Begin typing your search above and press return to search.

టీడీపీ గెలుపుకు రాచబాట వేస్తున్న మంత్రి గారు

By:  Tupaki Desk   |   8 Feb 2023 5:00 AM GMT
టీడీపీ గెలుపుకు రాచబాట వేస్తున్న మంత్రి గారు
X
ఎవరికైనా బయట శత్రువులు ఉంటారు. వారిని ఎదుర్కోవడానికి పార్టీలో అంతా ఒక్కటి అవుతారు. కానీ మంత్రి సీదరి అప్పలరాజుకు మాత్రం సొంత పార్టీలో శత్రువులు తయారయ్యారు. వారే సవాల్ చేస్తున్నారు. దాంతో పలాసలో దర్జాగా గెలిచేందుకు తెలుగుదేశానికి రాజమార్గం ఏర్పడింది. అక్కడ ఉన్నది మామూలు ప్రత్యర్ధి కాదు. సర్దార్ గౌతు లచ్చన మనవరాలు గౌతు శిరీష. ఆమె తండ్రి గౌతు శ్యామసుందర శివాజీ కూడా పలు దఫాలుగా ఎమ్మెల్యేగా నెగ్గి మంత్రిగా కూడా పనిచేసిన నేత.

అలాంటి ఫ్యామిలీని ఎదురుగా పెట్టుకుని సొంత ఇల్లు చక్కదిద్దుకోలేని స్థితిలో మంత్రి గారు పడ్డారు అని అంటున్నారు శ్రీకాకుళం జిల్లాలో పలాస సీటు ఆ మధ్య దాకా గ్యారంటీగా గెలిచే సీటుగా లెక్క వేశారు. ఎందుకంటే ఉత్తరాంధ్రా జిల్లాలలో మొదటి సారి మత్య్సకార సామాజికవర్గానికి మంత్రి పదవిని ఇచ్చారు. పలాసాలో వారి సంఖ్య ఎక్కువ. దానికి తోడు మంత్రి డాక్టర్ గా ఉన్నారు.

అలా ఆయన తనకంటూ కొంత పలుకుబడిని సంపాదించుకున్నారు. చేతిలో మంత్రి పదవి ఉంది. యువకుడిగా ఉన్నారు. దాంతో సంక్షేమ పధకాలు సోషల్ ఇంజనీరింగ్ కలసి సీదరి అప్పలరాజుని గెలిపిస్తాయని అంచనా కట్టారు. కానీ సీదరి అప్పలరాజు గత ఏడాది దాకా బాగానే ఉండేవారుట. కానీ అయిదేళ్ల మంత్రిగా ప్రమోషన్ కొట్టేశాక ఆయన వైఖరిలో మార్పు వచ్చిందని అదే పార్టీలో అంటున్నారు.

తనను ఎన్నికల్లో గెలిపించి తనతో పాటే ఉన్న వారిని ప్రధాన అనుచరులను నాయకులను మంత్రి దూరం చేసుకున్నారని, ఆయన చుట్టూ ఒక కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లనే మంత్రి ఇపుడు ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. కోటరీ చెప్పిన మాటకే విలువ ఇస్తూ పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టేశారని దాని వల్లనే ఇపుడు మంత్రి గారి నియోజకవర్గంలో బలమైన అసమ్మతి వర్గం ఏర్పడింది అని అంటున్నారు.

పార్టీ నిట్ట నిలువునా చీలిపోయింది అని అంటున్నారు. మంత్రిని సవాల్ చేసే స్థాయిలో ఇపుడు అసమ్మతి నాయకులు ఉన్నారని అంటున్నారు. పలాసలో ప్రధాన సామాజికవర్గంగా కాళింగులు ఉన్నారు. వారి నుంచి మంత్రికి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దువ్వాడ శ్రీకాంత్ అనే ముఖ్య నేతను మంత్రి పట్టించుకోకపోగా ఆయనకు పలాస మునిసిపల్ చైర్మన్ పదవిని ఇస్తాను అని చెప్పి ఇవ్వకపోవడంతో గట్టి రెబెల్ గా మారిపోయారు. ఆయనతో పాటు హేం బాబు చౌదరి అనే మరో నాయకుడు కూడా మంత్రికి ఎదురు నిలిచి పోరాడుతున్నారు

వచ్చే ఎన్నికల్లో మంత్రికి టికెట్ ఇవ్వకుండా చూడాలని పార్టీ పెద్దల వద్ద వీరు కోరుతున్నారని అంటున్నారు. మంత్రి అప్పలరాజుకు టికెట్ ఇస్తే కనుక కచ్చితంగా ఓడించి తీరుతామని వారు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇపుడు మంత్రి పరిస్థితి ఇరకాటంలో పడింది అని అంటున్నారు. ఈ అసమ్మతి నేతలు తరచూ సమావేశాలు పెడుతున్నారు. అప్పలరాజు కాకుండా తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని కూడా ప్రతిపాదిస్తున్నారు.

నిజానికి లక్కీ మినిస్టర్ గా అప్పలరాజుకు పేరుంది. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. అంతే స్పీడ్ గా మంత్రి అయ్యారు. మరిన్ని టెర్ములు గెలవాలీ అంటే పార్టీలోని అందరినీ సజావుగా చూసుకోవాల్సినమంత్రి మాత్రం ఆ విషయం విస్మరించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. ఇపుడు మంత్రి క్యాంప్ నుంచి రాజీకి ప్రయత్నాలు జరిగినా అసమ్మతి శిబిరం మాత్రం ససేమిరా అని అంటోందిట. అంతే కాదు అప్పలరాజుని మాజీని చేస్తామని భీష్మించుకుని కూర్చుకున్నారుట.

ఇక వైసీపీలో జరుగుతున్న ఈ పరిణామాలను టీడీపీ బాగా సొమ్ము చేసుకుంటోంది. తలపండిన నాయకులు ఆ వైపున ఉన్నారు. అంతా కలసి వైసీపీ అసమ్మతిని తమకు అనుకూలంగా చేసుకుంటున్నారు. ఈసారి గౌతు శిరీష గెలవడం ష్యూర్ అని తమ్ముళ్ళు అంటున్నారు. మరి మంత్రి గారు రిపేర్లు ఏమైనా చేసుకుంటారా అన్నదే చూడాల్సి ఉంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.