పేటలో గొల్లుమంటున్న వైసీపీ...అనితానందమేనా...?

Sun Sep 25 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

News on Vangalapudi Anitha

ఉమ్మడి విశాఖ జిల్లాలో బలమైన సీటు అనుకున్న చోటనే ఫ్యాన్ పార్టీ చక్రాలను సొంత వారే ఊడగొట్టేసే పరిస్థితి కనిపిస్తోంది. పాయకరావుపేట వైసీపీలో వర్గ పోరు ఉప్పు నిప్పులా మారి ఇపుడు గుప్పుమని బయటకు తన్నుకొస్తోంది. చివరికి వీధి పోరాటాల దాకా అది మారి పార్టీ పరువుని బయటపడేస్తోంది.తూర్పుగోదవరి జిల్లా సరిహద్దుల్లో ఉన్న పాయకరావు పేట సీటు టీడీపీ పెట్టిన నాటి నుంచి ఆ పార్టీకి కంచుకోట. అలాంటి సీట్లో 2009 ఎన్నికల్లో ఫస్ట్ టైం కాంగ్రెస్ జెండా ఎగరేశారు గొల్ల బాబూరావు. ఆయన మాజీ ప్రభుత్వ అధికారి. వైఎస్సార్ మీద అభిమానంతో ఆయన ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారు. అలా ఆయన పాయకరావు పేట నుంచి గెలిచి సత్తా చాటారు.

ఇక వైఎస్సార్ మరణానంతరం అయాన జగన్ వైపు వచ్చారు. 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లో సైతం ఆయన రెండవసారి ఇదే సీటుని గెలుచుకున్నారు. 2014లో ఆయన అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడారు. అయితే 2019 నాటికి ఆయన తిరిగి పాయకరావుపేట నుంచి పోటీ చేసి మూడవసారి గెలిచారు.

రెండవ విడతలో అయినా మంత్రి పదవి వస్తుందని ఆశించినా దక్కకపోవడంతో ఆయన ఆ మధ్యన మీడియా ముందే తన నిరసన వ్యక్తం చేసి అధినాయకత్వానికి కన్నెర్ర అయ్యారు. అది అలా ఉంచితే నియోజకవర్గంలో కూడా వర్గ పోరు గొల్ల బాబూరావుని ఇబ్బంది పెడుతోంది. ఆయన ఒంటెద్దు పోకడలతోనే  ఇదంతా జరుగుతోంది అని వైసీపీలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది.

ఇక లేటెస్ట్ గా చూస్తే ఎస్ రాయవరం ఎంపీపీ పదవికి వైసీపీ నాయకురాలు బొలిశెట్టి శారద రాజీనామా చేసి ఎమ్మెల్యే మీద ఘాటు విమర్శలు చేశారు. ఆయన వల్లనే తాను పదవి నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. ఇక లేటెస్ట్ గా ఆయన ఆ ప్రాంతానికి పర్యటనకు వస్తే వైసీపీ వారే ఎమ్మెల్యేను అడ్డుకోవడం పార్టీలో మరో మలుపు. వీటికి కొంతకాలం ముందు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జాతీయ రహదారి మీదకు వైసీపీ క్యాడర్ పెద్ద ఎత్తున వచ్చి ఆందోళన చేయడం కూడా జరిగింది.

ఇవన్నీ చూస్తూంటే గొల్ల బాబూరావు పట్టు జారుతోందా అన్న చర్చ సాగుతోంది. మరో వైపు బాబూరావు పట్ల జనంలో కూడా వ్యతిరేకత పెరుగుతోంది అని సర్వేలు చెబుతున్నాయట. వచ్చే ఎన్నికల్లో ఆయన్ని తప్పించి వేరే కొత్త వారికి టికెట్ ఇస్తారని కూడా టాక్ నడుస్తోంది. ఇక టీడీపీ రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ వంగలపూడి అనిత ఇక్కడ నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆమె 2024లో తిరిగి గెలవాలని చూస్తున్నారు.

గట్టి పోటీ ఇస్తుందని బలంగా ఉందని భావిస్తున్న వైసీపీలో బయటపడుతున్న లుకలుకలు  ఆమెకు అమితానందం కలిగిస్తునాయని అంటున్నారు. ఈసారి డ్యాం ష్యూర్ గా తన విజయం ఖాయమని అనిత ధీమా పడుతున్నారు అంటే పేటలో వైసీపీ గొల్లుమంటుందన్న సంకేతాలేనా అన్న చర్చ వస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.