Begin typing your search above and press return to search.

ఈ అప్పులు తీరేదెప్ప‌టికి.. ఏపీలో సామాన్యుల రొద‌!

By:  Tupaki Desk   |   30 May 2023 6:59 PM GMT
ఈ అప్పులు తీరేదెప్ప‌టికి.. ఏపీలో సామాన్యుల రొద‌!
X
రాష్ట్రానికి అప్పుల బాధ తప్పదా? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ అప్పుల బాధ భరించాలి? అనేది సామాన్యుల ప్ర‌శ్న‌గా మారింది. నిజానికి ఇప్పుడున్నటువంటి అప్పులే భారీ స్థాయిలో రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెబుతున్నటువంటి లెక్కల ప్రకారం ఏడు లక్షల 678 కోట్ల రూపాయలు ప్రజలపై భారంగా ఉంది. అంటే ఒక్కొక్క కుటుంబం పై దాదాపు రెండు లక్షల 50 వేల రూపాయలు అప్పు ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనిని పక్కన పెడితే మద్యం అమ్మకాల మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని పాతిక సంవత్సరాలు పాటు తాకట్టు పెట్టి వైసిపి ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చింది.

అదేవిధంగా కార్పొరేషన్ల ద్వారా మరికొంత తీసుకొచ్చింది. ఇలా చూసుకున్నట్లయితే మొత్తంగా 15 లక్షల పైచిలుకు మొత్తం వైసిపి అప్పుగా తెచ్చిన అప్పు అని స్పష్టంగా తెలుస్తోంది. అంటే దీన్నిబట్టి రాష్ట్ర ప్రజలందరి మీద కూడా మూడు నుంచి నాలుగు లక్షలు ప్రతి తలకాయ మీద అప్పు ఉందని లెక్క తేలుతోంది. ఇది తీర్చేటటువంటి మార్గం కనిపించడం లేదు అనేది వాస్తవం. వైసిపి ప్రభుత్వం ఏపీ ని అప్పుల్లోముంచేస్తోంద‌ని, అప్పులపాలు చేస్తోందని ఏపీలో అప్పులు పెరిగిపోతున్నాయని ప్ర‌తిప‌క్షాలు కూడా వ్యాఖ్యానించాయి.

మరి దీన్ని తగ్గించేటటువంటి వ్యూహాలు, తగ్గించేటటువంటి మార్గాలు వైసిపి ప్రభుత్వం అన్వేషించడం లేదు. మరోవైపు టిడిపి ప్రభుత్వం వస్తే అప్పులు తగ్గుతాయని, టిడిపి ప్రభుత్వం వస్తే ఆదాయం పెరుగుతుందని ఒక వర్గం ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మేధావి వర్గాలు చదువుకున్న వారు విద్యావంతులు వీళ్ళందరూ కూడా టిడిపి ప్రభుత్వం వ‌స్తే.. అప్పులు తగ్గుతాయి అనేటటువంటి ఆశ అయితే బలంగా ఉంది. కానీ ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు కూడా ఆ దిశగా పెద్దగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపించడం లేదు.

ఆయన ఇటీవల ప్రకటించిన మినీ మేనిఫెస్టోను గమనించినట్లయితే పథకాలు ప్రకటించారు. కానీ అప్పుల ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు. ఇప్పుడు అప్పులు భారీగా ఉన్నాయి దీనిని ఈ రకంగా తీరుస్తానని కానీ లేదు ఈ రకంగా ముందుకు వెళ్దామని గాని ఈ రకంగా మనం అప్పుల నుంచి బయట పడదామని గాని ఎక్కడ మాట మాత్రం కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించ‌లేదు. దీన్నిబట్టి వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అప్పుల గురించి రాజ‌కీయ నేత‌లు ఎవరూ ఆవేద‌న చెందేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు.

మొత్తంగా ఇది ఏపీ ప్రజలకు శాపంగా మారుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి వచ్చే ప్రభుత్వాలు ఏదైనా కూడా అప్పులు తగ్గించే ప్రయత్నం చేయాలి తప్ప మరిన్ని అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆ దిశగా ముందుకు తీసుకెళ్తాయనేది సందేహంగా మారింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు చేసిన అప్పుల మీద వడ్డీ కోట్ల రూపాయలు కట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో అమలు చేసేటటువంటి సంక్షేమ పథకాలకు మరిన్ని అప్పులు చేయడం ఖాయంగా కనిపిస్తున్నద‌ని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.