికి చెందిన వారే. అయినా వర్గ పోరుతో ఎవరికి టికెట్ ఇచ్చిన మిగిలిన వారి అవకాశాలను దెబ్బతీసుకుంటారు అని అంటున్నారు. ఇదే వెలగపూడి మరోమారు గెలవడానికి కారణం అవుతుంది అని కూడా అంటున్నారు.

ఇక విశాఖ పశ్చిమ నియోజకవర్గం తీసుకుంటే అక్కడ అనేక మంది నాయకులు ఉన్నారు. కొత్తగా విశాఖ రూరల్ కి చెందిన ఆడారి ఆనంద్ ని తెచ్చి ఇంచార్జిని చేశారు. ఆయన నాన్ లోకల్ అని పార్టీలోని వారు సహకరించడంలేదు. ఇక 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఇప్పటిదాకా ఇంచార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ వర్గం అయితే పూర్తిగా సైలెంట్ గా ఉంది. ఇంకో వైపు లోకల్ లీడర్స్ తమకు టికెట్ వస్తుందా అన్న ఆశతో ఉన్నారు. డిప్యూటీ మేయర్ జియ్యానీ శ్రీధర్ కూడా రేసులో ఉన్నారు. దాంతో ఆడారికి పెద్దగా పార్టీ నుంచి సహకారం అందడంలేదు.

ఇక సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ఇప్పటికి మూడు సార్లు గెలిచిన నేత. తండ్రి దివంగత ఎంపీ టీడీపీ సీనియర్ నేత అప్పలనరసిం హం కుమారుడు. అలా రాజకీయ వారసత్వం ఆయన కొనసాగిస్తున్నారు. దాంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడకే ఇక్కడ అంటున్నారు. వైసీపీ ప్రతీ ఎన్నికకూ ఒక అభ్యర్ధిని మారుస్తూ చేస్తున్న ప్రయోగాలు పశ్చిమలో ఈసారి దెబ్బేస్తాయని అంటున్నారు.

విశాఖ ఉత్తరంలో టీడీపీ బలంగా ఉంది. గంటా శ్రీనివాసరావు మరోమారు పోటీ చేస్తే గెలవడం ఖాయం. ఆయన కాకపోయినా కొత్త అభ్యర్ధికి టికెట్ ఇచ్చినా కూడా విజయావకాశాలు ఉంటాయనే అంటున్నారు. వైసీపీ ఇంచార్జి కేకే రాజుకు హైప్ పెరగడంలేదు. పైగా ఆయన సామాజికవర్గం ఓట్లు తక్కువగా ఉండడంతో వైసీపీకి అది ఇబ్బందిగా ఉంది అంటున్నారు. మరి చివరి నిముషంలో వైసీపీ బలమైన కాపులకు ఈ సీటు ఇస్తే ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

విశాఖ దక్షిణం తీసుకుంటే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ వైపు వెళ్ళిపోయారు. అయితే ఆయన పార్టీని విడిచినా టీడీపీకి క్యాడర్ బలంగానే ఉంది. దాంతో వారంతా ఆ పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని తెచ్చి ఇక్కడ ఇంచార్జిగా నియమించారు. బాబ్జీ దూకుడు రాజకీయం చేస్తారు. దాంతో పాటు టీడీపీకి వెన్నుపోటు పొడిచారు అన్నది వాసుపల్లికి మైనస్ అవుతుందని అంటున్నారు. మొత్తానికి చూస్తే నాలుగు సీట్లలో వైసీపీ ఎదురీదుతోందని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.